
అవమానం భరించలేక తండ్రి ఆత్మహత్య
వేలూరు: ప్రియుడితో కుమార్తె పరార్ కావడంతో అవమానం భరించలేక తండ్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని చిన్నవెంకటసముద్రం గ్రామానికి చెందిన పన్నీర్‌సెల్వం(50) కుమార్తె ఇలవరసి(20). వానియంబాడిలోని ప్రైవేటు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు అదే గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు విఘ్నేష్(23)తో పరిచయమేర్పడింది. కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ప్రేమికులిద్దరూ పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇలవరసి ఈనెల 20వ తేదీన కరుంబూరులోని బ్యాంక్‌లో నగదు డ్రా చేసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. పన్నీర్‌సెల్వం బంధువుల ఇళ్లలో వెతికినా కనిపించలేదు. ఇలవరసి, విఘ్నేష్‌లు పెళ్లి చేసుకునేందుకు పరారైనట్లు తెలిసింది. పన్నీర్ సెల్వం ఉమరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున విఘ్నేష్ స్నేహితులు ఆ దారిలో వస్తుండగా పన్నీర్‌సెల్వం వారి వద్ద కుమార్తె ఆచూకీ గురించి ప్రశ్నించాడు. ఆ సమయంలో ఆ ముగ్గురు స్నేహితులు మీ కుమార్తెకు మేము దగ్గరుండి విఘ్నేష్‌తో వివాహం చేయించామని తెలిపారు. అవమానం భరించలేక పన్నీర్‌సెల్వం విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
స్థానికులు గమనించి పన్నీర్‌సెల్వంను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పన్నీర్‌సెల్వం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పన్నీర్‌సెల్వం బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే పన్నీర్‌సెల్వం ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇలవరసిని తీసుకొస్తేనే మృతదేహాన్ని తీసుకెళతామని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న డీఆర్‌వో బలరామన్ ఘటనా స్థలానికి చేరుకొని పన్నీర్‌సెల్వం భార్య సెల్వి వద్ద విచారణ జరపగా జరిగిన విషయాన్ని తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
కోర్టులో ప్రేమజంట హాజరు
పోలీసులు విచారణ జరిపి ప్రేమజంట ఇలవరసి, విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకొని బుధవారం ఉదయం డీఎస్‌పీ మాణిక్యం అధ్యక్షతన వానియంబాడి కోర్టులో హాజరు పరిచారు. ఇలవరసి తండ్రి మృత దేహాన్ని చూసేందుకు అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రేమజంటను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఇరు కులాలు వేరు కావడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.