Ilavarasi
-
శశికళ, ఇళవరసికి సమన్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలులో ఖరీదైన జీవితం చిన్నమ్మ శశికళను మళ్లీ కష్టాలపాలు చేసింది. జైలు పక్షిలా కారాగారానికి పరిమితం కాకుండా జల్సా కోసం చేసిన పని ఆమెను చిక్కుల్లో పడేసింది. అంతేకాదు ఆమెతోపాటూ జైలు అధికారులు, వైద్యుడు సైతం కోర్టు బోనెక్కే పరిస్థితి నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ నాలుగేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడులయ్యారు. శిక్షాకాలంలో శశికళ తన పలుకుబడిని వినియోగించి ప్రత్యేకసెల్, లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించారు. తన వదిన ఇళవరసికి సకల సౌకర్యాలు సమకూర్చడంతోపాటూ ఇరువురూ చెట్టాపట్టాల్ వేసుకుని బెంగళూరు నగరంలో షాపింగ్ చేసి గుట్టుగా జైలుకు చేరుకునేవారు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విషయం బట్టబయలైంది. అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప తీగలాగడంతో డొంక కదిలింది. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు రూ.2 కోట్లు లంచం ముట్టజెప్పి శశికళ తన దందాను నడిపినట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఆమె నివేదిక పంపారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపించగా డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు నిజమయ్యాయి. షాపింగ్ ముగించుకుని శశికళ, ఇళవరసి జైల్లోకి వస్తుండగా సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇందుకు సంబంధించి చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్టు 25వ తేదీన తొలివిడత చార్జిషీటు దాఖలైంది. పోలీసులకు లంచం ఎరవేసిన వ్యవహారంలో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ తుది చార్జిషీటు దాఖలు చేశారు. తొలి నిందితునిగా (ఏ వన్)గా పోలీస్ అధికారి కృష్ణకుమార్, ఏ 2గా డాక్టర్ అనిత, ఏ 3గా సురేష్, ఏ 4గా గజరాజ్ మాకనూరు, ఏ 5గా శశికళ, ఏ 6గా ఇళవరిసిని చార్జిషీటులో చేర్చారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి లక్ష్మీ నారాయణన్ భట్ ముందుకు శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. చార్జిషీటులో చేర్చిన మొత్తం ఆరుగురూ మార్చి 1వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. అంటే చిన్నమ్మ, ఇళవరసి మరోసారి కోర్టు బోనెక్క తప్పదన్నమాట. -
జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు
సాక్షి, చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ అండ్ బృందం ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్టు సమాచారం. కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా కలవరంతో దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖైదీలను బెయిల్, పెరోల్ మీద బయటకు పంపించిన విషయం తెలిసిందే. ఆ దిశగా బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌కు పెరోల్ అ వకాశం లభించినా, ఉపయోగించుకోలేదు. బయట కన్నా, జైల్లోనే ఉండడం మంచిదని వారు భావించారేమో. (కరోనా ; యమలోకం హౌస్‌ఫుల్!) పెరోల్ ప్రయత్నాలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు చేపట్టినా, వారు తిరస్కరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని సమాచారం. చిన్నమ్మ శశికళ, ఇలవరసి, సుధాకరన్ జైలులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాస్క్‌లు ధరించడమే కాదు, భౌతిక దూరాన్ని పాటి స్తూ జైలులో కాలం నెట్టుకొస్తున్నారు. భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. అలాగే, చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. ఒకరు పెరోల్ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తు తం శశికళ, ఇలవరసి మాత్రమే ఉన్నట్టు భోగట్టా.(తమిళనాడును కబళిస్తున్న కరోనా) -
వదినమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ వదినమ్మ ఇలవరసి ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, వజ్రాలు వంటి ఆభరణాలు అహరణకు గురి అయ్యాయి. ఆలస్యంగా కుటుంబీకులు పోలీసుల్ని ఆశ్రయించారు.అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఏళ్ల తరబడి ఆమె వదినమ్మ ఇలవరసి ఉన్న విషయం తెలిసిందే. అందుకే అ›క్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటు ఇలవరసి కూడా ఊచలు లెక్కించక తప్పలేదు. ఇలవరసికి నుంగంబాక్కం మహాలింగపురం రామనాథర్ వీధిలో అతి పెద్ద భవనం ఉంది. ఇందులో ఆమె కుమారుడు వివేక్ నివాసం ఉన్నారు. ప్రస్తుతం చిన్నమ్మ శశికళతో కలిసి వదినమ్మ ఇలవరసి పరప్పన అగ్రహార చెరలో ఉన్నారు. ఇటీవల పరోల్ మీద ఇలవరసి బయటకు వచ్చారు. మహాలింగపురంలోని నివాశంలోనే ఆమె ఉన్నారు. ఎనిమిదో తేదీన పరోల్ ముగియడంతో ఆమె మరలా పరప్పన అగ్రహార చెరకు వెళ్లారు. ఆమెతో పాటు తనయుడు వివేక్, ఇతర బంధువులు వెంట వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉండ లేక వివేక్ భార్య అన్నానగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. దీంతో ఇంటి వద్ద అసోంకు చెందిన కోనార్క్(26) సెక్యూరిటీ మాత్రమే ఉన్నాడు. రాత్రి వివేక్ నమ్మిన బంటు, అంబత్తూరుకు చెందిన డ్రైవర్ మురళి(38) ఆ ఇంటికి వచ్చాడు. తనకు కేటాయించిన గదిలో నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా, ఇంటి తలుపులు తెరచి ఉండడం, ఎవ్వరూ లేకపోవడంతో వివేక్ మేనేజర్ ప్రసన్నకు సమాచారం ఇచ్చాడు. తొమ్మిదో తేదీ రాత్రి సమయానికి తిరిగి ఇంటికి చేరుకున్న వివేక్ కుటుంబీకులు అక్కడున్న గదులను పరిశీలించారు. అన్ని చోట్ల సమగ్ర పరిశీలనకు సమయం తీసుకున్నారో లేదా , చిన్న దొంగతనమే అని భావించారా ఏమోగానీ, తొలుత పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. చివరకు ఇంట్లో ఉన్న ఆభరణాలు, వజ్రాలు మాయం కావడం , సెక్యూరిటీ కోనార్క్ పత్తా లేకుండా పోవడంతో శనివారం రాత్రి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు అందడం అనుమానాలకు దారి తీసినా, తమ బాధ్యతగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 750 గ్రాముల బంగారం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, విలువైన వస్తువుల్నే అపహరించుకు వెళ్లి ఉంటారన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో రెండు ప్రత్యేక బృందాలు ఆదివారం రంగంలోకి దిగాయి. కోనార్క్ ఆరు నెలల క్రితం ఇక్కడకు వచ్చినట్టు విచారణలో తేలింది. దీంతో విచారణ మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు. -
మౌనంలో చిన్నమ్మ
గుట్కా అక్రమ అమ్మకాల గుట్టును రట్టు చేసేందుకు ఐటీ అధికారులు తహతహలాడుతుండగా, శశికళ మౌనవ్రతం విచారణకు అడ్డంకిగా మారింది. వచ్చేనెల 10వ తేదీ తరువాత విచారణకు సిద్ధమని చిన్నమ్మ చెప్పడంతో బెంగళూరు జైలుకు చెన్నై ఐటీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లు జైలుశిక్షను అనుభవిస్తున్న సంగతి పాఠకులకు విధితమే. ఇదిలా ఉండగా శశికళ బంధువులు బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గత ఏడాది నవంబర్‌లో బంధువులు, మిత్రుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు వెయ్యిమందికి పైగా అధికారులు ఏకకాలంలో 187 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో..సుమారు 50కి పైగా బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లుగా రుజువుచేసే అనేక డాక్యుమెంట్లు అధికారులకు దొరికినట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్ల పరిశీలనలో రూ.1,430 కోట్ల పన్ను ఎగవేసినట్లు లెక్కకట్టారు. ఇంత పెద్ద ఎత్తున బోగస్ కంపెనీల నిర్వహణ వెనుక శశికళ హస్తం ఉందని అనుమానించిన ఐటీ అధికారులు తనిఖీలు పూర్తికాగానే ఆమె బంధువులకు సమన్లు పంపి వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, బోగస్ కంపెనీల్లో శశికళ పేరు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేసిన బంధుమిత్రుల జాబితాలో శశికళ పేరును చేర్చినట్లు సమాచారం. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ఒక పెన్‌డ్రైవ్, కంప్యూటర్లలోని సమాచారం, డిస్కులను, గుట్కా వ్యవహారంలో ఐటీశాఖ ప్రభుత్వానికి అందజేసిన ఉత్తరం దొరికాయి. ఐటీ శాఖ ఉత్తరం శశికళ గదిలోకి ఎలా చేరిందనేది అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వీటన్నింటినీ శశికళకు నేరుగా చూసి సమాచారం సేకరించాలని, స్వయంగా విచారిస్తేగానీ ఇంకా అనేక నిజాలు వెలుగుచూడవని భావిస్తున్నారు. అయితే ఆమె పొరుగురాష్ట్రంలో జైలు ఖైదీగా ఉండడం అధికారులను ఆలోచనలో పడేసింది. విచారణ కోసం చెన్నైకి పిలిపించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని కొందరు సూచించడంతో తామే బెంగళూరుకు జైలుకు వెళ్లడం ఉత్తమమని నిర్ధారించుకున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు ఇటీవల ఉత్తరం కూడా రాశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి శశికళ మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. చిన్నమ్మ మౌనవ్రతం వల్ల విచారణలో జాప్యం నెలకొనే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని ఐటీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల అభ్యంతరాన్ని తెలుసుకున్న శశికళ...విచారణకు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ఐటీ దాడులు, గుట్కా వ్యవహారంలో శశికళను నేరుగా విచారించక తప్పని పరిస్థితులు నెలకొన్న విషయాని ఉత్తరం ద్వారా ఆమెకు తెలిపామని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విచారణకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. విచారణ తేదీ ఖరారుకాగానే చెన్నై నుంచి అధికారుల బృందం బెంగళూరుకు వెళ్లి ఒక ప్రత్యేక గదిలో శశికళను విచారిస్తామని అన్నారు. ఈ విచారణ ఒక్కరోజులో ముగియకపోవచ్చని చెప్పారు. శశికళను విచారించిన తరువాత ఈ వ్యవహారంలో తరువాత అడుగు పడుతుందని వివరించారు. -
