చిన్నమ్మతో భేటీ.. పన్నీరు సోదరుడిపై వేటు | OPS Brother O Raja Expelled From AIADMK After Meeting Sasikala | Sakshi
Sakshi News home page

చిన్నమ్మతో భేటీ.. పన్నీరు సోదరుడిపై వేటు

Published Sun, Mar 6 2022 11:04 AM | Last Updated on Sun, Mar 6 2022 11:04 AM

OPS Brother O Raja Expelled From AIADMK After Meeting Sasikala - Sakshi

సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళతో భేటీ అయ్యారనే కారణంతో పన్నీరు సెల్వం సోదరుడు రాజాపై  అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు పార్టీ నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది.  శనివారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్‌ పళని స్వామి ఈ అంశంపై సంయుక్త ప్రకటన చేశారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళను మళ్లీ అన్నాడీఎంకేలోకి ఆహ్వానించే విధంగా ఓ వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం అయితే, చిన్నమ్మను ఆహ్వానించేందుకు తగ్గట్టుగా తరచూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న తరహాలో కో– కన్వీనర్‌ పళనిస్వామి శిబిరం స్పందిస్తోంది. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం సోదరుడు రాజా చిన్నమ్మ శశికళతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. 

వేటుపై నిర్ణయం
చిన్నమ్మ శశికళ జిల్లాల బాట పట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి తిరుచెందూరులో ఆమె బస చేశారు. ఆమెను ఓ రాజాతో పాటుగా తేని జిల్లాకు చెందిన పలువురు అన్నాడీఎంకే నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెతో ఫొటోలు దిగడమే కాదు, చిన్నమ్మకు మద్దతుగా గళాన్ని వినిపించారు. ఇది అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహం రేపింది. దీంతో శనివారం పన్నీరు, పళని సంయుక్తంగా ప్రకటన విడుదల చేసి రాజాతో పాటుగా తేని జిల్లా నేతలు మురుగేషన్, వైగై కరుప్పు, సేతుపతి తదితరులకు ఉద్వాస పలికారు.

పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, క్రమ శిక్షణను ఉల్లంగించి పార్టీకి కళంకం తెచ్చే విధంగా వీరు వ్యవహరించారని, వీరందరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తేని జిల్లాలో పన్నీరుకు కుడి భుజంగా రాజా ఉన్నారు. గతంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి ఆయన ఉద్వాసనకు గురయ్యారు. చివరకు మళ్లీ పన్నీరు అక్కున చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి.  ఈ పరిస్థితుల్లో  చిన్నమ్మకు మద్దతుగా పన్నీరు పరోక్ష  వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన సోదరుడు రాజా ఏకంగా భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement