సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో మూడో రోజు కూడా విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి సహాయకాలను పంపిణీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీని సీఎం స్టాలిన్ పరిశీలించారు. వర్షాలు తగ్గే వరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
నేడు అల్పపీడనం
ఇప్పటికే డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడు పరిధిలోని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో ఉబరి నీటిని బయటకు పంపిస్తున్నారు. చెన్నైకు నీరు అందించే చెంగల్పట్టు జిల్లా మధురాంతకం, కడలూరు జిల్లా వీరానం చెరువులు సైతం పూర్తిగా నిండటంతో పరివాహక ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేశారు. ఇక, సేలం జిల్లా మేట్టూరు జలాశయం మంగళవారం పూర్తి నీటిమట్టం 117 అడుగుల్ని చేరనుంది. దీంతో డెల్టా జిల్లాల్లోని కావేరీ తీర ప్రజల్ని అలర్ట్ చేశారు. మదురై వైగై నదీ, ఈరోడ్ భవానీ సాగర్‌లు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు ముంచెత్తుతున్న సమయంలో బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది.
ఈ ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరుతో పాటుగా 14 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, చెన్నై,శివారు జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో చెన్నై పెరంబూరులో 14 సె.మీ, మధురాంతకం, చోళవరం, చేయ్యారులో 13 సె.మీలు, తండయార్ పేటలో 10 సె.మీ వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలు ఐదు రోజులు కొనసాగుతాయని, అల్పపీడన ద్రోణి వాయుగుండంగా, ఆ తదుపరి తుపాన్‌గా మారి ఉత్తర తమిళనాడు వైపుగా దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువేనని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం మూడు గంటల పాటుగా 6 సె.మీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భంధంలో చిక్కాయి.
చదవండి: (వరద నీటిలోనే చెన్నై)
చెన్నై వాసుల్లో ‘గత’ ఆందోళన
భారీ వర్షాల కారణంగా చెన్నై మళ్లీ మునగడం ఖాయం అన్న ప్రచారం జోరందుకుంది. 2015 నాటి పరిస్థితి తప్పదేమో అన్న ఆందోళనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లలో, రోడ్లకు సమీపంలో నివాసం ఉన్న వాళ్లు శిబిరాల వైపుగా సాగుతున్నారు. అయితే, గతం పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తల్ని విస్తృతం చేసింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లను వెనక్కు రప్పించే పనిలో కోస్టుగార్డు వర్గాలు నిమగ్నం అయ్యాయి. కాగా, ఆయా జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించుకునే అధికారం జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. దీంతో సోమవారం చెన్నై, శివారు జిల్లాల్లోనే కాకుండా అనేక జిల్లాల్లో సెలవు ప్రకటించారు. మరోవైపు వర్షాల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతినడంతో.. సోమవారం కాయగూరల ధరలకు రెక్కు లొచ్చాయి. టమాట కిలో రూ. వందకి పైగా పలకడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment