నగరంలో మరో 22 అమ్మ క్యాంటీన్లు
300 క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్
బాధ్యతలేని సిబ్బందిపై చర్యలు
ప్రజల అభిమానాన్ని చొరగొన్న అమ్మ క్యాంటీన్లు మరికొన్ని ప్రజల ముందుకు రానున్నాయి. చెన్నైలో 22 కొత్త క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 300 క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని త్వరలో ప్రవేశ పెట్టారు.
చెన్నై: చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో మొత్తం 300 అమ్మ క్యాంటీన్లు సేవలు అందిస్తున్నాయి. అతి తక్కువ ధరకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ లు సరఫరా చేయడం ప్రజలను ఆకట్టుకుంది. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అ మ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల రోగులతోపాటు వచ్చే బంధువులు సౌకర్యాన్ని పొందుతున్నారు.
ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మరో 22 అమ్మ క్యాంటీన్లు నెలకొల్పాలని కార్పొరేషన్ నిర్ణయించింది. అమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం శనివారం అన్వేషణ ప్రారంభమైంది. స్థలం ఎంపిక జరగ్గానే నిర్మాణ పనులను పూర్తిచేసి వీలయినంత త్వరలో అమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పారు.
కంప్యూటర్ బిల్లింగ్: పేదల ప్రయోజనార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లపై కింది, మధ్యతరగతి ప్రజల అభిమానాన్ని సైతం చూరగొనడంతో అదనపు సౌకర్యాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అమ్మ క్యాంటీన్ల ద్వారా రోజూ వేలాది మంది ఆహారం తీసుకుంటుండగా లక్షల్లో ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి.
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సమయాల్లో అనేక వంటకాలు సిద్ధం చేయడం వల్ల నగదు స్వీకరణ, టోకన్ల జారీ అక్కడి సిబ్బందికి కష్టంగా మారింది. అంతేగాక అమ్మకాలపై నిర్దిష్టమైన లెక్కలు కొరవడినట్లు కార్పొరేషన్ గుర్తించింది. దీంతో ఇకపై ప్రతి అమ్మ క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. 255 అమ్మ క్యాంటీన్లలో కొత్త కంప్యూటర్లను అమర్చగా, మిగిలిన 45 క్యాంటీన్లలో గతంలోని మిషిన్లను కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై కార్పొరేషన్ ప్రజా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సెంథిల్‌నాథన్ మాట్లాడుతూ అమ్మ క్యాంటీన్లకు అవసరమైన వస్తువుల కొనుగోలు, ఆహార పదార్థాల అమ్మకాలపై ఒక నిర్ధారణకు వచ్చేందుకు కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు.
అంతేగాక అమ్మ క్యాంటీన్లను ఎన్నిగంటలకు తెరుస్తున్నారు, మూస్తున్నారనే వివరాలు సైతం బిల్లులో నమోదు కావడం వల్ల సిబ్బందిలో క్రమశిక్షణ పెరుగుతుందని చెప్పారు. ఆహార పదార్థాల స్టాకు ఉన్నా ముందుగానే క్యాంటీన్లను మూసివేస్తే తాము తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలను తీసుకునేందుకు కంప్యూటర్ బిల్లింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.