చిన్నమ్మా.. చాలమ్మా!
చిన్నమ్మా.. చాలమ్మా!
Published Wed, Apr 12 2017 9:32 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
► ములాఖత్‌కు ముక్కుతాడు
► మంత్రులకు సైతం నో
► అధికారుల ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుప్పలు తెప్పలుగా వస్తున్న సందర్శకులతో పరప్పన ఆగ్రహార జైలును పార్టీ కార్యాలయంగా మార్చవద్దు చిన్నమ్మా...ఇక చాలు అంటూ ఆంక్షలు విధించారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సరిగ్గా సీఎం పీఠం ఎక్కబోతున్న తరుణంలో ఆమె కటకటాల పాలయ్యారు.
ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదు. ఇదే కేసులో శశికళతోపాటూ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లు అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జైలులోని ఖైదీలు ములాఖత్ పేరున తమ వారిని కలుసుకునేందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కర్నాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చనేది అత్యంత ముఖ్యమైనది అయితే, శశికళ జైలు నిబంధనలను అతిక్రమంచి అత్యధికుల సందర్శకులతో సంభాషించినట్లు తేలింది.
ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు (31 రోజుల్లో) 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. సంభాషణ సైతం 15 నిమిషాలకు పరిమితం కాకుండా 40 నిమిషాలపాటూ సాగించారు. అంతేగాక ములాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయాల్సిన తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నా రాష్ట్రంలో ఆమె కన్నుసన్నులోని ప్రభుత్వమే నడుస్తోంది. జైలు నుండే పరోక్షంగా పార్టీ, ప్రభుత్వంపై ఆమె పెత్తనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరచూ తమ పార్టీ వారిని కలుసుకోవడం ఆమెకు అనివార్యంగా మారింది.
ములాఖత్‌కు ముక్కుతాడు
ములాఖత్ కింద ఇప్పటికే లెక్కకు మించి సందర్శకులు వచ్చినందున ఇకపై జోరు తగ్గించాలని శశికళను జైలు అధికారులు ఆదేశించారు. సాధారణ సందర్శకులే కాదు మంత్రులను సైతం అనుమతించేది లేదని నొక్కిచెప్పారు. ప్రత్యేక అనుమతి పొంది వచ్చినా అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఆమెను కలిసేందుకు ప్రయత్నించినవారిని జైలు అధికారులు తిప్పిపంపేశారు. ములాఖత్ కింద శశికళ ఇప్పటికే సంఖ్య గీతను దాటారు, ఇకపై ఆ లెక్కను తగ్గించే ప్రయత్నంలో ఉన్నామ్ని బెంగళూరు జైలు అధికారి తెలిపారు.
Advertisement
Advertisement