చెన్నై: రసవత్తరంగా సాగుతున్న తమిళనాట రాజకీయంలో.. నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉంటుందా? గుడ్‌బై చెప్పేస్తుందా? అనేది తేలనుంది. ఈరోడ్ ఈస్ట్ నిజయోకవర్గ ఉప ఎన్నిక.. ఈ రెండు పార్టీల మధ్య రాజేసిన చిచ్చు ఏ క్షణాన అయినా ఉవ్వెత్తున్న ఎగసేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమిలో భాగమైన అన్నాడీఎంకే.. బీజేపీ ప్రాధాన్యత తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఎక్కడా మిత్రపక్ష బీజేపీ ప్రస్తావనగానీ, చివరికి నరేంద్ర మోదీ ఫొటోగానీ లేకుండా చూసుకుంది. అంతేకాదు ఎన్డీయే(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) బదులు.. నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరును హైలైట్ చేసింది. అయితే.. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. ‘సరైన బదులు ఇవ్వాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించగా.. వెంటనే కూటమి పేరును మార్చేస్తూ మరో ప్రకటన విడుదల అయ్యింది. కానీ, పోస్టర్లను మాత్రం సరిదిద్దలేదు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
అయితే.. పోస్టర్ల పరిణామంపై అన్నాడీఎంకే నేత ఒకరు స్పందించారు. పళనిస్వామి బీజేపీకి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వదల్చుకున్నారు. తమిళనాడులో వాళ్ల(బీజేపీ) వాళ్ల స్థానం ఎక్కడ ఉందో గుర్తించాలి అని వ్యాఖ్యానించారు.
234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో.. బీజేపీకి ఉంది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం తామే అన్నచందాన వ్యవహరిస్తూ వస్తోంది బీజేపీ. గత ఏడాదిన్నర కాలంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు.. పైగా ఈపీఎస్-ఓపీఎస్ గ్రూపు తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను అన్నాడీఎంకే తీవ్రంగా పరిగణించినట్లు స్పష్టమవుతోంది. సంకీర్ణ ధర్మాన్ని పక్కనపెడుతున్న కమలం పార్టీని.. దూరంగా పెట్టడమే మంచిదన్న యోచనలో రెండాకుల పార్టీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
వీటికి తోడు.. దివంగత నేత జయలలిత గతంలో ఏనాడూ బీజేపీతో జట్టు కట్టాలని చూడలేదు. అయితే.. ఆమె మరణాంతరం పన్నీర్ సెల్వం-పళని స్వామి నేతృత్వంలో పార్టీ.. అమ్మ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి బీజేపీకి చేతులు కలిపింది. ఫలితంగా.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం చెందింది. బీజేపీతో ఉండడం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందనే భావనలో ఉంది అన్నాడీఎంకే. అందుకే నెమ్మదిగా దూరం జరగాలని యత్నిస్తోంది. ఇంతేకాదు.. కోర్టు తీర్పుతో పళనిస్వామి పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో అందుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఇప్పటికే బీజేపీ మద్ధతు కోరగా.. అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పళనిస్వామి ఈరోడ్(ఈస్ట్) ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన రాజకీయ బలం ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అన్నాడీఎంకే అభ్యర్థి తెన్నరసును అభినందిస్తున్న పళనిస్వామి, తదితరులు
ఇదిలా ఉంటే.. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ ఈవీకేఎస్ ఇలంగోవన్ తనయుడు తిరుమహాన్ ఈవెరా మరణంతో ఈరోడ్ ఈస్ట్ నిజయోకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార డీఎంకే.. కాంగ్రెస్ దిగ్గజం ఈవీకేఎస్ ఇలంగోవన్ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే అభ్యర్థి పేరును సైతం పరిశీలనలో ఉంచింది కూడా. ఈలోపు బీజేపీ మరో మిత్రపక్షం తమిళ్ మానిల కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేయగా.. ఇప్పుడు అన్నాడీంకే సైతం అభ్యర్థిని(అభ్యర్థులను.. ఈపీఎస్ వర్గం మాజీ ఎమ్మెల్యే తెన్నరసు , ఓపీఎస్ వర్గం సెంథిల్ మురుగన్) బరిలో దించడం బీజేపీకి మింగుడు పడనివ్వడం లేదు. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గుతుందా?.. ఒకవేళ.. అధిష్టానం సూచనలతో తమిళనాడు బీజేపీ ఉప ఎన్నిక కోసం నేడు అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం.. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు కథ కంచికి చేరినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే..
బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాత్రం ఈ పరిణామాలపై భిన్నంగా స్పందించారు. అభ్యర్థి ఎంపిక మిత్రపక్షం చేసిన పొరపాటు చర్య. ఒకసారి సర్దకుంటే.. వాళ్లే పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మా మధ్య వైరానికి ఎలాంటి కారణం లేదు అని పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే గురువారం నాటి పరిణామాలే.. తమిళనాట రాజకీయాల్లో కీలక మార్పు తీసుకొచ్చే ఆస్కారం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment