పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ఎంపీ అవినాష్‌రెడ్డిగానీ మరెవరూ గానీ తనతో చెప్పలేదని పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ స్పష్టం చేశారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఆమె ఖండించారు. కనీసం తనతో సంప్రదించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తన పేరును ఉటంకిస్తూ అవాస్తవాలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు. పులివెందులలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఉదయం తమ స్థలాలకు సంబంధించిన విషయంపై కలిసేందుకు వెళ్లిన మాట వాస్తవమన్నారు. అక్కడ కొంతమంది పనివాళ్లు ఉన్నారని, వివేకానందరెడ్డిని కలవాలని సమాచారం ఇవ్వగా సమాధానం చెప్పలేదన్నారు. దాంతో కాసేపు వేచి చూశానన్నారు. కొద్దిసేపటికి కొన్ని కార్లు వచ్చాయని తెలిపారు. ‘అందులో నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీకి చెందిన మరికొంతమంది అనుచరులు ఇంటి లోపలికి వెళ్లారు.
ఐదు నిమిషాల్లోనే అవినాష్‌రెడ్డి బయటకు వచ్చి ఆందోళనగా వివేకా ఇంటి లాన్‌లో ఫోన్‌లో మాట్లాడారు. అక్కడ గుమికూడిన వారు వివేకా సార్ చనిపోయారని మాట్లాడుకోవడం విన్నా. వెంటనే లోపలికి వెళ్లి చూడగా వివేకానందరెడ్డి చనిపోయి కనిపించారు. అక్కడ అంతా రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపించింది. కొందరు గుండె నొప్పి అని, మరికొందరు రక్తపు వాంతులతో చనిపోయారని చర్చించుకున్నారు. అనంతరం బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోయా. అంతేకానీ వివేకా ఇంటి వద్ద అవినాష్‌రెడ్డి నాతో మాట్లాడలేదు.
నేను కూడా ఆయనతో ఏమీ మాట్లాడలేదు. సిట్, సీబీఐ అధికారులు విచారణకు పిలిచినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పా’ అని శశికళ పేర్కొన్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డేనని తనతో సహా జిల్లాలో అందరికి తెలుసన్నారు. వైఎస్ వివేకాను పని విషయమై కలవడానికి వెళ్లినప్పుడు కూడా ఎంపీగా వైఎస్ అవినాష్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచేలా మీరంతా కృషి చేయాలని తమతో చెప్పేవారన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ వివేకా ఉంటే అవినాష్‌రెడ్డికి ప్రయోజనమే కానీ ఎలాంటి నష్టం లేదన్నారు. బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు ఎందుకు జరిగాయి? దాని వెనుక రహస్యాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment