అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ, ఆమె బంధుమిత్రులపై ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు మెరుపుదాడులు నిర్వహించిన సంగతి పాఠకులకు విదితమే. ఈనెల 9వ తేదీ నుంచి ఆరురోజులు పాటు జరిగిన దాడుల సందర్భంగా రూ.1500 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో రూ.1012 కోటి అవకతవకలు సాగినట్లుగా అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. కొద్దిరోజుల విరామం తరువాత చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసంలో జరిపి రెండు కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు, నాలుగు పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటూ అనేక కొరియర్ రశీదులు దొరికిన సమాచారం సోమవారం వెలుగులోకి వచ్చింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐటీ దాడులతో ఇప్పటికే ఊపిరి సలపలేనంత ఉత్కంఠ ఎదుర్కొంటున్న శశికళ, ఇళవరసిల మెడకు మరో ఉచ్చు బిగుసుకోనుంది. పది బోగస్ సంస్థల ద్వారా భారీ మోసానికి పాల్పడిన అభియోగంపై సీబీఐ త్వరలో కేసు బనాయించనుంది. అవసరమైతే వారిద్దరిని మరోసారి అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
బోగస్ సంస్థల బాగోతం
ఐటీ దాడుల సమయంలో శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా, వారి బినామీ పేర్లతో పలు బోగస్ సంస్థలు ఉన్న విషయం బయటపడింది. గత ఏడాది నవంబరులో రూ.1000, రూ.500ల పెద్ద నోట్లు రద్దయిన తరువాత దేశంలో అనేక బోగస్ సంస్థలు మూతపడ్డాయి. మూతపడ్డ వాటిల్లో శశికళ, ఇళవరసి వారి బంధువులకు చెందిన పది బోగస్ సంస్థలున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థల ద్వారా కొన్ని కోట్లరూపాయల గోల్‌మాల్ సాగినట్లుగా సమాచారం ఉన్నందున విచారణ చేపట్టాల్సిందిగా ఐటీ శాఖను కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు చెన్నై ఐటీశాఖ ప్రధాన సంచాలకులు మురళీకుమార్, ఫస్ట్‌క్లాస్ ప్రధాన సంచాలకులు తిరుమలకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ ప్రత్యేక బృందం తీవ్రస్థాయిలో రహస్య విచారణ చేపట్టింది. ఈ బోగస్ సంస్థల ద్వారా అనేక కొత్త సంస్థలకు నగదు రవాణా జరిగింది.
ఈ కొత్త సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తెలు కృష్ణప్రియ, షకీలల, మిత్రులు బినామీలుగా వ్యవహరిస్తున్న సంగతి బయటకు వచ్చింది. ఈ బోగస్ సంస్థల ద్వారా విదేశీమారక ద్రవ్యాన్ని సైతం చలామణి చేసినట్టు తేలింది. బోగస్ కంపెనీల్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా సంస్థలు కాకుండా నివాస గృహాలు, ఒకే చిరునామా కింద అనేక సంస్థలు ఉండడాన్ని కనుగొన్నారు. ఈ సమాచారం మేరకే ఇటీవల శశికళ బంధుమిత్రుల ఇళ్లపై ఐటీదాడులు చేపట్టడా, రూ.1500 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జయ నివాసంలో జరిగిన సోదాల్లో అనేక కొరియర్ రశీదులు దొరికాయి. దీంతో విలువైన ఆస్తిపత్రాలను విదేశాలకు చేరవేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తూ రశీదులను విశ్లేషిస్తున్నారు.
సీబీఐకి నివేదిక
మొత్తం ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో నివేదికను తయారు చేసి సీబీఐకి అప్పగించాలని ఐటీ అధికారులు నిర్ణయించారు. నివేదిక అందగానే శశికళ అండ్ కో పై కేసులు నమోదకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేగాక సీబీఐ అధికారులు ఇప్పటికే రహస్య విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన కొన్ని బోగస్ సంస్థలకు శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఐటీ నుంచి నివేదిక అందగానే దాన్ని ఫిర్యాదుగా పరిగణించి కేసులు పెడతామని తెలిపారు. అవసరమైతే వారిద్దరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment