science lab
-
సికింద్రాబాద్ కస్తూర్బాలో గ్యాస్ లీక్.. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్ కావడంతో కలకలం రేగింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రేపటి దాకా అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. చదవండి: వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు -
ప్రయోగం లేని సైన్సు
– పాఠశాలల్లో కరువైన ప్రయోగశాలలు, పరికరాలు – ఈ ఏడాది సీసీఈ పద్ధతిలో పదోతరగతి పరీక్షలు –ప్రయోగాలపై అవగాహనలేకుంటే విద్యార్థులకు నష్టమే జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లెలోని జెడ్పీ బాలుర ప్రభుత్వ పాఠశాలలో 517 మంది విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఆ పాఠశాలలో విద్యార్థులకు ప్రయోగాలను బోధించడానికి ప్రత్యేకంగా సైన్సుల్యాబ్ లేదు. హెచ్ఎం గదిలో గల బీరువాలో ప్రయోగపరికరాలను పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లా మొత్తం మీద ఇదే పరిస్థితులు ఉన్నాయి. చిత్తూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్య విద్యార్థులకు అందని ద్రాక్షలా మారుతోంది. కొన్ని చోట్ల గదుల కొరత ఉంటే మరికొన్ని చోట్ల ప్రయోగపరికరాల కొరత ఉండడంతో విద్యార్థులకు ప్రయోగపాఠాలు అందడంలేదు. ఉన్నత పాఠశాలల్లో సైన్సు ప్రయోగాల కోసం ప్రభుత్వం ఏటా నిధులను మంజూరు చేస్తోంది. అయితే అంతకు తగ్గట్టుగా ప్రయోగశాలకు సంబంధించి ప్రత్యేక గదులు ఉండడంలేదు. ప్రయోగశాలల నిర్వహణ దేవుడెరుగు సైన్సు పరికరాలను భద్రపరచడమే టీచర్లకు ఇబ్బంది కరంగా మారుతోంది. జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1126 పాఠశాలలుండంగా, అందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 612 పాఠశాలలున్నాయి. విద్యార్థుల్లో శాస్త్ర పరిజ్ణానం పెంపొందించాలంటే ప్రయోగాత్మక భోదన చాలా అవసరం. అయితే ప్రభుత్వం వీటిపై అంతగా దృష్టిసారించకపోవడంతో విద్యార్థులు చేసేదేమిలేక ౖసైన్సు చదువులను బట్టి పడుతూ నెట్టుకొస్తున్నారు. దీంతో వారికి సాంకేతిక పరిజ్ఞానం అందడంలేదు. సైన్సు ప్రయోగాలను చేయిద్దామని టీచర్లకు ఆసక్తి ఉన్నప్పటికి సంబంధిత రసాయనాలు, పరికరాలు లేకపోవడంతో మిన్నకుండిపోతున్నారు. ఇలాగైతే ఈ ఏడాది కష్టమే ఈ పరిస్థితుల్లో ఈ ఏడాదిలో పదోతరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ ఏడాది నుంచి వారు సీసీఈ(సంగ్రహణాత్మక మూల్యాంకన పద్ధతి)లో పరీక్షలు రాయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నూతన పద్దతి ప్రకారం విద్యార్థుల కు ఎక్కువగా ప్రయోగాత్మక ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన కల్పించకపోతే ఈ సారి సైన్సు సబ్జెక్టుల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. ల్యాబ్‌కు ప్రత్యేక రూం లేదు మా పాఠశాలలో ల్యాబ్‌కు ప్రత్యేకంగా గది లేదు. మా పాఠశాలలో ఈ ఏడాది 107 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హజరవుతున్నారు. ఈ ఏడాది నుంచి వారికి సీసీఈ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌లో ప్రయోగాలను చేసి చూపితేనే వారికి అవగాహన కలుగుతుంది. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. – లక్ష్మీనారాయణ, హెచ్ఎం, జెడ్పీ బాలురఉన్నత పాఠశాల, బైరెడ్డిపల్లె -
ఓటమి విజయానికి తొలి మెట్టు
కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు ఏవిషయంలోనైనా ఓటమి చెందామని మనస్తాపం చెందవద్దని, ఆ ఓటమే రేపటి విజయానికి తొలిమెట్టు అవుతుందని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరం మరియాపురంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం ఇన్స్పైర్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓ అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు రత్నాల సీమగా ఉన్న రాయలసీమ నేడు రాళ్ల సీమగా మారిందన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి ఎదిగి రాళ్ల సీమ పేరును రత్నాల సీమగా మార్చాలన్నారు. నేడు విద్యారంగం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఎగ్జిబిట్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలన్నారు. సంబంధిత కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సంబంధిత విషయంలో తమవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రస్థాయిలో ఇన్‌స్పైర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన స్ఫూర్తితోనే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల తయారీకి పిల్లల మేథాశక్తిని కొనియాడారు. పిల్లలు చదవుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి దేశం పేరు నిలబెట్టాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక నూతన ఒరవడితో ముందుకు సాగాలన్నారు.డిప్యూటీ డీఈఓ రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఇన్స్పైర్ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇన్‌స్పైర్‌లో ప్రతి ప్రధానోపాధ్యాయుడు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి దాని పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. వయోజన విద్య ఉపసంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న ప్రయోగాలతోనే విద్యార్థులకు ప్రేరణ వస్తుందన్నారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం మంది విద్యకు దూరంగా ఉన్నారన్నారు. ఎంఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల ఈ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడానికి ముందుకు రావాలన్నారు. వీటితోపాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి రెహ్మాన్, డీఈఓ కార్యాలయ ఏడీ సుబ్రమణ్యం, డీసీఈబీ సెక్రటరీ వెంకట రామిరెడ్డి, వైవీయూ అధ్యాపకులు వెంకట్రామ్, ఉస్మాన్, హెడ్మాస్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మరియాపురం స్కూలు సిస్టర్స్ శీల, లీలా రోజ్, పలు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు రమణారెడ్డి, రమేష్‌రెడ్డి, సుబ్బారెడ్డి, లలితాభాయి, మేషక్బాబు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి సమస్యపై దృష్టి
ఏజెన్సీలో 131 పాఠశాలల్లో సదుపాయానికి ప్రతిపాదనలు పాఠ్యపుస్తకాల బాధ్యత హెచ్‌ఎంలదే అందలేదని ఫిర్యాదు వస్తే చర్య డీఈఓ వెంకటకృష్ణారెడ్డి చోడవరం/మాడుగుల : పాఠశాలల్లో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పాఠ్యపుస్తకాలు అందలేదని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ హెచ్చరించారు. శనివారం చోడవరం, మాడుగుల మండలాలలో ఆయన పర్యటించారు. చోడవరం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మంచినీరు, సైన్స్‌ల్యాబ్, పాఠశాల ఆవరణ పరిశీలించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో 131 పాఠశాలల్లో మంచి నీటి సమస్య ఉందని గుర్తించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ప్ర తిపాదనలు పంపామన్నారు. ఈసారి జూన్ 7 నాటికే జిల్లాలో 24 లక్షల 67 వేల 263 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 28 వేల పుస్తకాల కొరత ఉందన్నారు. పంపిణీ చేసిన పుస్తకాలు అందించే బాధ్యత హెచఎంలదేనన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకు ఎస్ఎంసీ నిధులు వినియోగించాలనిహెచ్ఎంలకు సూచించారు. టెన్త్‌లో గత విద్యా సంవత్సరంలో 90.80 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ విద్యా సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఎకడమిక్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. 1718 ఉపాధ్యాయ ఖాళీలు జిల్లాలో 1718 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఈఓ చెప్పారు. ఇందులో 219 బ్యాక్లాగ్ పోస్టులన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 163 పాఠశాలలు అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఏజెన్సీలో 26 కొత్త పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో ఆర్వీఎం పథకంలో 65 పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని, రెండో విడతలో 21 భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో 15 భవనాలు పూర్తికాగా మిగిలినవి అసంపూర్తిగా ఉన్నట్లు చెప్పారు. మూడో విడతలో 151 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 1674 పాఠశాలల్లో వంటషెడ్లు జిల్లాలో 4174 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1674 పాఠశాలకు వంటషెడ్లు ఉన్నాయని డీఈఓ చెప్పారు. తొలివిడతలో మ రో 1605 పాఠశాలలకు షెడ్లు మంజూరు చేశామని, వీటిలో 675 పూర్తయ్యాయన్నారు. రెండో విడత 868 షెడ్లకు రూ.1.5 లక్షలు చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం అందేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థి స్థాయినబట్టి బోధన ఉండాలి విద్యార్థుల గ్రాహక స్థాయిని బట్టి బోధన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యనందించాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డి సూచించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎంలతో కలిసి ఉపాధ్యాయులంతా టీమ్‌గా ఏర్పడి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోళెం సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
హైస్కూల్లో అగ్ని ప్రమాదం
గోనెగండ్ల ,న్యూస్‌లైన్ : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సైన్స్‌ల్యాబ్, మధ్యాహ్న భోజన పథకం వంట సామగ్రి కాలి బూదిదయ్యాయి. సాయంత్రం 5.30 గంటల తర్వాత పాఠశాల సిబ్బంది గదులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిన అరగంటలోపే ప్రమాదం జరిగింది. మూడు బస్తాల బియ్యం, నూనెడబ్బాలు, ఇతర వస్తులు కాలిపోయాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ల్యాబ్ కు వ్యాపించడంతో అందులో పర్నీచర్, కెమికల్స్, ఇతర వస్తువులు బూడిదయ్యాయి. ఎస్ఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆయన సమాచారం మేరకు ఎమ్మిగనూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఘటనలో రూ. 1.50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీవారు చెప్పగా ల్యాబ్‌లో రూ. 2లక్షల నష్టం జరిగిందని హెచ్ఎం గ్రేసమ్మ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది.. స్కూల్లో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. గదిలో ఓవైపు ల్యాబ్ ఉండగా దానికి అడ్డుగా ఇనుప రేకులు పెట్టి ఏజెన్సీవారు వంట సామగ్రీ పెట్టుకునేందుకు వినియోగిస్తున్నారు. మధ్యాహ్నమే వంట ముగించిన ఏజెన్సీవారు మిగతా కట్టెలు, సామాన్లను అందులో పెట్టారు. ఒకవేల అందులో నిప్పు ఉండి ఉంటే పాఠశాల సమయంలో ప్రమాదం జరిగి ఉండేది. అలా కాకుండా తలుపులు మూసిన అరగంట తర్వాత ప్రమాదం జరగడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇనుప వాకిళ్ల కింద నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారేమో అని అనుమానిస్తున్నారు.