పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టుకు సునీల్ కుమార్ యాదవ్‌ను తీసుకొచ్చిన సీబీఐ బృందం
కడప అర్బన్ / పులివెందుల రూరల్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అనుమానితుడిగా నిర్ధారించిన సునీల్ కుమార్ యాదవ్‌కు పులివెందులలోని మొదటి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సీబీఐ అధికారుల బృందం బుధవారం ఉదయం కడప రిమ్స్‌లో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించిన తర్వాత పులివెందుల కోర్టులో మధ్యాహ్నం 2:55 గంటలకు హాజరు పరిచారు. సాయంత్రం 6:15 గంటలకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించడంతో అక్కడి నుంచి కడప కేంద్ర కారాగారానికి తీసుకెళ్లి అక్కడి అధికారులకు అప్పగించారు.
సునీల్ కుమార్ యాదవ్‌ను విచారించేందుకు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అంతకు ముందు సీబీఐ వారు అదే మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజే (బుధవారం) రిమాండ్‌కు విధించినందున, ఇదే రోజు కస్టడీకి ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. కాగా, ఈ హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా సీబీఐ తమ కుటుంబాన్ని వేధిస్తోందని గత నెలలో సునీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత ఇతను అజ్ఞాతంలోకి వెళ్లగా.. గోవాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మాకు ప్రాణహాని ఉంది..
సునీల్ కుమార్ యాదవ్‌ను పులివెందుల కోర్టులో హాజరు పరుస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రమ్మ, భార్య లక్ష్మి, సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్‌లు అతన్ని కలిసేందుకు వచ్చారు. యాదవ్.. కారులో ఉండగా, కోర్టు ఆవరణలోని గదిలో అతనితో మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఈ హత్య కేసులో మాకు ఏమీ సంబంధం లేకపోయినా అనవసరంగా ఇరికించారు. పదేపదే పిలిపించి విచారిస్తున్నారు. మేము ఊరు విడిచి వెళ్లాం. మాకు ప్రాణ భయం కూడా ఉంది. సునీల్‌ను అనవసరంగా అరెస్ట్ చేశారు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. సీబీఐ బృందం యాదవ్ రిమాండ్ వ్యవహారంలో బిజీగా ఉండటంతో వారు వెనుదిరిగి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment