Amma Canteens
-
అమ్మా.. ఆకలి!
సాక్షి, చెన్నై: అమ్మక్యాంటీన్లపై ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పడింది. దీంతో వీటి నిర్వహణ కార్పొరేషన్లకు భారంగా మారింది. నేపథ్యం ఇదీ.. 2011లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ‘అమ్మ’ పేరిట పథకాల వేగం పెరిగిన విషయం తెలిసిందే. జయలలితను అమ్మగా భావించి ఈ పథకాల్ని హోరెత్తించారు. ఇందులో అమ్మ క్యాంటిన్ అందరి కడుపు నింపే అమ్మగా మారింది. అమ్మ సిమెంట్, అమ్మవాటర్, అమ్మ మెడికల్స్, అమ్మ స్కూటర్, అమ్మ ప్రసూతి చికిత్స, అమ్మ క్లీనిక్, అంటూ ఎటూ చూసినా అమ్మ పథకాలే అమల్లోకి వచ్చాయి. అయితే, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనమైంది. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మే 7వ తేదీతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో ఎన్నో అమ్మపథకాల్ని తుంగలో తొక్కేశారు. అయితే, అమ్మక్యాంటీన్లను మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్యాంటీన్లను నిర్వీర్యం చేయబోమంటూనే, అనేక జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా మూత వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకు కారణంగా త్వరలో డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పేరిట క్యాంటీన్లు పుట్టుకు రాబోతుండటమే అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు చెన్నై కార్పొరేషన్ పరిధిలోని అమ్మ క్యాంటీన్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిర్వహణకు నానాపాట్లు.. చెన్నై నగరంలో 200 మేరకు క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ఆది నుంచి చౌక ధరకే ఇడ్లీ, చపాతి, సాంబర్ అన్న, లెమన్ రైస్, వంటి పదార్థాలను అందజేస్తూవస్తున్నారు. వీటికి ఉపయోగించే వస్తువుల్ని ఓ సంస్థ సరఫరా చేస్తోంది. రెండు నెలల క్రితం ఆ సంస్థ వర్గాలు కార్పొరేషన్ మీద కన్నెర్ర చేయాల్సి వచ్చింది. తమకు చెల్లించాల్సిన అప్పు రూ. 20 కోట్ల త్వరితగతిన మంజూరు చేయాలని పట్టుబట్టక తప్పలేదు. ఇక ఎట్టకేలకు అప్పు చెల్లించినా, ప్రస్తుతం పాత ధరలకే నిత్యావసర వస్తువుల పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని ఆ సంస్థ కార్పొరేషన్‌కు స్పష్టం చేసింది. చెన్నైలోని క్యాంటీన్లను రోజూ రెండు లక్షల మంది పేదలు, కార్మికులు ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఉన్నట్టుగా ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రస్తుతం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కార్పొరేషన్ వర్గాలు స్పందిస్తూ.., క్యాంటీన్లను ఓ సేవగా తాము కొనసాగిస్తున్నామని, ఇందులో లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. ఏటా రూ. 120 కోట్లు క్యాంటీన్ల నిర్వహణకు ఖర్చు అవుతోందని, ఆదాయం మాత్రం రూ. పది కోట్లుగానే ఉందని వివరించారు. ఆది నుంచి నష్టాలు ఉన్నా, సేవాదృక్పథంతో కొనసాగిస్తున్నామని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
అప్పటి వరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో మూడో రోజు కూడా విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి సహాయకాలను పంపిణీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీని సీఎం స్టాలిన్ పరిశీలించారు. వర్షాలు తగ్గే వరకు అమ్మ క్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. నేడు అల్పపీడనం ఇప్పటికే డెల్టా జిల్లాలు, ఉత్తర తమిళనాడు పరిధిలోని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్లు నిండడంతో ఉబరి నీటిని బయటకు పంపిస్తున్నారు. చెన్నైకు నీరు అందించే చెంగల్పట్టు జిల్లా మధురాంతకం, కడలూరు జిల్లా వీరానం చెరువులు సైతం పూర్తిగా నిండటంతో పరివాహక ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేశారు. ఇక, సేలం జిల్లా మేట్టూరు జలాశయం మంగళవారం పూర్తి నీటిమట్టం 117 అడుగుల్ని చేరనుంది. దీంతో డెల్టా జిల్లాల్లోని కావేరీ తీర ప్రజల్ని అలర్ట్ చేశారు. మదురై వైగై నదీ, ఈరోడ్ భవానీ సాగర్లు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు ముంచెత్తుతున్న సమయంలో బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఈ ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరుతో పాటుగా 14 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, చెన్నై,శివారు జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో చెన్నై పెరంబూరులో 14 సె.మీ, మధురాంతకం, చోళవరం, చేయ్యారులో 13 సె.మీలు, తండయార్ పేటలో 10 సె.మీ వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలు ఐదు రోజులు కొనసాగుతాయని, అల్పపీడన ద్రోణి వాయుగుండంగా, ఆ తదుపరి తుపాన్‌గా మారి ఉత్తర తమిళనాడు వైపుగా దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువేనని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం మూడు గంటల పాటుగా 6 సె.మీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భంధంలో చిక్కాయి. చదవండి: (వరద నీటిలోనే చెన్నై) చెన్నై వాసుల్లో ‘గత’ ఆందోళన భారీ వర్షాల కారణంగా చెన్నై మళ్లీ మునగడం ఖాయం అన్న ప్రచారం జోరందుకుంది. 2015 నాటి పరిస్థితి తప్పదేమో అన్న ఆందోళనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లలో, రోడ్లకు సమీపంలో నివాసం ఉన్న వాళ్లు శిబిరాల వైపుగా సాగుతున్నారు. అయితే, గతం పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తల్ని విస్తృతం చేసింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లను వెనక్కు రప్పించే పనిలో కోస్టుగార్డు వర్గాలు నిమగ్నం అయ్యాయి. కాగా, ఆయా జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించుకునే అధికారం జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. దీంతో సోమవారం చెన్నై, శివారు జిల్లాల్లోనే కాకుండా అనేక జిల్లాల్లో సెలవు ప్రకటించారు. మరోవైపు వర్షాల కారణంగా రవాణా మార్గాలు దెబ్బతినడంతో.. సోమవారం కాయగూరల ధరలకు రెక్కు లొచ్చాయి. టమాట కిలో రూ. వందకి పైగా పలకడం గమనార్హం. -
జయలలిత బాటలో దీదీ: విజయం వరిస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొందరు ప్రజాబలాన్ని నమ్మితే.. మరికొందరు సెంటిమెంట్‌నే నమ్ముతున్నారు. తొలిసారి విజయానికి దోహదం చేసిన అంశాలను గుర్తుపెట్టుకుని ప్రతిసారి అదే పంథాను ఎంచుకుంటారు. విజయం కోసం ఒక్కోసారి ఇతర నేతలు పాటించిన వ్యూహాలు, ఎత్తుగడలను సైతం అనురిస్తున్నారు. ఓటర్లు కరుణించినా.. అదృష్టం కలిసిరాకపోతే అధికారం అందదని భావించే నేతలు కూడా చాలామందే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి అంటే చాలు ప్రచారానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. తమకు కలిసివచ్చే అంశాలకు సైతం అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెంటిమెంటే ప్రధానంగా వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి బెంగాల్ కోటపై జెండా పాతాలని భావిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఏ ఒక్క అవకాశాన్నీ వదలడంలేదు. విపక్షాల ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ప్రశాంత్ కిషోర్ రూపంలో వ్యూహకర్త ఉన్నప్పటికీ తన సొంత ఆలోచనలకు సైతం పదునుపెడుతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు ఎన్నికల్లో గెలిచిన నేతల వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అమ్మా క్యాంటిన్స్‌ను బెంగాల్లోనూ ప్రారంభించారు. మా క్యాంటిన్ పేరుతో కేవలం రూ.5కే భోజన సదుపాయాన్ని బెంగాలీలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని కోసం 100 కోట్ల రూపాయాలను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సయమంలో 2013లో అమ్మా క్యాంటిన్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే అమ్మా క్యాంటిన్ ఏర్పాటు అనంతరం జరిగిన 2016 ఎన్నికల్లో జయలలిత వరుసగా రెండోసారి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. 1980 తరువాత ఒకేపార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో అదే తొలిసారి. అయితే జయలలిత ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మా క్యాంటిన్ అత్యంత ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జయ వ్యూహాన్నే తానూ అమలు చేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని దీదీ కలలు కంటున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికలకు రెండు నెలల ముందు మా క్యాంటిన్‌ను లాంఛ్ చేశారు. దీని ద్వారా నగరాల్లో ఉపాధి పొందుతున్న పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి లబ్ధి పొందనున్నారు. కాగా జయలలిత అనంతరం దేశ వ్యాప్తంగా అనేక మంది ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే కర్ణాటలోలో సిద్ధరామయ్య ఇందిర క్యాంటిన్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటిన్ ప్రవేశపెట్టినప్పటికీ ఓటమిని చవిచూశారు. 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రూ.5కే భోజనం హామీ ఇచ్చినప్పటికీ దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే తెలంగాణలో మాత్రం ఈ ఫార్మాలాతో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తాజాగా మమత కూడా జయ దారినే ఎంచుకున్నారు. తమిళనాడులో మాదిరీగా విజయం సాధిస్తారా లేక ఇతర నేతల్లా ఒటమిని చవిచూస్తారా అనేది చూడాలి. బీజేపీ సవాల్: వ్యూహాలకు ప్రశాంత్ పదును -
అమ్మకు తగ్గిన ఆదరణ
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరంలో పేదలకు చౌక ధరకే కడుపు నింపుతున్న ‘అమ్మ’ క్యాంటీన్లకు ఆదరణ తగ్గింది. ఇందుకు కారణం నాణ్యత కొరవడడమే అన్న సంకేతాలు వెలువడ్డాయి. అధికారులు స్థానిక ఎన్నికల పనుల బిజీలో ఉండడంతో క్యాంటీన్లపై దృష్టి పెట్టే వాళ్లు కరువయ్యారు. దీంతో నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వీకరించేందుకు పేద ప్రజానీకం మొగ్గు చూపడం లేదు.చెన్నై మహానగరంలో స్టార్ హోటళ్ల మొదలు ఫుట్‌పాత్ టిఫిన్ సెంటర్ల వరకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. వీధికి నాలుగైదు హోటళ్లు, ఫాస్టు ఫుడ్స్, బిర్యానీ సెంటర్లు, రోడ్డు సైడ్ దుకాణాలు దర్శనం ఇస్తుంటాయి. రోడ్ సైడ్ దుకాణాలు మినహా తక్కిన చోట్ల ధరలు సామాన్యుడికి భారమే. చెన్నై వంటి మహానగరంలో తక్కువ జీతానికి పనిచేసే చిరుద్యోగులు, రోజూవారి కూలీలు, గుడిసెల్లో, రోడ్డు సైడ్లలో నివసించే వారు, మోత కార్మికులు, ఇలా పేద వర్గాలకు చౌక ధరకే కడుపు నింపాలన్న కాంక్షతో బృహత్తర పథకాన్ని అమ్మ జయలలిత 2013లో ప్రవేశ పెట్టారు. అమ్మ పేరుతో తొలుత చెన్నైలో నెలకొల్పిన క్యాంటీన్లు, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చౌక ధరకే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రుల్లో చపాతి వంటి వాటిని విక్రయిస్తూ వస్తున్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా, కేవలం పేదలకు కడుపు నింపడం లక్ష్యంగా నెలకొల్పిన ఈ క్యాంటీన్ల రూపంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఓట్ల వర్షం కురిశాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలిచిన ఈ పథకం ప్రస్తుతం పాలకులకు భారంగా మారినట్టుంది. కొరవడ్డ నాణ్యత.... అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఈ క్యాంటీన్లను నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈక్యాంటీన్ల ద్వారా లాభ నష్టాలను బేరీజు వేసే పనిలో అధికారులు పడ్డట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.చెన్నై నగరంలో రెండు వందల వార్డుల్లో ఈ క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే, నగర శివార్లల్లోనూ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ క్యాంటీన్లలో మూడు వేళల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం, వంటి పనులకు రెండు షిఫ్టులుగా మహిళలు పనిచేస్తున్నారు. వీరి జీతాలు, నిర్వహణ, ఆహార పదార్థాల తయారీ అంటూ మొత్తంగా రూ. 120 కోట్లు ఖర్చు ఏడాదికి అవుతుండగా, కేవలం రూ. 30 కోట్ల మేరకు మాత్రం ఆదాయం వస్తున్నట్టుగా ఇటీవల లెక్కల్లో అధికారులు తేల్చారు. క్యాంటీన్లను బలోపేతం చేయాలంటే, మరింత నిధులు తప్పనిసరి కావడంతో, ఇందుకు తగ్గ నివేదిక ప్రభుత్వానికి కార్పొరేషన్ నుంచి వెళ్లినా, అక్కడి నుంచి స్పందన లేని దృష్ట్యా, ప్రస్తుతం నాణ్యత అన్నది కొరవడి ఉంది. అన్ని రకాల ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడడంతో పేదలు సైతం అటు వైపుగా వెళ్లడం మానేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా క్యాంటీన్లలో తయారు చేసిన ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో చెత్త కుండీల్లో వేయాల్సిన పరిస్థితి అనేక చోట్ల ఉన్నట్టు సమాచారం. నాణ్యత కొరవడం, విక్రయాలు గణనీయంగా తగ్గడం వెరసి ఇక, క్యాంటీన్లకు మంగళం పాడేనా అన్న చర్చకు తెరపైకి తెచ్చింది. కాగా స్థానిక ఎన్నికల పనుల బిజీలో కార్పొరేషన్ అధికారులు అందరూ బిజీగా ఉన్న దృష్ట్యా, ఇప్పట్లో క్యాంటీన్లపై దృష్టి పెట్టింది అనుమానమే. -
నగరంలో మరో 22 అమ్మ క్యాంటీన్లు
300 క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ బాధ్యతలేని సిబ్బందిపై చర్యలు ప్రజల అభిమానాన్ని చొరగొన్న అమ్మ క్యాంటీన్లు మరికొన్ని ప్రజల ముందుకు రానున్నాయి. చెన్నైలో 22 కొత్త క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 300 క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని త్వరలో ప్రవేశ పెట్టారు. చెన్నై: చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో మొత్తం 300 అమ్మ క్యాంటీన్లు సేవలు అందిస్తున్నాయి. అతి తక్కువ ధరకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ లు సరఫరా చేయడం ప్రజలను ఆకట్టుకుంది. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అ మ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల రోగులతోపాటు వచ్చే బంధువులు సౌకర్యాన్ని పొందుతున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మరో 22 అమ్మ క్యాంటీన్లు నెలకొల్పాలని కార్పొరేషన్ నిర్ణయించింది. అమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం శనివారం అన్వేషణ ప్రారంభమైంది. స్థలం ఎంపిక జరగ్గానే నిర్మాణ పనులను పూర్తిచేసి వీలయినంత త్వరలో అమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పారు. కంప్యూటర్ బిల్లింగ్: పేదల ప్రయోజనార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లపై కింది, మధ్యతరగతి ప్రజల అభిమానాన్ని సైతం చూరగొనడంతో అదనపు సౌకర్యాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అమ్మ క్యాంటీన్ల ద్వారా రోజూ వేలాది మంది ఆహారం తీసుకుంటుండగా లక్షల్లో ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సమయాల్లో అనేక వంటకాలు సిద్ధం చేయడం వల్ల నగదు స్వీకరణ, టోకన్ల జారీ అక్కడి సిబ్బందికి కష్టంగా మారింది. అంతేగాక అమ్మకాలపై నిర్దిష్టమైన లెక్కలు కొరవడినట్లు కార్పొరేషన్ గుర్తించింది. దీంతో ఇకపై ప్రతి అమ్మ క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. 255 అమ్మ క్యాంటీన్లలో కొత్త కంప్యూటర్లను అమర్చగా, మిగిలిన 45 క్యాంటీన్లలో గతంలోని మిషిన్లను కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై కార్పొరేషన్ ప్రజా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సెంథిల్నాథన్ మాట్లాడుతూ అమ్మ క్యాంటీన్లకు అవసరమైన వస్తువుల కొనుగోలు, ఆహార పదార్థాల అమ్మకాలపై ఒక నిర్ధారణకు వచ్చేందుకు కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. అంతేగాక అమ్మ క్యాంటీన్లను ఎన్నిగంటలకు తెరుస్తున్నారు, మూస్తున్నారనే వివరాలు సైతం బిల్లులో నమోదు కావడం వల్ల సిబ్బందిలో క్రమశిక్షణ పెరుగుతుందని చెప్పారు. ఆహార పదార్థాల స్టాకు ఉన్నా ముందుగానే క్యాంటీన్లను మూసివేస్తే తాము తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలను తీసుకునేందుకు కంప్యూటర్ బిల్లింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. -
ఆస్పత్రుల్లో అమ్మ క్యాంటీన్లు
సాక్షి, చెన్నై:రాజధాని నగరంలో అమ్మ పేరిట కొలువు దీరిన క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తున్న విషయం తెలి సిందే. ఈ క్యాంటీన్లను రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు విస్తరించారు. చెన్నైలో 200 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు పేదలకు, నగరంలో తక్కువ జీతాలకు పనులు చేసుకుంటున్న వాళ్లకు ఎంతో దోహదకారిగా ఉన్నాయి. రూ.6 కే సాంబారన్న, కరివేపాకు అన్నం, లెమన్ రైస్ లభిస్తుండడంతో కడుపు నిండా తినే అవకాశం ఉంది. ఈ క్యాంటీన్లను దేశంలోని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తమ రాష్ట్రాల్లో ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. అక్కడి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి క్యాంటీన్లను పరిశీలించి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ క్యాంటీన్లను మరింత విస్తృతం చేయడం లక్ష్యంగా సీఎం జయలలిత నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు, అక్కడికి వచ్చి వెళ్లే వారికి తక్కువ ఖర్చుతో కడుపునిండా తిండి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో నగరంలో తొలి విడతగా జీహెచ్‌లో ఇది వరకు ఓ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనికి అమిత స్పందన రావడంతో నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ క్యాంటీన్ల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నారు. ఆసుపత్రుల్లో... : నగరంలోని నాలుగు ఆస్పత్రుల్లో సోమవారం క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ట్రిప్లికేన్‌లోని కస్తూరిబాయ్ ప్రసూతి ఆస్పత్రి, రాయపేటలోని జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పతి, కీల్పాకం ఆస్పత్రుల ఆవరణలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం ట్రిప్లికేన్ కస్తూరి బాయ్ ఆస్పత్రిని సీఎం జయలలిత ప్రారంభించారు. కొందరికి స్వయంగా ఆమె వంటకాలు వడ్డించారు. అలాగే, కరివేపాకు అన్నం రుచి చూసి చాలా బాగుంది అంటూ అక్కడి సిబ్బందిని అభినందించారు. అనంతరం అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగిలిన ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ సైదై దురై స్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్, నగర కమిషనర్ విక్రమ్ కపూర్, నగరాభివృద్ధి శాఖప్రధాన కార్యదర్శి ఫనీంద్ర రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ అమ్మ... ఇక్కడ అన్న!!
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్ల తరహాలోనే వీటిని కూడా ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 'అమృతహస్తం' పేరుతో 5 రూపాయలకే భోజనం పథకం ఇప్పటికే అమలవుతోంది. త్వరలోనే ఒక్క రూపాయికే టిఫిన్ పథకాన్ని కూడా అమలుచేయాలని భావిస్తున్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ పథకం ఒక్కడ కొనసాగుతోంది. ఇక తమిళనాడులో అయితే.. మునిసిపల్ కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాల సహకారంతో ఈ పథకం అమలవుతోంది. వీటిపేరు అమ్మ క్యాంటీన్లు. చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో కూడా ఇవి నడుస్తున్నాయి. కోయంబత్తూరులో ఉన్న పది క్యాంటీన్లలో మూడింటికి పాక్షికంగా సౌర విద్యుత్తు వినియోగిస్తున్నారు. అమ్మ క్యాంటీన్లలో ప్రధానంగా ఇడ్లీ, సాంబారు అన్నం, పెరుగన్నం, పొంగల్, పులిహోర, కర్వేపాకు అన్నం, చపాతీలు ఉంటాయి. ఒక ఇడ్లీ ఒక రూపాయి, సాంబార్ అన్నానికి 5 రూపాయలు, పెరుగన్నానికి 3 రూపాయలు వసూలు చేస్తారు. వీటికి అయ్యే అదనపు వ్యయాన్ని ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు భరిస్తుంటాయి. అయితే, ఇలా భరించడంపై అక్కడ కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేసే 'అన్న క్యాంటీన్లు' ఎలా పనిచేస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. ఇక్కడ కూడా 5 రూపాయలకు భోజనం పెడతామని చెబుతున్నా, ఏయే సంస్థల సహకారంతో దీన్ని అమలుచేస్తారో తెలియట్లేదు. అలాగే, వీటిలో ఏయే వర్గాలకు భోజనాలు, అల్పాహారాలు అందిస్తారో కూడా ప్రకటించలేదు. ఇలా అనేక విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
‘అమ్మ’ క్యాంటీన్ల విస్తరణ
సాక్షి, చెన్నై:చెన్నై మహానగరంలో తక్కువ జీతానికి పనిచేసే చిరుద్యోగులుగా, రోజు వారి కూలీలు గా, గుడిసెల్లో, రోడ్డు పక్కన నివసించే వారిని, మోత కార్మికులు తదితర పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది అమ్మ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో ఈ క్యాంటీన్ల విస్తరణ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు చెన్నైలోని 200 వార్డుల్లోను క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. చౌక ధరకే ఇడ్లీ, సాంబారు అన్నం, పులి హోరా, పెరుగన్నంతో పాటుగా రోజుకో ప్రత్యేక డిష్, చపాతీలను ఈ క్యాంటీన్లలో అందిస్తున్నారు. ఈ క్యాంటీన్లకు ఆదరణ పెరగడంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఏర్పాటు చేసే పనులు వేగవంతం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపించడంలో ఈ క్యాంటీన్లు ఎంతో దోహద పడ్డాయన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ స్పష్టం చేయడంతో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి సీఎం జయలలిత నిర్ణయించారు. మరో 360 క్యాంటీన్లు: రాష్ట్రంలో మరో 360 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 129 మునిసిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. చెన్నై మహానగరంలోని 200 వార్డుల్లో అదనంగా వార్డుకు ఒకటి చొప్పన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. కోయంబత్తూరు, మదురై, దిండుగల్ తదితర కార్పొరేషన్లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు ఆదేశించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్ల సంఖ్య 654కు చేరింది. ఈ ఏడాదిలో వెయ్యి క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. డీజిల్ ధరపై ఆగ్రహం : డీజిల్ పై లీటరకు 50 పైసలుపెంచడాన్ని సీఎం జయలలిత వ్యతిరేకించారు. కొత్త ప్రభుత్వంలో ధరలు తగ్గుతాయ న్న ఆశతో ప్రజలు ఉంటే, వారి ఆశలను అడియాశలు చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. యూపీఏ బాటలో కొత్త ప్రభుత్వం ముందుకు సాగడం విచారకరంగా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో డీజిల్ ధరను పెంచడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూపీఏ పద్ధతిని పక్కన పెట్టి, కొత్తవిధానంతో ముందుకెళ్లాలని సూచించారు. చమురు కంపెనీల చేతిలో ఉన్న ధరల పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.