Sudhakaran
-
జైలులో చిన్నమ్మ జాగ్రత్తలు
సాక్షి, చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ అండ్ బృందం ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్టు సమాచారం. కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా కలవరంతో దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న పెద్ద సంఖ్యలో ఖైదీలను బెయిల్, పెరోల్ మీద బయటకు పంపించిన విషయం తెలిసిందే. ఆ దిశగా బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ, వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌కు పెరోల్ అ వకాశం లభించినా, ఉపయోగించుకోలేదు. బయట కన్నా, జైల్లోనే ఉండడం మంచిదని వారు భావించారేమో. (కరోనా ; యమలోకం హౌస్‌ఫుల్!) పెరోల్ ప్రయత్నాలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు చేపట్టినా, వారు తిరస్కరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆ జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని సమాచారం. చిన్నమ్మ శశికళ, ఇలవరసి, సుధాకరన్ జైలులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాస్క్‌లు ధరించడమే కాదు, భౌతిక దూరాన్ని పాటి స్తూ జైలులో కాలం నెట్టుకొస్తున్నారు. భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. అలాగే, చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉన్నట్టు తెలిసింది. ఒకరు పెరోల్ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తు తం శశికళ, ఇలవరసి మాత్రమే ఉన్నట్టు భోగట్టా.(తమిళనాడును కబళిస్తున్న కరోనా) -
కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
తిరువనంతపురం : ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సుధాకరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భీకర వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళను సీఎం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కేరళ పునర్నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ చేపట్టిన ఓ ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన సుధాకరన్.. ‘ముఖ్యమంత్రిగా విజయన్ సమర్థవంతంగా పనిచేస్తారని భావించాం. కానీ అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఆయన అత్యంత చెత్త పాలన సాగిస్తున్నారు. విజయన్ ఏ పనిని సరిగా నిర్వర్తించలేకపోయారు’. కమ్యునిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయన్ మగాడిలా రంగంలోకి దూసుకొచ్చారు. కానీ, నేడు అసమర్థ సీఎంగా మిగిలిపోయారు. ఆయన కంటే మహిళలే నయం’ అని సుధాకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుధాకరన్ ముఖ్యమంత్రి స్థాయిని దెబ్బతీసేలా మట్లాడడం పట్ల కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. కాగా, 2018లో కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో సుమారు 480 మంది మరణించారు. -
శశికళ వద్ద ఏమైనా దొరికాయా..
పరప్పన అగ్రహారచెరలోని చిన్నమ్మ శశికళ గదిలో కేంద్ర నేరపరిశోధనా సంస్థ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సమాచారం అమ్మ మక్కల్ మున్నేట్ర వర్గాల్లో ఉత్కంఠను రేపింది. సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. వీరికి జైల్లో లగ్జరీ సౌకర్యాలు అందుతున్నట్టు ఇటీవల ఆరోపణలు బయలుదేరాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో వీడియో టేపులు బయటపడడంతో చర్చ బయలు దేరింది. కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ కుటుంబంద్వారా బాగానే ముట్టడంతోనే ఈ లగ్జరీ జీవితం అన్నట్టుగా బయలు దేరిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. ఆ తదుపరి చిన్నమ్మ అండ్ ఫ్యామిలీకి జైల్లో సౌకర్యాలు తగ్గాయని చెప్పవచ్చు. అయినా, చాపకింద నీరులా వారికి కావాల్సినవన్నీ జైళ్ల శాఖ వర్గాల ద్వారా చేరుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆమెతో ములాఖత్ అయ్యే వారు ఇటీవల కాలంగా పెరగడం, వారి ద్వారా ఆమెకు కావాల్సిన వన్నీ జైల్లో సమకూరుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చిన్నమ్మ గదిలో తనిఖీలు సాగడం చర్చనీయాశంగా మారింది శశికళ గదిలో తనిఖీలు: పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మకు ప్రత్యేక గది కేటాయించారు. బుధవారం రాత్రి కేంద్ర నేరపరిశోధన సంస్థ విభాగం అధికారులు, కర్ణాటక పోలీసుల సమన్వయంతో రెండు వందల మందితో కూడిన ప్రత్యేక బృందం తనిఖీలకు రంగంలోకి దిగింది. ఆ జైల్లోని అన్ని గదుల్ని ఆ బృంద తనిఖీలు చేసింది. అలాగే, చిన్నమ్మ శశికళ గదిలోనూ తనిఖీలు సాగాయి. ఆమెకు ఏదేని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయా, అన్న కోణంలో పరిశీలన సాగడంతో పాటు ఆ జైలు నుంచి ఏకంగా 11 సెల్ఫోన్లు, సిమ్ కార్డులు బయట పడడం గమనార్హం. శశికళకు వద్ద ఏమైనా దొరికాయా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే అమ్మ వర్గాల్లో బయలుదేరింది. భర్త నటరాజన్ మరణం తదుపరి పెరోల్‌ను ముందుగా రద్దు చేసుకుని శశికళ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమె గదిలో తనిఖీలు జరిగి ఉండడంతో ఆ శిబిరం వర్గాల్లో ఉత్కంఠ తప్పలేదు. ఆమె గదిలో ఏమైనా లభించాయా అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదని చెప్పవచ్చు. -
మౌనంలో చిన్నమ్మ
గుట్కా అక్రమ అమ్మకాల గుట్టును రట్టు చేసేందుకు ఐటీ అధికారులు తహతహలాడుతుండగా, శశికళ మౌనవ్రతం విచారణకు అడ్డంకిగా మారింది. వచ్చేనెల 10వ తేదీ తరువాత విచారణకు సిద్ధమని చిన్నమ్మ చెప్పడంతో బెంగళూరు జైలుకు చెన్నై ఐటీ అధికారులు సమాయత్తం అవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, ఆమె సమీప బంధువులు ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లు జైలుశిక్షను అనుభవిస్తున్న సంగతి పాఠకులకు విధితమే. ఇదిలా ఉండగా శశికళ బంధువులు బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు గత ఏడాది నవంబర్‌లో బంధువులు, మిత్రుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు వెయ్యిమందికి పైగా అధికారులు ఏకకాలంలో 187 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో..సుమారు 50కి పైగా బోగస్ కంపెనీలు నడుపుతున్నట్లుగా రుజువుచేసే అనేక డాక్యుమెంట్లు అధికారులకు దొరికినట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్ల పరిశీలనలో రూ.1,430 కోట్ల పన్ను ఎగవేసినట్లు లెక్కకట్టారు. ఇంత పెద్ద ఎత్తున బోగస్ కంపెనీల నిర్వహణ వెనుక శశికళ హస్తం ఉందని అనుమానించిన ఐటీ అధికారులు తనిఖీలు పూర్తికాగానే ఆమె బంధువులకు సమన్లు పంపి వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, బోగస్ కంపెనీల్లో శశికళ పేరు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేసిన బంధుమిత్రుల జాబితాలో శశికళ పేరును చేర్చినట్లు సమాచారం. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ఒక పెన్‌డ్రైవ్, కంప్యూటర్లలోని సమాచారం, డిస్కులను, గుట్కా వ్యవహారంలో ఐటీశాఖ ప్రభుత్వానికి అందజేసిన ఉత్తరం దొరికాయి. ఐటీ శాఖ ఉత్తరం శశికళ గదిలోకి ఎలా చేరిందనేది అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వీటన్నింటినీ శశికళకు నేరుగా చూసి సమాచారం సేకరించాలని, స్వయంగా విచారిస్తేగానీ ఇంకా అనేక నిజాలు వెలుగుచూడవని భావిస్తున్నారు. అయితే ఆమె పొరుగురాష్ట్రంలో జైలు ఖైదీగా ఉండడం అధికారులను ఆలోచనలో పడేసింది. విచారణ కోసం చెన్నైకి పిలిపించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని కొందరు సూచించడంతో తామే బెంగళూరుకు జైలుకు వెళ్లడం ఉత్తమమని నిర్ధారించుకున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు ఇటీవల ఉత్తరం కూడా రాశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి శశికళ మౌనవ్రతం పాటిస్తున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. చిన్నమ్మ మౌనవ్రతం వల్ల విచారణలో జాప్యం నెలకొనే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని ఐటీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారుల అభ్యంతరాన్ని తెలుసుకున్న శశికళ...విచారణకు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఐటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ఐటీ దాడులు, గుట్కా వ్యవహారంలో శశికళను నేరుగా విచారించక తప్పని పరిస్థితులు నెలకొన్న విషయాని ఉత్తరం ద్వారా ఆమెకు తెలిపామని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత విచారణకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. విచారణ తేదీ ఖరారుకాగానే చెన్నై నుంచి అధికారుల బృందం బెంగళూరుకు వెళ్లి ఒక ప్రత్యేక గదిలో శశికళను విచారిస్తామని అన్నారు. ఈ విచారణ ఒక్కరోజులో ముగియకపోవచ్చని చెప్పారు. శశికళను విచారించిన తరువాత ఈ వ్యవహారంలో తరువాత అడుగు పడుతుందని వివరించారు. -
ఇక ఆ ఇద్దరి వంతు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని శశికళ బంధుమి్రత్రులను జల్లెడపట్టిన ఐటీ అధికారులు ఇకబెంగళూరు బాటపట్టనున్నారు.అక్రమార్జనకు సూత్రధారి,కీలకపాత్రధారిగా భావిస్తున్నశశికళను బెంగళూరు జైల్లోనేవిచారించనున్నారు. అదే జైల్లోశిక్ష అనుభవిస్తున్న శశిబంధువులు ఇళవరసి,సుధాకరన్‌లను కూడావిచారణ పరిధిలోకితీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మన్నారుగుడి మాఫియా’గా ముద్రపడిన శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈనెల 9 నుంచి 14వరకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో జరిపిన ఐటీ దాడుల్లో రూ.30వేల కోట్ల ఆస్తులు బయటపడడంతో అధికారుల కళ్లు బైర్లుకమ్మాయి. శశికళ అండ్ కోను హడలెత్తించారు. ఐటీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ వాహనాలకు పెళ్లి వేడుక స్టిక్కర్లు వేసుకుని 187చోట్ల ఏక కాలంలో మెరుపుదాడులు నిర్వహించి కంగారు పుట్టించారు. ప్రజల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేందుకు ఉపయోగపడుతున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికపై కూడా ఐటీ కొరడా ఝుళిపించింది. ఈ సందర్భంగా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకోగా మరికొన్ని ముఖ్యమైన పత్రాలను శశికళ బంధువర్గం మాయం చేసిందని అనుమానిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దాడులకు సంబంధించి శశికళ బంధువులతో విచారణ çపూర్తికావడానికి పదిరోజులపాటూ పట్టే అవకాశం ఉంది. కొడనాడు ఎస్టేట్‌లోని కొంతభాగాన్ని తనిఖీ చేయడం పూర్తికాగా, జయలలిత, శశికళల ప్రయివేటు గదుల తనిఖీలు ఇంకా మిగిలి ఉన్నాయి. అక్రమార్జనలో శశికళనే కీలకపాత్రధారిగా ఐటీ స్వాధీనం చేసుకున్న పత్రాలు రుజువు చేస్తున్నాయి. పెరోల్లోనూ పెద్దనేరం చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించేందుకు శశికళ ఇటీవల ఐదురోజుల పెరోల్‌పై చెన్నైకి వచ్చారు. పెరోల్ రోజుల్లో బసచేసిన ఇల్లు, భర్త ఉన్న ఆస్పత్రి మినహా ఎక్కడికీ వెళ్లరాదని, ముఖ్యంగా పార్టీ నేతలను కలుసుకోరాదని జైళ్లశాఖ కఠినమైన నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే శశికళ ఐదు రోజులు పూర్తిచేసుకుని తిరిగి జైలుకు చేరుకున్నారు. అయితే ఈ ఐదు రోజుల కాలంలో 622 ఆస్తుల్లోనే పేర్లను తారుమారు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఆరు రోజులపాటూ జరిపిన ఐటీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా అధికారులు ఈమేరకు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, తనిఖీల సమయంలో బయటపడిన అనేక సంస్థలకు శశికళతో సంబంధాలున్నట్లు తేలిందని తెలిపారు. ఈ కారణంగా శశికళను తప్పనిసరిగా విచారించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 622 ఆస్తుల మార్పిడి శశికళ బసచేసిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటిలోనే జరిగిందని భావిస్తున్నారు. శశికళను, ఆమె అన్న భార్య ఇళవరసి, సుధాకరన్‌లను విచారించేందుకు చట్టపరంగా అనుమతి పొందుతామని, అలాగే బెంగళూరు పరప్పన అగ్రహార జైళ్ల శాఖకు ఉత్తరం రాస్తున్నామని తెలిపారు. రెండు లేదా మూడువారాల్లో అనుమతి లభిస్తుంది, విచారణ ప్రారంభిస్తామని అన్నారు. ఆర్కే నగర్లా అసెంబ్లీ ఎన్నికలు జయ ప్రాతినిథ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్లో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా రూ.89 కోట్లు ఖర్చుచేసి ఐటీకి దొరికిపోవడంతో ఎన్నికలు రద్దయ్యాయి. అప్పట్లో అదో సంచలనం. కాగా, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా చేసుకుని ఓటర్లకు భారీ ఎత్తున నగదు బట్వాడా జరిగినట్లుగా తాజా ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడం కలకలం రేపింది. అయితే ఆనాటి ఎన్నికలకు సార«థ్యం వహించిన జయలలిత జీవించి లేరు. అమ్మ వెనకాల అన్నీ తానై ఉండిన శశికళ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన ఆధారాలతో అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాన్ని కూడా శశికళ నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఐటీ దాడులు విఫలం : దివాకరన్ అట్టహాసంగా చేసిన ఐటీ దాడులు పూర్తిగా విఫలమని శశికళ సోదరుడు దివాకరన్ గురువారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆరు రోజులుపాటు తనిఖీలు చేసినా అధికారులు తమ నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేక పోయారని అన్నారు. -
చిన్నమ్మా.. చాలమ్మా!
► ములాఖత్‌కు ముక్కుతాడు ► మంత్రులకు సైతం నో ► అధికారుల ఆంక్షలు సాక్షి ప్రతినిధి, చెన్నై: కుప్పలు తెప్పలుగా వస్తున్న సందర్శకులతో పరప్పన ఆగ్రహార జైలును పార్టీ కార్యాలయంగా మార్చవద్దు చిన్నమ్మా...ఇక చాలు అంటూ ఆంక్షలు విధించారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సరిగ్గా సీఎం పీఠం ఎక్కబోతున్న తరుణంలో ఆమె కటకటాల పాలయ్యారు. ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదు. ఇదే కేసులో శశికళతోపాటూ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లు అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జైలులోని ఖైదీలు ములాఖత్ పేరున తమ వారిని కలుసుకునేందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కర్నాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చనేది అత్యంత ముఖ్యమైనది అయితే, శశికళ జైలు నిబంధనలను అతిక్రమంచి అత్యధికుల సందర్శకులతో సంభాషించినట్లు తేలింది. ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు (31 రోజుల్లో) 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. సంభాషణ సైతం 15 నిమిషాలకు పరిమితం కాకుండా 40 నిమిషాలపాటూ సాగించారు. అంతేగాక ములాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయాల్సిన తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నా రాష్ట్రంలో ఆమె కన్నుసన్నులోని ప్రభుత్వమే నడుస్తోంది. జైలు నుండే పరోక్షంగా పార్టీ, ప్రభుత్వంపై ఆమె పెత్తనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరచూ తమ పార్టీ వారిని కలుసుకోవడం ఆమెకు అనివార్యంగా మారింది. ములాఖత్‌కు ముక్కుతాడు ములాఖత్ కింద ఇప్పటికే లెక్కకు మించి సందర్శకులు వచ్చినందున ఇకపై జోరు తగ్గించాలని శశికళను జైలు అధికారులు ఆదేశించారు. సాధారణ సందర్శకులే కాదు మంత్రులను సైతం అనుమతించేది లేదని నొక్కిచెప్పారు. ప్రత్యేక అనుమతి పొంది వచ్చినా అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఆమెను కలిసేందుకు ప్రయత్నించినవారిని జైలు అధికారులు తిప్పిపంపేశారు. ములాఖత్ కింద శశికళ ఇప్పటికే సంఖ్య గీతను దాటారు, ఇకపై ఆ లెక్కను తగ్గించే ప్రయత్నంలో ఉన్నామ్ని బెంగళూరు జైలు అధికారి తెలిపారు. -
చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
-
చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. జయలలితను పరామర్శించేందుకు వచ్చిన పెంపుడు కుమారుడు సుధాకరన్ ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. సుధాకరన్ ను అనుమతించాలని ఆయన మద్దతుదారులు వేడుకున్నా పోలీసులు ఒప్పుకోలేదు. అనుమతి వచ్చిన తర్వాతే లోపలికి పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ను కూడా ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. 'అమ్మ' ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మంత్రులు, అన్నాడీఎంకే నాయకులు అపోలో ఆస్పత్రికి వస్తున్నారు. జయలలితకు చికిత్స అందించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఒకటి గురువారం ఉదయం చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుంది. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇప్పుడు కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. కాగా, జయలలిత ఆరోగ్యంపై ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన రెండో పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.