అక్కడ అమ్మ... ఇక్కడ అన్న!!
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్ల తరహాలోనే వీటిని కూడా ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 'అమృతహస్తం' పేరుతో 5 రూపాయలకే భోజనం పథకం ఇప్పటికే అమలవుతోంది. త్వరలోనే ఒక్క రూపాయికే టిఫిన్ పథకాన్ని కూడా అమలుచేయాలని భావిస్తున్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ పథకం ఒక్కడ కొనసాగుతోంది.
ఇక తమిళనాడులో అయితే.. మునిసిపల్ కార్పొరేషన్లు, స్వయం సహాయక సంఘాల సహకారంతో ఈ పథకం అమలవుతోంది. వీటిపేరు అమ్మ క్యాంటీన్లు. చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో కూడా ఇవి నడుస్తున్నాయి. కోయంబత్తూరులో ఉన్న పది క్యాంటీన్లలో మూడింటికి పాక్షికంగా సౌర విద్యుత్తు వినియోగిస్తున్నారు.
అమ్మ క్యాంటీన్లలో ప్రధానంగా ఇడ్లీ, సాంబారు అన్నం, పెరుగన్నం, పొంగల్, పులిహోర, కర్వేపాకు అన్నం, చపాతీలు ఉంటాయి. ఒక ఇడ్లీ ఒక రూపాయి, సాంబార్ అన్నానికి 5 రూపాయలు, పెరుగన్నానికి 3 రూపాయలు వసూలు చేస్తారు. వీటికి అయ్యే అదనపు వ్యయాన్ని ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు భరిస్తుంటాయి. అయితే, ఇలా భరించడంపై అక్కడ కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేసే 'అన్న క్యాంటీన్లు' ఎలా పనిచేస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. ఇక్కడ కూడా 5 రూపాయలకు భోజనం పెడతామని చెబుతున్నా, ఏయే సంస్థల సహకారంతో దీన్ని అమలుచేస్తారో తెలియట్లేదు. అలాగే, వీటిలో ఏయే వర్గాలకు భోజనాలు, అల్పాహారాలు అందిస్తారో కూడా ప్రకటించలేదు. ఇలా అనేక విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.