Venkata Krishna Reddy
-
మా పార్టీ జోలికొస్తే సహించం
ఒంగోలు: మిత్రపక్షంగా ఉంటారో...వెళతారో అనేది మీరే తేల్చుకోండి...అంతే తప్ప మిత్రపక్షం అంటూ మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే మాత్రం సహించేది లేదంటూ టీడీపీ నాయకులను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులివెంకట కృష్ణారెడ్డి హెచ్చరించారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని మిత్రపక్షంగా భావించి తాము మౌనంగా ఉంటున్నా టీడీపీ నాయకుల వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉంటుందన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిందని, దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీఈవో నిర్ణయం వెలువరించారన్నారు. దీనిపై హైకోర్టులో సవాల్ చేసి తిరిగి ఆమె త్రిపురాంతకం ఎంపీపీగా కొనసాగుతున్నారన్నారు. తాజాగా జరుగుతున్న జన్మభూమి–మా వూరు కార్యక్రమంలో ఆమెను ఖాతరు చేయకుండా ఆమె మాట్లాడుతుంటే మైక్ సైతం లాక్కోవడం, ఎంపీడీఓవో మాణిక్యాలరావు అయితే ఏకంగా టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం రూ.14 కోట్ల అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుందని తేల్చిందన్నారు. అంతే కాకుండా మరుగుదొడ్లలో కూడా రూ.2 కోట్ల అవినీతి చోటుచేసుకోవడంతో దానిపై చెన్నమ్మ ప్రశ్నించారన్నారు. అక్కడి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పినట్లుగా నడుస్తూ ఎంపీపీ పట్ల నిర్లక్ష్యంగా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ఎంపీడీవో మాణిక్యాలరావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అక్కడ జరిగిన అవినీతి నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో నాలుగు రోజుల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధిష్టానంతోపాటు, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరవుతారని ఆశిస్తున్నామని, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ త్వరలోనే కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీపీ నీలం చెన్నమ్మ మాట్లాడుతూ అవినీతిపై గళం ఎత్తుతున్నందుకే తమను బీజేపీలో ఉన్నా హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడ ఎమ్మెల్యే అయి పార్టీ మారిన డేవిడ్‌రాజు, దళిత ఎంపీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కోఆప్షన్ సభ్యుడు నీలం లాజర్ మాట్లాడుతూ బీజేపీ ఉనికినే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాము జిల్లా అధ్యక్షుడ్ని కలిసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బొద్దులూరి ఆంజనేయులు, ముదివర్తి బాబూరావు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు సరిచేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతసాగరం మండలం బి. అగ్రహారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి(28) అనే వ్యక్తి ఇంట్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరిగిందో చూడటానికి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచినీటి సమస్యపై దృష్టి
ఏజెన్సీలో 131 పాఠశాలల్లో సదుపాయానికి ప్రతిపాదనలు పాఠ్యపుస్తకాల బాధ్యత హెచ్‌ఎంలదే అందలేదని ఫిర్యాదు వస్తే చర్య డీఈఓ వెంకటకృష్ణారెడ్డి చోడవరం/మాడుగుల : పాఠశాలల్లో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పాఠ్యపుస్తకాలు అందలేదని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ హెచ్చరించారు. శనివారం చోడవరం, మాడుగుల మండలాలలో ఆయన పర్యటించారు. చోడవరం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మంచినీరు, సైన్స్‌ల్యాబ్, పాఠశాల ఆవరణ పరిశీలించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో 131 పాఠశాలల్లో మంచి నీటి సమస్య ఉందని గుర్తించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ప్ర తిపాదనలు పంపామన్నారు. ఈసారి జూన్ 7 నాటికే జిల్లాలో 24 లక్షల 67 వేల 263 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 28 వేల పుస్తకాల కొరత ఉందన్నారు. పంపిణీ చేసిన పుస్తకాలు అందించే బాధ్యత హెచఎంలదేనన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకు ఎస్ఎంసీ నిధులు వినియోగించాలనిహెచ్ఎంలకు సూచించారు. టెన్త్‌లో గత విద్యా సంవత్సరంలో 90.80 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ విద్యా సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఎకడమిక్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. 1718 ఉపాధ్యాయ ఖాళీలు జిల్లాలో 1718 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఈఓ చెప్పారు. ఇందులో 219 బ్యాక్లాగ్ పోస్టులన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 163 పాఠశాలలు అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఏజెన్సీలో 26 కొత్త పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో ఆర్వీఎం పథకంలో 65 పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని, రెండో విడతలో 21 భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో 15 భవనాలు పూర్తికాగా మిగిలినవి అసంపూర్తిగా ఉన్నట్లు చెప్పారు. మూడో విడతలో 151 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 1674 పాఠశాలల్లో వంటషెడ్లు జిల్లాలో 4174 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1674 పాఠశాలకు వంటషెడ్లు ఉన్నాయని డీఈఓ చెప్పారు. తొలివిడతలో మ రో 1605 పాఠశాలలకు షెడ్లు మంజూరు చేశామని, వీటిలో 675 పూర్తయ్యాయన్నారు. రెండో విడత 868 షెడ్లకు రూ.1.5 లక్షలు చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం అందేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థి స్థాయినబట్టి బోధన ఉండాలి విద్యార్థుల గ్రాహక స్థాయిని బట్టి బోధన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యనందించాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డి సూచించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎంలతో కలిసి ఉపాధ్యాయులంతా టీమ్‌గా ఏర్పడి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోళెం సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
వర్ష బాధితులను ఆదుకుంటాం..
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: గత నెల, రెండు రోజులగానూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన ఇన్చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్, వివిధ శాఖల అధికారులతో బాధితులకు అందించిన సాయంపై సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలో వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3,330 ఇళ్లు దెబ్బతినగా, రూ.91.29 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి వంట సామగ్రికి రూ.2,500, దుస్తుల కొనుగోలుకు రూ.2,500 అందించినట్లు చెప్పారు. హెలెన్ కారణంగా జిల్లాలో 10 వేల హెక్టార్లలో వరి దెబ్బతిందని తెలిపారు. నాలుగు మండలాల్లో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి రెండువేల మందిని తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజనపై పునరాలోచించాలి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్రం పునరాలోచించాలని మంత్రి కాసు కోరారు. రా్రష్ట విభజన వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేసే ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని తెలిపారు. రాష్ర్ట సమైక్యతకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం మారతారని ఇటీవల వచ్చిన ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు. -
రేపు సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఆదివారం సమైక్య శంఖారావ సభను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కోశాధికారి రాకేశ్ రెడ్డి, మహిళా కార్యదర్శి బత్తుల అరుణాదాస్‌తో కలసి శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య శంఖారావాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యారణ్యపురలోని కొడగు సమాజ భవనం ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ధర్నానుద్దేశించి ప్రవాసాంధ్ర ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు. సమైక్య ఉద్యమానికి ఇది కేవలం సన్నాహకం మాత్రమేనని, నగరంలోని ఇతర తెలుగు సంఘాలతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించనున్నామని చెప్పారు. 2009లోనే సమైక్యానికి అనుకూలంగా ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్‌లో 2009 జరిగిన శాసన సభ ఎన్నికల్లోనే ప్రజలు సమైక్యానికి అనుకూలంగా ఓటేశారని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, టీఆర్ఎస్, వామపక్షాలు తెలంగాణ అనుకూల వాణిని వినిపించాయని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఆ మహా కూటమితో పాటు తెలంగాణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ఆర్ ప్రవచించిన సమైక్య వాదానికే సీమాంధ్రతో పాటు తెలంగాణలో ఓట్లు పడ్డాయని వివరించారు. కనుక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే అధికారం, హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ ఫలితాలపై ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే 2014 మేలో జరగాల్సిన శాసన సభ ఎన్నికలను ‘సమైక్యం-విభజన’ ప్రధానాంశంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పునకు ఎవరైనా కట్టుబడి ఉండాలని సూచించారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని మనమంతా సమైక్యంగా ఉంచలేకపోతే భావి తరాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సమైక్య శంఖారావం సభ నిర్వహణలో ప్రధాన పాత్రను పోషించనున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవాసాంధ్రులు కూడా పాల్గొన్నారు.