శశికళ, ఇళవరసిల బోగస్ సంస్థల బాగోతం
-
అవసరమైతే వారిద్దరు అరెస్ట్
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ, ఆమె బంధుమిత్రులపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు మెరుపుదాడులు నిర్వహించిన సంగతి పాఠకులకు విదితమే. ఈనెల 9వ తేదీ నుంచి ఆరురోజులు పాటు జరిగిన దాడుల సందర్భంగా రూ.1500 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో రూ.1012 కోటి అవకతవకలు సాగినట్లుగా అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. కొద్దిరోజుల విరామం తరువాత చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసంలో జరిపి రెండు కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటూ అనేక కొరియర్ రశీదులు దొరికిన సమాచారం సోమవారం వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐటీ దాడులతో ఇప్పటికే ఊపిరి సలపలేనంత ఉత్కంఠ ఎదుర్కొంటున్న శశికళ, ఇళవరసిల మెడకు మరో ఉచ్చు బిగుసుకోనుంది. పది బోగస్ సంస్థల ద్వారా భారీ మోసానికి పాల్పడిన అభియోగంపై సీబీఐ త్వరలో కేసు బనాయించనుంది. అవసరమైతే వారిద్దరిని మరోసారి అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. బోగస్ సంస్థల బాగోతం ఐటీ దాడుల సమయంలో శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా, వారి బినామీ పేర్లతో పలు బోగస్ సంస్థలు ఉన్న విషయం బయటపడింది. గత ఏడాది నవంబరులో రూ.1000, రూ.500ల పెద్ద నోట్లు రద్దయిన తరువాత దేశంలో అనేక బోగస్ సంస్థలు మూతపడ్డాయి. మూతపడ్డ వాటిల్లో శశికళ, ఇళవరసి వారి బంధువులకు చెందిన పది బోగస్ సంస్థలున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థల ద్వారా కొన్ని కోట్లరూపాయల గోల్మాల్ సాగినట్లుగా సమాచారం ఉన్నందున విచారణ చేపట్టాల్సిందిగా ఐటీ శాఖను కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు చెన్నై ఐటీశాఖ ప్రధాన సంచాలకులు మురళీకుమార్, ఫస్ట్‌క్లాస్ ప్రధాన సంచాలకులు తిరుమలకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ ప్రత్యేక బృందం తీవ్రస్థాయిలో రహస్య విచారణ చేపట్టింది. ఈ బోగస్ సంస్థల ద్వారా అనేక కొత్త సంస్థలకు నగదు రవాణా జరిగింది. ఈ కొత్త సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీలల, మిత్రులు బినామీలుగా వ్యవహరిస్తున్న సంగతి బయటకు వచ్చింది. ఈ బోగస్ సంస్థల ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని సైతం చలామణి చేసినట్టు తేలింది. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా నివాస గృహాలు, ఒకే చిరునామా కింద అనేక సంస్థలు ఉండడాన్ని కనుగొన్నారు. ఈ సమాచారం మేరకే ఇటీవల శశికళ బంధుమిత్రుల ఇళ్లపై ఐటీదాడులు చేపట్టడా, రూ.1500 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జయ నివాసంలో జరిగిన సోదాల్లో అనేక కొరియర్ రశీదులు దొరికాయి. దీంతో విలువైన ఆస్తిపత్రాలను విదేశాలకు చేరవేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తూ రశీదులను విశ్లేషిస్తున్నారు. సీబీఐకి నివేదిక మొత్తం ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో నివేదికను తయారు చేసి సీబీఐకి అప్పగించాలని ఐటీ అధికారులు నిర్ణయించారు. నివేదిక అందగానే శశికళ అండ్ కో పై కేసులు నమోదకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేగాక సీబీఐ అధికారులు ఇప్పటికే రహస్య విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన కొన్ని బోగస్ సంస్థలకు శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఐటీ నుంచి నివేదిక అందగానే దాన్ని ఫిర్యాదుగా పరిగణించి కేసులు పెడతామని తెలిపారు. అవసరమైతే వారిద్దరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
శశికళ, ఇళవరసిలపై మరో కేసు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పది బోగస్ సంస్థల ద్వారా అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆమె వదిన ఇళవరసి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. త్వరలో వారిద్దరిపై అధికారులు మరో కేసు నమోదు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మూతపడ్డ బోగస్ సంస్థల్లో శశికళ, ఇళవరసి, వారి బంధువులకు చెందిన పది కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల్లో రూ. 1,012 కోట్ల అవకతవకలు సాగినట్లుగా చెన్నై ఐటీ అధికారులు గుర్తించారు. బోగస్ సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, మిత్రులు బినామీలుగా ఉన్నారు. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా ఇళ్లు, ఒకే చిరునామాతో అనేక సంస్థలు ఉన్నాయి. మరోవైపు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి పేరుతో ఆరు బోగస్ సంస్థల ద్వారా రూ.174 కోట్లు విదేశాలకు పంపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. -
పెన్ డ్రైవ్‌లో రహస్యమా?
ఆదాయ పన్ను శాఖ మరింతగా దూకుడు పెంచనుంది. చిన్నమ్మ కుటుంబీకులకు చెందిన 85 బ్యాంకుల్లోని 240 లాకర్ల తాళాల్ని తెరిచేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, పోయెస్ గార్డెన్ వేద నిలయంలోని అమ్మ గదిలో సోదాలకు ప్రత్యేక బృందం సిద్ధం అవుతోంది. మరికొన్ని చోట్ల దాడులు లక్ష్యంగా మరికొన్ని బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి. అలాగే, పరప్పన అగ్రహార చెరలోని ఆ ఇద్దర్నీ విచారించేందుకు అనుమతి కోరుతూ బెంగళూరు కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ చర్యల్లో మరో బృందం నిగమ్నమైనట్టు సమాచారం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీని గురిపెట్టి సాగిన ఐటీ సోదాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రస్తుతం విచారణ వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమ్మ జయలలిత సహాయకుడు పూంగుండ్రన్ ఇచ్చిన సమాచారం మేరకు పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయంలో తనిఖీలు సాగాయని సమాచారం. అక్కడ అన్ని గదుల్లో తనిఖీలు సాగినా, అమ్మ జయలలిత గది దగ్గరకు మాత్రం వెళ్ల లేదు. ఆ ఇంటి నుంచి కంప్యూటర్, పెన్ డ్రైవర్‌తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అందులో లభించిన సమాచారం, ఐదారు రోజుల పాటు సాగిన సోదాల్లో దొరికిన ఆధారాల మేరకు ఇక, చిన్నమ్మ శశికళతో పాటు పరప్పన అగ్రహార చెరలో ఉన్న ఇళవరసిని కూడా విచారణ వలయంలోకి తెచ్చేందుకు కసరత్తులు సాగుతున్నాయి. మనో వేదనలో చిన్నమ్మ పరప్పనఅగ్రహార చెరలో ఉన్న శశికళ, ఇళవరసిలను విచారించడం లక్ష్యంగా ప్రత్యేక బృందం ఒకటి రెండు రోజుల్లో బెంగళూరుకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు కోర్టును ఆశ్రయించి అనుమతుల్ని కోరబోతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడకు చిన్నమ్మను గానీ, ఇళవరసిని గానీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని, అంతా బెంగళూరు జైలు వేదిగానే విచారణలు సాగుతాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఇక, ఈ విచారణ గురించి పరప్పన అగ్రహార చెర అధికారి రమేష్ కుమార్‌ను ఓ మీడియా కదిలించగా, ఆ ఇద్దర్ని విచారించేందుకు తగ్గ సమాచారం తమకు ఇంతవరకు రాలేదన్నారు. కోర్టు అనుమతితో వస్తే అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఇదివరకు కోర్టు అనుమతితో ఇక్కడ విచారణలో సాగాయని గుర్తుచేశారు. కాగా, ఇప్పటికే ఐటీ దాడులు, భర్త నటరాజన్‌కు జైలు శిక్ష, ప్రస్తుతం తమ వద్ద విచారణకు రంగం సిద్ధం అవుతుండడంతో చిన్నమ్మకు కంటి మీద కనుకు కరువైనట్టు సమాచారం. బ్యాంకు లాకర్లపై గురి ఐటీ సోదాల్లో లభించిన సమాచారాల మేరకు చిన్నమ్మ అండ్ ఫ్యామిలీకి ప్రైవేటు, సహకార పరిధిలోని 85 బ్యాంకుల్లో ప్రత్యేకంగా 240 లాకర్లు ఉన్నట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. ఆ లాకర్లను తెరిచేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. ఆయా బ్యాంకులకు ఇప్పటికే తనిఖీలకు సంబంధించి లేఖలు వెళ్లినట్టు, ఒకటి రెండు రోజుల్లో లాకర్లలో ఉన్న మరింత అక్రమార్జన గుట్టును బయటపెట్టడంతో పాటు, మరికొన్ని ఐటీ సోదాలకు అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, ఢిల్లీ నుంచి అనుమతి రాగానే, అమ్మ జయలలిత గది తాళం తెరవడం ఖాయం అని చెబుతున్నారు. మిడాస్ మద్యం బంద్ శశికళ కుటుంబానికి చెందిన మిడాస్ స్పిరిట్, లిక్కర్స్ ద్వారా అనేక మద్యం బ్రాండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాంచీపురం జిల్లా పడప్పై సమీపంలోని వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే బ్రాండ్లన్నీ టాస్మాక్ మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడి బ్రాండ్లకే ఇదివరకు ప్రాధాన్యత ఉండేది. అయితే, ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో మిడాస్ మద్యం కొనుగోలును టాస్మాక్ వర్గాలు నిలుపుదల చేశాయి. ఐటీ దాడులు, విచారణల నేపథ్యంలో ఎక్కడ తమ మీద ఐటీ కన్ను పడుతుందో అనే బెంగో లేదా, మరేదేని కారణాలో ఏమోగానీ మిడాస్ బ్రాండ్ల కొనుగోలును నిలుపుదల చేస్తూ మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పెన్ డ్రైవ్‌లో రహస్యమా? దినకరన్ ఆదివారం తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ, అబ్బో పెన్‌డ్రైవ్‌లో రహస్యాలు ఉన్నాయా..? అని వ్యంగ్యాస్త్రం సంధించారు. పెన్ డ్రైవ్ అంటే అందులో వ్యక్తిగత విషయాలు ఉండవచ్చు, రహస్యాలూ ఉండ వచ్చని వ్యాఖ్యానించారు. అంత మాత్రాన అభూత కల్పనలతో వ్యాఖ్యలు చేయ వద్దు అని సూచించారు. శశికళ భద్రతకు అమ్మ చర్యలు తీసుకోలేదని దివాకరన్ వ్యాఖ్యానించడంలో తప్పు లేదని పేర్కొన్నారు. జయలలిత కష్ట సుఖాల్లో శశికళ పాలు పంచుకున్నారని, అమ్మ ఇప్పుడు లేని దృష్ట్యా, చిన్నమ్మకు ఎదురు అవుతున్న కష్టాల్ని చూసి, ఆమె సోదరు దివాకరన్ అలా చెప్పి ఉంటారని, దీనిన భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సింహం లేదు కాబట్టే .. ఐటీ సోదాల గురించి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సింహం జీవించి ఉన్నప్పుడు గుంట నక్కలు గుహలోకి చొరబడ్డాయని, ఆ నక్కల పుణ్యమా ఇప్పుడు గుహలో సోదాలు తప్పలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం కోటిన్నర మందితో కూడిన అన్నాడీఎంకే కేడర్‌కు ఆలయం అని, ఆ గుంట నక్కల రూపంలో ఇప్పుడు ఆలయానికి సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదని వ్యాఖ్యానించారు. సింహం గుహలో ఉండి ఉంటే, దర్జాగా చొరబడి తనిఖీలు చేసి ఉంటారా..? అని ఐటీ వర్గాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటనలో పేర్కొంటూ, జయలలిత ఏదో అవినీతికి దూరం అన్నట్టుగా అనేక మంది వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. అవినీతిలో జయలలిత మహారాణి అయితే, శశికళ యువ రాణి అని ఎద్దేవా చేశారు. కాగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఐటీ దాడుల గురించి తూత్తుకుడిలో పేర్కొంటూ, ఇక్కడ వ్యక్తిగత దాడులు జరగలేదని, ఐటీ వర్గాలు సేకరించిన సమగ్ర సమాచారం మేరకు సోదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం పళని స్వామి మరో మారు మీడియా ముందు స్పందిస్తూ పోయెస్ గార్డెన్లో సోదాలు తీవ్ర మనోవేదనకు గురి చేసినట్టు వ్యాఖ్యలు గుప్పించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ, ఐటీ దాడులు చిన్నమ్మ కుటుంబానికే పరిమితం చేయకుండా, అన్నాడీఎంకే వర్గాలందర్నీ గురి పెట్టాలని, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మాజీలు, అందర్నీ వలయంలోకి తీసుకొస్తే బండారాలన్నీ బయటకు వచ్చి తీరుతాయని వ్యాఖ్యానించారు. వీడియోను అమ్మే చిత్రీకరించమన్నారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య చికిత్సల గురించి అమ్మ జయలలిత వీడియో చిత్రీకరించమన్నట్టు శశికళ సోదరుడు దివాకరన్ వ్యాఖ్యానించారు. ఓ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అమ్మకు అందుతున్న వైద్యంలో అనుమానాలు అంటూ, డీఎంకే ఆరోపణలు గుప్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో అమ్మ జయలలిత వైద్య చికిత్సల గురించి వీడియో చిత్రీకరణ చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు.తనకు ఏదేని జరిగిన పక్షంలో, మరేదేని జరగవచ్చు అని, ద్రోహులు మన వద్దే ఉన్నట్టు శశికళ వద్ద అమ్మే స్వయంగా వ్యాఖ్యానించినట్టు వివరించారు. అయితే, శశికళకు భద్రతగా ప్రత్యేక వలయం ఏర్పాటు చేయక పోవడం ప్రశ్నార్థకం అని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి జయకుమార్ లాంటి వాళ్లు తమను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిగత పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు ఎక్కడైనా జరగనీయండి, జరగవచ్చు అని వ్యాఖ్యానిస్తూ, పోయెస్ గార్డెన్లో జరగడం మనో వేదనకు గురిచేసిందన్నారు. పోయెస్ గార్డెన్లో పెన్ డ్రైవ్, కంప్యూటర్లు సీజ్ చేసినట్టుగా తనకు తెలియదన్నారు. అయితే, విచారణ అన్నది వచ్చాక, ఆ వలయంలోకి అందరూ తప్పకుండా వచ్చి తీరుతారని, ఇది జరుగుతుందని ముగించారు. -
ఇక ఆ ఇద్దరి వంతు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని శశికళ బంధుమి్రత్రులను జల్లెడపట్టిన ఐటీ అధికారులు ఇకబెంగళూరు బాటపట్టనున్నారు.అక్రమార్జనకు సూత్రధారి,కీలకపాత్రధారిగా భావిస్తున్నశశికళను బెంగళూరు జైల్లోనేవిచారించనున్నారు. అదే జైల్లోశిక్ష అనుభవిస్తున్న శశిబంధువులు ఇళవరసి,సుధాకరన్‌లను కూడావిచారణ పరిధిలోకితీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మన్నారుగుడి మాఫియా’గా ముద్రపడిన శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈనెల 9 నుంచి 14వరకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో జరిపిన ఐటీ దాడుల్లో రూ.30వేల కోట్ల ఆస్తులు బయటపడడంతో అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. శశికళ అండ్ కోను హడలెత్తించారు. ఐటీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ వాహనాలకు పెళ్లి వేడుక స్టిక్కర్లు వేసుకుని 187చోట్ల ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించి కంగారు పుట్టించారు. ప్రజల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేందుకు ఉపయోగపడుతున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికపై కూడా ఐటీ కొరడా ఝుళిపించింది. ఈ సందర్భంగా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా మరికొన్ని ముఖ్యమైన పత్రాలను శశికళ బంధువర్గం మాయం చేసిందని అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడులకు సంబంధించి శశికళ బంధువులతో విచారణ çపూర్తికావడానికి పదిరోజులపాటూ పట్టే అవకాశం ఉంది. కొడనాడు ఎస్టేట్‌లోని కొంతభాగాన్ని తనిఖీ చేయడం పూర్తికాగా, జయలలిత, శశికళల ప్రయివేటు గదుల తనిఖీలు ఇంకా మిగిలి ఉన్నాయి. అక్రమార్జనలో శశికళనే కీలకపాత్రధారిగా ఐటీ స్వాధీనం చేసుకున్న పత్రాలు రుజువు చేస్తున్నాయి. పెరోల్లోనూ పెద్దనేరం చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల ఐదురోజుల పెరోల్‌పై చెన్నైకి వచ్చారు. పెరోల్ రోజుల్లో బసచేసిన ఇల్లు, భర్త ఉన్న ఆస్పత్రి మినహా ఎక్కడికీ వెళ్లరాదని, ముఖ్యంగా పార్టీ నేతలను కలుసుకోరాదని జైళ్లశాఖ కఠినమైన నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే శశికళ ఐదు రోజులు పూర్తిచేసుకుని తిరిగి జైలుకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజుల కాలంలో 622 ఆస్తుల్లోనే పేర్లను తారుమారు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఆరు రోజులపాటూ జరిపిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా అధికారులు ఈమేరకు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, తనిఖీల సమయంలో బయటపడిన అనేక సంస్థలకు శశికళతో సంబంధాలున్నట్లు తేలిందని తెలిపారు. ఈ కారణంగా శశికళను తప్పనిసరిగా విచారించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 622 ఆస్తుల మార్పిడి శశికళ బసచేసిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటిలోనే జరిగిందని భావిస్తున్నారు. శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసి, సుధాకరన్‌లను విచారించేందుకు చట్టపరంగా అనుమతి పొందుతామని, అలాగే బెంగళూరు పరప్పన అగ్రహార జైళ్ల శాఖకు ఉత్తరం రాస్తున్నామని తెలిపారు. రెండు లేదా మూడువారాల్లో అనుమతి లభిస్తుంది, విచారణ ప్రారంభిస్తామని అన్నారు. ఆర్కే నగర్లా అసెంబ్లీ ఎన్నికలు జయ ప్రాతినిథ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా రూ.89 కోట్లు ఖర్చుచేసి ఐటీకి దొరికిపోవడంతో ఎన్నికలు రద్దయ్యాయి. అప్పట్లో అదో సంచలనం. కాగా, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా చేసుకుని ఓటర్లకు భారీ ఎత్తున నగదు బట్వాడా జరిగినట్లుగా తాజా ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడం కలకలం రేపింది. అయితే ఆనాటి ఎన్నికలకు సార«థ్యం వహించిన జయలలిత జీవించి లేరు. అమ్మ వెనకాల అన్నీ తానై ఉండిన శశికళ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాలతో అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాన్ని కూడా శశికళ నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఐటీ దాడులు విఫలం : దివాకరన్ అట్టహాసంగా చేసిన ఐటీ దాడులు పూర్తిగా విఫలమని శశికళ సోదరుడు దివాకరన్ గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆరు రోజులుపాటు తనిఖీలు చేసినా అధికారులు తమ నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేక పోయారని అన్నారు. -
ఇక శశి, ఇళవరసిల విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెరుపు దాడులతో శశికళ బంధువర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆదాయపు పన్నుశాఖ ఇక శశికళ, ఇళవరసిలపై దృష్టి సారించనుంది. ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా బెంగళూరు జైలులో వీరిద్దరినీ విచారించనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల పెరోల్‌పై చెన్నైకి వచ్చినపుడు 622 ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ తతంగమంతా ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లో జరిగినట్లు అభియోగం. దాడులు ముగిసిన నాటి నుంచి శశికళ బంధువులను ఐటీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఆస్తులు కూడగట్టడంలో ప్రధానపాత్ర పోషించిన శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసిలను విచారించేందుకు ఐటీ అధికారులు బెంగళూరు జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. దినకరన్ సోదరికి శిక్ష ఖరారు టీ నగర్ (చెన్నై): శశికళ సోదరి బి.వనితామణి కుమార్తె శీతలాదేవికి మూడేళ్లు, ఆమె భర్త ఎస్ఆర్ భాస్కరన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. శీతలాదేవి దినకరన్‌కు చెల్లెలు. భాస్కరన్ రిజర్వు బ్యాంకు మాజీ ఉద్యోగి. 1988– 97 మధ్యకాలంలో భాస్కరన్ తన భార్య పేరిట ఆదాయానికి మించి రూ.1.68కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ 1998లో కేసు వేసింది. కేసు విచారించిన సీబీఐ కోర్టు భాస్కరన్‌కు ఐదేళ్ల శిక్ష, రూ.20 లక్షలు జరిమానా, శీతలాదేవికి మూడేళ్ల శిక్ష, రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ 2008లో తీర్పుచెప్పింది. దీనిపై వీరు 2008లో హైకోర్టును ఆశ్రయించగా, శిక్షను నిలిపేసి హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు జడ్జి జయచంద్రన్ తీర్పుచెప్పారు. -
బెంగళూరు జైల్లో కుమిలిపోతున్న ఇళవరసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: నా జీవితం ఏమిటి ఇలా అయింది, నేనేం తప్పు చేశానని జైల్లో రోజూ నరకం అనుభవిస్తున్నాను, జైలు నుంచి శవంగానే బైటకు వస్తాను’...ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ, సుధాకరన్లతోపాటు నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న ఇళవరసి తట్టుకోలేని ఆవేదనా భరిత మాటలు ఇవి. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఇళవరసిని చూసేందుకు ఆమె కుమారుడు వివేక్, ఇతర బంధువులు వచ్చినపుడల్లా కన్నీరుమున్నీరవుతున్నట్లు సమాచారం. నా చుట్టూ ఏమి జరుగుతోంది, ఏమీ అర్థం కావడంలేదు అని ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నాను, అసలు నేనేం తప్పు చేశాను, ఇంట్లో ఉంటూ అందరికీ వండి పెట్టాను, అడిగిన చోటల్లా సంతకం పెట్టిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నానని ఆమె వెక్కివెక్కి రోదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓదార్చేందుకు ఎవ్వరివల్ల కావడం లేదు. ఇళవరసి ఆవేదన తీవ్రమై బీపీ పెరిగి రెండుసార్లు స్పృహ కోల్పోయారు. దీంతో ఆమెకు జైల్లోనే అత్యవసర చికిత్సను అందజేశారు. జైలు బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించేందుకు జైళ్లశాఖ నిరాకరించింది. శశికళను పరామర్శించేందుకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే మాటలతో ఆమె ఎంతో కొంత ఊరట చెందుతున్నా, ఇళవరసి మాత్రం జీవితంపై విరక్తి చెందినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. -
మళ్లీ ‘నెచ్చెలి’పై చర్చ
చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. చిన్నమ్మ పేరిట రూ. వెయ్యి కోట్ల విలువగల సినీ మాల్ ఉన్నట్టుగా ఆధారాలతో శుక్రవారం మీ డియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయలలితకు నీడగా ఉంటూ వస్తున్న శశికళ మీద గతంలో ఎ న్నో ఆరోపణలు వచ్చాయి. జయలలిత మీద నమోదైన ప్రతి కేసులోనూ శశికళ పేరు ఉండక తప్పదు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరు జైలు జీవితాన్ని గడిపి, ఎట్టకేలకు అప్పీలుకు వెళ్లి నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ నిర్దోషిత్వాన్ని వ్యతిరేకిస్తూ విచారణలు కోర్టుల్లో సాగుతూ వస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, తాజాగా, చిన్నమ్మ శశికళ పేరిట హఠాత్తుగా రూ.వెయ్యి కోట్ల మేరకు ఆస్తి వచ్చినట్టుగా ఆరోపిస్తూ, ఆధారాలతో సహా ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించడం, అన్నాడీఎంకే వ్యతిరేక మీడియా దాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లే రీతిలో కథనాలు ప్రచూరించడం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారిం ది. వివాదాలు సమసిపోవడంతో ఆలయ బాటల్లో ఉన్న శశికళ మీద రూ.వెయ్యి కోట్ల సినీ స్క్రీన్స్ కథనం రావడం చర్చకు దారితీసింది. అధికారపక్షంపై ప్రతి పక్షాలకు విమర్శనాయుధం లభించినట్టయింది. సినీ మాల్ : వేళచ్చేరిలో ఫీనిక్స్ మాల్ ఉంది. ఇందులో ఎస్పీఐ సినిమా సంస్థకు చెందిన లక్స్ పేరిట 11 స్కీన్స్ ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ సినీ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. తొలుత లక్స్ పేరిట ఉన్న ఈ స్కీన్స్ చడీచప్పుడు కాకుండా జాజ్ పేరిట మార్చి ఉన్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో జాజ్ పేరు రావడంతో అనుమానాలు బయలు దేరాయి. దీనిపై ఆధారాలతో కూడిన కథనం వెలువడడంతో ఇది చినమ్మ చేతికి చిక్కిందా..? అన్న చర్చ మొదలైంది. మీడి యా కథనాల మేరకు.. తవ్వే కొద్ది ఆధారా లు బయటపడటంతో చివరకు ఆ సినీ స్క్రీ న్స్ జయలలిత నెచ్చెలి శశికళ, బంధువు ఇళవ రసి గుప్పెట్లోకి చేరి ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చి ఉన్నది. హాట్వీల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును జాజ్ మార్చినట్టు, 2014 జూలైలో ఇందుకు తగ్గ సంతకాలను శశికళ చేసినట్టుగా కథనాల్లో ప్రచూరించి ఉ న్నారు. సినీ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, టెక్నికల్ సంబంధిత వ్యవహారాల పరిధిలోకి ఈ జాజ్‌ను తీసుకొచ్చి ఉన్నారు. దీనికి డెరైక్టర్లుగా కార్తికేయన్, కలియ పెరుమాల్, శివకుమార్ కుత్తప్పన్ను నియమించి ఉన్నారు. ఈ ముగ్గురు శశికళ బంధు వర్గానికి చెందిన మిడాస్ గోల్డ్‌లోనూ డెరైక్టర్లుగా ఉండటం గమనార్హం. కాగా, ఈ లక్స్‌ను కొనుగోలు చే యడానికి పీవీఆర్ సినిమా కూడా ప్రయత్నించినట్టు, చివరకు రూ.వెయ్యి కోట్లు, లే దా అంతకన్నా ఎక్కువ పెట్టి ఈ 11 స్క్రీన్స్ చేతులు మారినట్టుగా ఆరోపణలు బయలుదేరడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక, రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పించేందుకు సిద్ధమయ్యాయి. -
అవమానం భరించలేక తండ్రి ఆత్మహత్య
వేలూరు: ప్రియుడితో కుమార్తె పరార్ కావడంతో అవమానం భరించలేక తండ్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని చిన్నవెంకటసముద్రం గ్రామానికి చెందిన పన్నీర్‌సెల్వం(50) కుమార్తె ఇలవరసి(20). వానియంబాడిలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు విఘ్నేష్(23)తో పరిచయమేర్పడింది. కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ప్రేమికులిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలవరసి ఈనెల 20వ తేదీన కరుంబూరులోని బ్యాంక్‌లో నగదు డ్రా చేసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. పన్నీర్‌సెల్వం బంధువుల ఇళ్లలో వెతికినా కనిపించలేదు. ఇలవరసి, విఘ్నేష్‌లు పెళ్లి చేసుకునేందుకు పరారైనట్లు తెలిసింది. పన్నీర్ సెల్వం ఉమరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున విఘ్నేష్ స్నేహితులు ఆ దారిలో వస్తుండగా పన్నీర్‌సెల్వం వారి వద్ద కుమార్తె ఆచూకీ గురించి ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆ ముగ్గురు స్నేహితులు మీ కుమార్తెకు మేము దగ్గరుండి విఘ్నేష్‌తో వివాహం చేయించామని తెలిపారు. అవమానం భరించలేక పన్నీర్‌సెల్వం విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు గమనించి పన్నీర్‌సెల్వంను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పన్నీర్‌సెల్వం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పన్నీర్‌సెల్వం బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే పన్నీర్‌సెల్వం ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇలవరసిని తీసుకొస్తేనే మృతదేహాన్ని తీసుకెళతామని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న డీఆర్వో బలరామన్ ఘటనా స్థలానికి చేరుకొని పన్నీర్‌సెల్వం భార్య సెల్వి వద్ద విచారణ జరపగా జరిగిన విషయాన్ని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కోర్టులో ప్రేమజంట హాజరు పోలీసులు విచారణ జరిపి ప్రేమజంట ఇలవరసి, విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకొని బుధవారం ఉదయం డీఎస్పీ మాణిక్యం అధ్యక్షతన వానియంబాడి కోర్టులో హాజరు పరిచారు. ఇలవరసి తండ్రి మృత దేహాన్ని చూసేందుకు అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రేమజంటను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఇరు కులాలు వేరు కావడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.