సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.
‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్‌గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు.
బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.
జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment