
మళ్లీ ‘నెచ్చెలి’పై చర్చ
చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. చిన్నమ్మ పేరిట రూ. వెయ్యి కోట్ల విలువగల సినీ మాల్ ఉన్నట్టుగా ఆధారాలతో శుక్రవారం మీ డియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జయలలితకు నీడగా ఉంటూ వస్తున్న శశికళ మీద గతంలో ఎ న్నో ఆరోపణలు వచ్చాయి.
జయలలిత మీద నమోదైన ప్రతి కేసులోనూ శశికళ పేరు ఉండక తప్పదు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరు జైలు జీవితాన్ని గడిపి, ఎట్టకేలకు అప్పీలుకు వెళ్లి నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ నిర్దోషిత్వాన్ని వ్యతిరేకిస్తూ విచారణలు కోర్టుల్లో సాగుతూ వస్తున్నాయి.
ఇంత వరకు బాగానే ఉన్నా, తాజాగా, చిన్నమ్మ శశికళ పేరిట హఠాత్తుగా రూ.వెయ్యి కోట్ల మేరకు ఆస్తి వచ్చినట్టుగా ఆరోపిస్తూ, ఆధారాలతో సహా ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించడం, అన్నాడీఎంకే వ్యతిరేక మీడియా దాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లే రీతిలో కథనాలు ప్రచూరించడం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారిం ది. వివాదాలు సమసిపోవడంతో ఆలయ బాటల్లో ఉన్న శశికళ మీద రూ.వెయ్యి కోట్ల సినీ స్క్రీన్స్ కథనం రావడం చర్చకు దారితీసింది. అధికారపక్షంపై ప్రతి పక్షాలకు విమర్శనాయుధం లభించినట్టయింది.
సినీ మాల్ : వేళచ్చేరిలో ఫీనిక్స్ మాల్ ఉంది. ఇందులో ఎస్‌పీఐ సినిమా సంస్థకు చెందిన లక్స్ పేరిట 11 స్కీన్స్ ఉన్నాయి. ఇటీవలే ఇక్కడ సినీ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. తొలుత లక్స్ పేరిట ఉన్న ఈ స్కీన్స్ చడీచప్పుడు కాకుండా జాజ్ పేరిట మార్చి ఉన్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో జాజ్ పేరు రావడంతో అనుమానాలు బయలు దేరాయి.
దీనిపై ఆధారాలతో కూడిన కథనం వెలువడడంతో ఇది చినమ్మ చేతికి చిక్కిందా..? అన్న చర్చ మొదలైంది. మీడి యా కథనాల మేరకు.. తవ్వే కొద్ది ఆధారా లు బయటపడటంతో చివరకు ఆ సినీ స్క్రీ న్స్ జయలలిత నెచ్చెలి శశికళ, బంధువు ఇళవ రసి గుప్పెట్లోకి చేరి ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చి ఉన్నది.
హాట్‌వీల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును జాజ్ మార్చినట్టు, 2014 జూలైలో ఇందుకు తగ్గ సంతకాలను శశికళ చేసినట్టుగా కథనాల్లో ప్రచూరించి ఉ న్నారు. సినీ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, టెక్నికల్ సంబంధిత వ్యవహారాల పరిధిలోకి ఈ జాజ్‌ను తీసుకొచ్చి ఉన్నారు. దీనికి డెరైక్టర్లుగా కార్తికేయన్, కలియ పెరుమాల్, శివకుమార్ కుత్తప్పన్‌ను నియమించి ఉన్నారు.
ఈ ముగ్గురు శశికళ బంధు వర్గానికి చెందిన మిడాస్ గోల్డ్‌లోనూ డెరైక్టర్లుగా ఉండటం గమనార్హం. కాగా, ఈ లక్స్‌ను కొనుగోలు చే యడానికి పీవీఆర్ సినిమా కూడా ప్రయత్నించినట్టు, చివరకు రూ.వెయ్యి కోట్లు, లే దా అంతకన్నా ఎక్కువ పెట్టి ఈ 11 స్క్రీన్స్ చేతులు మారినట్టుగా ఆరోపణలు బయలుదేరడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక, రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పించేందుకు సిద్ధమయ్యాయి.