మంచినీటి సమస్యపై దృష్టి
- ఏజెన్సీలో 131 పాఠశాలల్లో సదుపాయానికి ప్రతిపాదనలు
- పాఠ్యపుస్తకాల బాధ్యత హెచ్‌ఎంలదే
- అందలేదని ఫిర్యాదు వస్తే చర్య
- డీఈఓ వెంకటకృష్ణారెడ్డి
చోడవరం/మాడుగుల : పాఠశాలల్లో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పాఠ్యపుస్తకాలు అందలేదని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ హెచ్చరించారు. శనివారం చోడవరం, మాడుగుల మండలాలలో ఆయన పర్యటించారు. చోడవరం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మరుగుదొడ్లు, మంచినీరు, సైన్స్‌ల్యాబ్, పాఠశాల ఆవరణ పరిశీలించారు. మాడుగుల ఆర్‌సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో 131 పాఠశాలల్లో మంచి నీటి సమస్య ఉందని గుర్తించి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ప్ర తిపాదనలు పంపామన్నారు. ఈసారి జూన్ 7 నాటికే జిల్లాలో 24 లక్షల 67 వేల 263 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 28 వేల పుస్తకాల కొరత ఉందన్నారు.
పంపిణీ చేసిన పుస్తకాలు అందించే బాధ్యత హెచఎంలదేనన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకు ఎస్‌ఎంసీ నిధులు వినియోగించాలనిహెచ్‌ఎంలకు సూచించారు. టెన్త్‌లో గత విద్యా సంవత్సరంలో 90.80 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ విద్యా సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఎకడమిక్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు.
1718 ఉపాధ్యాయ ఖాళీలు
జిల్లాలో 1718 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఈఓ చెప్పారు. ఇందులో 219 బ్యాక్‌లాగ్ పోస్టులన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 163 పాఠశాలలు అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఏజెన్సీలో 26 కొత్త పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో ఆర్‌వీఎం పథకంలో 65 పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని, రెండో విడతలో 21 భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో 15 భవనాలు పూర్తికాగా మిగిలినవి అసంపూర్తిగా ఉన్నట్లు చెప్పారు. మూడో విడతలో 151 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
1674 పాఠశాలల్లో వంటషెడ్లు
జిల్లాలో 4174 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1674 పాఠశాలకు వంటషెడ్లు ఉన్నాయని డీఈఓ చెప్పారు. తొలివిడతలో మ రో 1605 పాఠశాలలకు షెడ్లు మంజూరు చేశామని, వీటిలో 675 పూర్తయ్యాయన్నారు. రెండో విడత 868 షెడ్లకు రూ.1.5 లక్షలు చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం అందేలా కృషి చేస్తానన్నారు.
విద్యార్థి స్థాయినబట్టి బోధన ఉండాలి
విద్యార్థుల గ్రాహక స్థాయిని బట్టి బోధన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యనందించాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డి సూచించారు. మాడుగుల ఆర్‌సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో హెచ్‌ఎంలతో కలిసి ఉపాధ్యాయులంతా టీమ్‌గా ఏర్పడి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోళెం సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.