
ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండివారుస్తోంది
వైఎస్ వివేకానందరెడ్డి పీఏ మూలి వెంకట కృష్ణారెడ్డి మండిపాటు
సునీత, రాజశేఖర్‌లు నన్ను బెదిరించడం వాస్తవం కాదా?..రాంసింగ్ నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిజం కాదా?
ఇవి తప్పని కాణిపాకం, తిరుమల, చర్చిలలో ప్రమాణం చేయగలరా?.. సీఐ రాజు మా ఇంటికి రెండుసార్లు వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు
పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ కంప్లయింట్ వేశాను
పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను వండి వారుస్తోందని ఆయన పీఏ మూలి వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం చూసి తాను మీడియా ఎదుటకు వచ్చానని చెప్పారు. ఈ కేసులో వాస్తవంగా ఎవరు డైరెక్షన్ చేస్తున్నారో, ఎవరు యాక్షన్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
‘వివేకా చనిపోయిన రోజు నాకు ఒక లెటర్ దొరికితే, ఆ విషయం నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలిపాను. దాన్ని దాచిపెట్టమని ఆయన చెప్పగా.. పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుందన్నాను. నీకెందుకు.. నేను చూసుకుంటానని ఆయన గట్టిగా చెప్పగా.. వారి ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచి పెట్టాను. నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయన చెబితే ఆ పని చేసిన నన్ను ఇరికించారు. ఎల్లో మీడియా ఈ వాస్తవాలను మాత్రం రాయదు.. చూపదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..
మా ఫోన్ల ఆధారంగా విచారించాలి
⇒ అప్పట్లో నన్ను డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు. రిమాండ్‌కు పంపించారు. 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. వారు ఎప్పుడు పిలిచినా వెళ్లి సహకరించాను. 2021 మార్చి 3న ఢిల్లీ నుంచి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ కౌర్ నుంచి నోటీసు అందుకున్నాను. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు. ఇలా జరుగుతుందని రాజశేఖర్ నాకు ముందుగానే చెప్పారు. అంటే వారికి ముందే ఈ విషయం తెలిసి నాతో డ్రామాలాడారని తర్వాత తెలిసింది.
⇒ నేను ఢిల్లీ వెళ్లడానికి రాజశేఖర్ విమానం టిక్కెట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉండటానికి వసతి కూడా కల్పించారు. ఖర్చుల కోసం నా అకౌంట్‌లో రూ.50 వేలు జమ (పాస్‌బుక్ జిరాక్స్ చూపారు) చేశారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోని నాలుగో సూట్ రూంలో రాంసింగ్ మేము చెప్పినట్లు విని రంగన్న, దస్తగిరి బయటపడ్డారని.. నువ్వు కూడా నేను చెప్పినట్లుగా అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నన్ను కొట్టారు. నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను. ఆ అరుపులను బయటున్న ఈసీ సురేంద్రనాథరెడ్డి విన్నారు.ఇప్పుడు వాటికి సాక్ష్యాల్లేవంటున్నారు.
⇒ కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రాంసింగ్ నా కుమారుల ఎదుటే నన్ను కొట్టారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. వీటికీ సాక్ష్యాలు లేవంటున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడంటున్నారన్నారు. వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్పకుండా నా తరఫున చెబుతాడా? 2021 అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నా కుమారుడిని సునీత, రాజశేఖర్‌లు పిలిపించుకుని ‘మీ నాన్న రాంసింగ్ చెప్పినట్లు వినాలి. అందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలి’ అని తీవ్రంగా ఒత్తిడి చేశారు.

⇒ దీంతో నేను ఆ రాత్రే బయలుదేరి 18నహైదరాబాద్‌కు వెళ్లాను. పాత ఆఫీస్‌కు కాకుండా కొత్త ఆఫీసుకు (ఇక్కడ సీసీ కెమెరాలు లేవు) రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లాక రాంసింగ్ చెప్పినట్లు వినాలని సునీత నాపైఒత్తిడి తెచ్చారు. నేనేమో ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. మనం చెప్పినట్లు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకు వెళతావని సునీత.. రాజశేఖర్‌తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్లుగా నాకు అనుమానం వచ్చింది. మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి.
నేను వేసిన కేసును కొట్టేయించుకోవడానికి పాట్లు
⇒ ఆ పరిస్థితిలో సునీత, రాజశేఖర్, రాంసింగ్‌లు నన్ను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను. అయినా స్పందన లేనందున పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ వేశాను. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సీఐ రాజు స్వయంగా మా ఇంటికి రెండుసార్లు వచ్చి నాతో 20 పేజీల స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు అసలు విచారణే చేయలేదని చెబుతున్నారు. ఇందులో పోలీసు అధికారులైన రాజేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డిలకు ఎటువంటి సంబంధం లేదు. నేను అవినాష్‌తో మాట్లాడినట్లు నిరూపించాలి. సునీత, రాజశేఖర్‌లు నన్ను బెదిరించలేదని, రాంసింగ్ నన్ను కొట్టలేదని తిరుమల/కాణిపాకం/ఏ చర్చిలో అయినా సరే వారు ప్రమాణం చేస్తే నేను ఈ కేసును విత్‌డ్రా చేసుకుంటాను.
⇒ నేను వేసిన కేసును క్వాష్ చేసుకోవడానికి అప్పట్లో సునీత, రాజశేఖర్, రాంసింగ్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కింది కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంతలో కూటమి ప్రభుత్వం రావడంతో కేసు కొట్టేయించుకోవాలని సునీత.. చంద్రబాబును, హోం మంత్రి అనితను ఆశ్రయించారు. (అందుకు సంబంధించిన ఫొటోలను మీడియాకు చూపారు).