
చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. జయలలితను పరామర్శించేందుకు వచ్చిన పెంపుడు కుమారుడు సుధాకరన్ ను పోలీసులు లోపలికి అనుమతించలేదు. సుధాకరన్ ను అనుమతించాలని ఆయన మద్దతుదారులు వేడుకున్నా పోలీసులు ఒప్పుకోలేదు. అనుమతి వచ్చిన తర్వాతే లోపలికి పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ను కూడా ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు.
'అమ్మ' ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మంత్రులు, అన్నాడీఎంకే నాయకులు అపోలో ఆస్పత్రికి వస్తున్నారు. జయలలితకు చికిత్స అందించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఒకటి గురువారం ఉదయం చెన్నై అపోలో ఆస్పత్రికి చేరుకుంది.
సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఇప్పుడు కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు. కాగా, జయలలిత ఆరోగ్యంపై ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన రెండో పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.