సాక్షి, చెన్నై:చెన్నై మహానగరంలో తక్కువ జీతానికి పనిచేసే చిరుద్యోగులుగా, రోజు వారి కూలీలు గా, గుడిసెల్లో, రోడ్డు పక్కన నివసించే వారిని, మోత కార్మికులు తదితర పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది అమ్మ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో ఈ క్యాంటీన్ల విస్తరణ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు చెన్నైలోని 200 వార్డుల్లోను క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. చౌక ధరకే ఇడ్లీ, సాంబారు అన్నం, పులి హోరా, పెరుగన్నంతో పాటుగా రోజుకో ప్రత్యేక డిష్, చపాతీలను ఈ క్యాంటీన్లలో అందిస్తున్నారు. ఈ క్యాంటీన్లకు ఆదరణ పెరగడంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఏర్పాటు చేసే పనులు వేగవంతం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపించడంలో ఈ క్యాంటీన్లు ఎంతో దోహద పడ్డాయన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ స్పష్టం చేయడంతో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి సీఎం జయలలిత నిర్ణయించారు.
మరో 360 క్యాంటీన్లు: రాష్ట్రంలో మరో 360 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 129 మునిసిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. చెన్నై మహానగరంలోని 200 వార్డుల్లో అదనంగా వార్డుకు ఒకటి చొప్పన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. కోయంబత్తూరు, మదురై, దిండుగల్ తదితర కార్పొరేషన్లలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు ఆదేశించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్ల సంఖ్య 654కు చేరింది. ఈ ఏడాదిలో వెయ్యి క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తుల్లో పడింది.
డీజిల్ ధరపై ఆగ్రహం : డీజిల్ పై లీటరకు 50 పైసలుపెంచడాన్ని సీఎం జయలలిత వ్యతిరేకించారు. కొత్త ప్రభుత్వంలో ధరలు తగ్గుతాయ న్న ఆశతో ప్రజలు ఉంటే, వారి ఆశలను అడియాశలు చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. యూపీఏ బాటలో కొత్త ప్రభుత్వం ముందుకు సాగడం విచారకరంగా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో డీజిల్ ధరను పెంచడాన్ని ఖండిస్తున్నామన్నారు. యూపీఏ పద్ధతిని పక్కన పెట్టి, కొత్తవిధానంతో ముందుకెళ్లాలని సూచించారు. చమురు కంపెనీల చేతిలో ఉన్న ధరల పెంపు నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
‘అమ్మ’ క్యాంటీన్ల విస్తరణ
Published Sun, Jun 1 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement