మౌనంలో చిన్నమ్మ | sashikala worry about gutka case Inquiry | Sakshi
Sakshi News home page

మౌనంలో చిన్నమ్మ

Published Thu, Feb 1 2018 7:35 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

sashikala worry about gutka case Inquiry - Sakshi

శశికళ

గుట్కా అక్రమ అమ్మకాల గుట్టును రట్టు చేసేందుకు ఐటీ అధికారులు తహతహలాడుతుండగా, శశికళ మౌనవ్రతం విచారణకు అడ్డంకిగా మారింది. వచ్చేనెల 10వ తేదీ తరువాత విచారణకు సిద్ధమని చిన్నమ్మ చెప్పడంతో బెంగళూరు జైలుకు చెన్నై ఐటీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లు జైలుశిక్షను అనుభవిస్తున్న సంగతి పాఠకులకు విధితమే. ఇదిలా ఉండగా శశికళ బంధువులు బోగస్‌ కంపెనీలు నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గత ఏడాది నవంబర్‌లో బంధువులు, మిత్రుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు వెయ్యిమందికి పైగా అధికారులు ఏకకాలంలో 187 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో..సుమారు 50కి పైగా బోగస్‌ కంపెనీలు నడుపుతున్నట్లుగా రుజువుచేసే అనేక డాక్యుమెంట్లు అధికారులకు దొరికినట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్ల పరిశీలనలో రూ.1,430 కోట్ల పన్ను ఎగవేసినట్లు లెక్కకట్టారు. ఇంత పెద్ద ఎత్తున బోగస్‌ కంపెనీల నిర్వహణ వెనుక శశికళ హస్తం ఉందని అనుమానించిన ఐటీ అధికారులు తనిఖీలు పూర్తికాగానే ఆమె బంధువులకు సమన్లు పంపి వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, బోగస్‌ కంపెనీల్లో శశికళ పేరు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేసిన బంధుమిత్రుల జాబితాలో శశికళ పేరును చేర్చినట్లు సమాచారం.

పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ఒక పెన్‌డ్రైవ్, కంప్యూటర్లలోని సమాచారం, డిస్కులను, గుట్కా వ్యవహారంలో ఐటీశాఖ ప్రభుత్వానికి అందజేసిన ఉత్తరం దొరికాయి. ఐటీ శాఖ ఉత్తరం శశికళ గదిలోకి ఎలా చేరిందనేది అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వీటన్నింటినీ శశికళకు నేరుగా చూసి సమాచారం సేకరించాలని, స్వయంగా విచారిస్తేగానీ ఇంకా అనేక నిజాలు వెలుగుచూడవని భావిస్తున్నారు. అయితే ఆమె పొరుగురాష్ట్రంలో జైలు ఖైదీగా ఉండడం అధికారులను ఆలోచనలో పడేసింది. విచారణ కోసం చెన్నైకి పిలిపించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని కొందరు సూచించడంతో తామే బెంగళూరుకు జైలుకు వెళ్లడం ఉత్తమమని నిర్ధారించుకున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు ఇటీవల ఉత్తరం కూడా రాశారు.

గత ఏడాది డిసెంబర్‌ నుంచి శశికళ మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. చిన్నమ్మ మౌనవ్రతం వల్ల విచారణలో జాప్యం నెలకొనే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని ఐటీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల అభ్యంతరాన్ని తెలుసుకున్న శశికళ...విచారణకు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ఐటీ దాడులు, గుట్కా వ్యవహారంలో శశికళను నేరుగా విచారించక తప్పని పరిస్థితులు నెలకొన్న విషయాని ఉత్తరం ద్వారా ఆమెకు తెలిపామని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విచారణకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. విచారణ తేదీ ఖరారుకాగానే చెన్నై నుంచి అధికారుల బృందం బెంగళూరుకు వెళ్లి ఒక ప్రత్యేక గదిలో శశికళను విచారిస్తామని అన్నారు. ఈ విచారణ ఒక్కరోజులో ముగియకపోవచ్చని చెప్పారు. శశికళను విచారించిన తరువాత ఈ వ్యవహారంలో తరువాత అడుగు పడుతుందని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement