పరప్పన అగ్రహారచెరలోని చిన్నమ్మ శశికళ గదిలో కేంద్ర నేరపరిశోధనా సంస్థ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సమాచారం అమ్మ మక్కల్ మున్నేట్ర వర్గాల్లో ఉత్కంఠను రేపింది.
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. వీరికి జైల్లో లగ్జరీ సౌకర్యాలు అందుతున్నట్టు ఇటీవల ఆరోపణలు బయలుదేరాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో వీడియో టేపులు బయటపడడంతో చర్చ బయలు దేరింది. కర్ణాటక జైళ్ల శాఖకు చిన్నమ్మ కుటుంబంద్వారా బాగానే ముట్టడంతోనే ఈ లగ్జరీ జీవితం అన్నట్టుగా బయలు దేరిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. ఆ తదుపరి చిన్నమ్మ అండ్ ఫ్యామిలీకి జైల్లో సౌకర్యాలు తగ్గాయని చెప్పవచ్చు. అయినా, చాపకింద నీరులా వారికి కావాల్సినవన్నీ జైళ్ల శాఖ వర్గాల ద్వారా చేరుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆమెతో ములాఖత్ అయ్యే వారు ఇటీవల కాలంగా పెరగడం, వారి ద్వారా ఆమెకు కావాల్సిన వన్నీ జైల్లో సమకూరుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చిన్నమ్మ గదిలో తనిఖీలు సాగడం చర్చనీయాశంగా మారింది
శశికళ గదిలో తనిఖీలు: పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మకు ప్రత్యేక గది కేటాయించారు. బుధవారం రాత్రి కేంద్ర నేరపరిశోధన సంస్థ విభాగం అధికారులు, కర్ణాటక పోలీసుల సమన్వయంతో రెండు వందల మందితో కూడిన ప్రత్యేక బృందం తనిఖీలకు రంగంలోకి దిగింది. ఆ జైల్లోని అన్ని గదుల్ని ఆ బృంద తనిఖీలు చేసింది. అలాగే, చిన్నమ్మ శశికళ గదిలోనూ తనిఖీలు సాగాయి. ఆమెకు ఏదేని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయా, అన్న కోణంలో పరిశీలన సాగడంతో పాటు ఆ జైలు నుంచి ఏకంగా 11 సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు బయట పడడం గమనార్హం. శశికళకు వద్ద ఏమైనా దొరికాయా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే అమ్మ వర్గాల్లో బయలుదేరింది. భర్త నటరాజన్ మరణం తదుపరి పెరోల్‌ను ముందుగా రద్దు చేసుకుని శశికళ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమె గదిలో తనిఖీలు జరిగి ఉండడంతో ఆ శిబిరం వర్గాల్లో ఉత్కంఠ తప్పలేదు. ఆమె గదిలో ఏమైనా లభించాయా అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment