
పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయన్ మగాడిలా రంగంలోకి దూసుకొచ్చారు. కానీ, నేడు అసమర్థ సీఎంగా మిగిలిపోయారు. ఆయన కంటే మహిళలే నయం
తిరువనంతపురం : ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సుధాకరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భీకర వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళను సీఎం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కేరళ పునర్నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ చేపట్టిన ఓ ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన సుధాకరన్..
‘ముఖ్యమంత్రిగా విజయన్ సమర్థవంతంగా పనిచేస్తారని భావించాం. కానీ అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఆయన అత్యంత చెత్త పాలన సాగిస్తున్నారు. విజయన్ ఏ పనిని సరిగా నిర్వర్తించలేకపోయారు’. కమ్యునిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు విజయన్ మగాడిలా రంగంలోకి దూసుకొచ్చారు. కానీ, నేడు అసమర్థ సీఎంగా మిగిలిపోయారు. ఆయన కంటే మహిళలే నయం’ అని సుధాకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుధాకరన్ ముఖ్యమంత్రి స్థాయిని దెబ్బతీసేలా మట్లాడడం పట్ల కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. కాగా, 2018లో కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో సుమారు 480 మంది మరణించారు.