శశికళ, ఇళవరసి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలులో ఖరీదైన జీవితం చిన్నమ్మ శశికళను మళ్లీ కష్టాలపాలు చేసింది. జైలు పక్షిలా కారాగారానికి పరిమితం కాకుండా జల్సా కోసం చేసిన పని ఆమెను చిక్కుల్లో పడేసింది. అంతేకాదు ఆమెతోపాటూ జైలు అధికారులు, వైద్యుడు సైతం కోర్టు బోనెక్కే పరిస్థితి నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ నాలుగేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడులయ్యారు.
శిక్షాకాలంలో శశికళ తన పలుకుబడిని వినియోగించి ప్రత్యేకసెల్, లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించారు. తన వదిన ఇళవరసికి సకల సౌకర్యాలు సమకూర్చడంతోపాటూ ఇరువురూ చెట్టాపట్టాల్ వేసుకుని బెంగళూరు నగరంలో షాపింగ్ చేసి గుట్టుగా జైలుకు చేరుకునేవారు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విషయం బట్టబయలైంది.
అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప తీగలాగడంతో డొంక కదిలింది. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు రూ.2 కోట్లు లంచం ముట్టజెప్పి శశికళ తన దందాను నడిపినట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఆమె నివేదిక పంపారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపించగా డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు నిజమయ్యాయి.
షాపింగ్ ముగించుకుని శశికళ, ఇళవరసి జైల్లోకి వస్తుండగా సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు
ఇందుకు సంబంధించి చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్టు 25వ తేదీన తొలివిడత చార్జిషీటు దాఖలైంది. పోలీసులకు లంచం ఎరవేసిన వ్యవహారంలో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ తుది చార్జిషీటు దాఖలు చేశారు. తొలి నిందితునిగా (ఏ వన్)గా పోలీస్ అధికారి కృష్ణకుమార్, ఏ 2గా డాక్టర్ అనిత, ఏ 3గా సురేష్, ఏ 4గా గజరాజ్ మాకనూరు, ఏ 5గా శశికళ, ఏ 6గా ఇళవరిసిని చార్జిషీటులో చేర్చారు.
అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి లక్ష్మీ నారాయణన్ భట్ ముందుకు శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. చార్జిషీటులో చేర్చిన మొత్తం ఆరుగురూ మార్చి 1వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. అంటే చిన్నమ్మ, ఇళవరసి మరోసారి కోర్టు బోనెక్క తప్పదన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment