
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. అలాగే, జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం ఉన్న చిన్నమ్మ శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. దివంగత సీఎం జే జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
రెండో రోజుగా అపోలో వైద్యులు పలువురు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమెకు రక్తనాళాల మార్పిడి శస్త్ర చికిత్స విషయంగా జయలలిత నెచ్చెలి శశికళ తరపు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్‌క్రాస్ ఎగ్జామిన్‌లో ప్రశ్నలు సంధించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పన్నీరుసెల్వంకు ఆ కమిషన్ సమ న్లు జారీ చేసింది. అయితే, ఆ సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండటంతో విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు.
తాజాగా ఆయన్ని ఈనెల 21వ తేది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసు విచారణ సమయంలో శశికళ వదిన ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారించేందుకు కమిషన్ నిర్ణయించింది. శశికళతో పాటుగా జయలలిత నివాసం పోయేస్ గార్డెన్‌లో సుదీర్ఘ కాలం ఇలవరసి కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.