చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది.
వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన.
దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం.
ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్‌పై బీజేపీ మండిపడింది.
అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్‌గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్ మండిపడ్డారు.
ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది.
Comments
Please login to add a commentAdd a comment