ఒంగోలు: మిత్రపక్షంగా ఉంటారో...వెళతారో అనేది మీరే తేల్చుకోండి...అంతే తప్ప మిత్రపక్షం అంటూ మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే మాత్రం సహించేది లేదంటూ టీడీపీ నాయకులను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులివెంకట కృష్ణారెడ్డి హెచ్చరించారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని మిత్రపక్షంగా భావించి తాము మౌనంగా ఉంటున్నా టీడీపీ నాయకుల వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉంటుందన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిందని, దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీఈవో నిర్ణయం వెలువరించారన్నారు.
దీనిపై హైకోర్టులో సవాల్ చేసి తిరిగి ఆమె త్రిపురాంతకం ఎంపీపీగా కొనసాగుతున్నారన్నారు. తాజాగా జరుగుతున్న జన్మభూమి–మా వూరు కార్యక్రమంలో ఆమెను ఖాతరు చేయకుండా ఆమె మాట్లాడుతుంటే మైక్ సైతం లాక్కోవడం, ఎంపీడీఓవో మాణిక్యాలరావు అయితే ఏకంగా టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం రూ.14 కోట్ల అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుందని తేల్చిందన్నారు. అంతే కాకుండా మరుగుదొడ్లలో కూడా రూ.2 కోట్ల అవినీతి చోటుచేసుకోవడంతో దానిపై చెన్నమ్మ ప్రశ్నించారన్నారు. అక్కడి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పినట్లుగా నడుస్తూ ఎంపీపీ పట్ల నిర్లక్ష్యంగా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అవినీతి కూపంలో కూరుకుపోయిన ఎంపీడీవో మాణిక్యాలరావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అక్కడ జరిగిన అవినీతి నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో నాలుగు రోజుల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధిష్టానంతోపాటు, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరవుతారని ఆశిస్తున్నామని, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ త్వరలోనే కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీపీ నీలం చెన్నమ్మ మాట్లాడుతూ అవినీతిపై గళం ఎత్తుతున్నందుకే తమను బీజేపీలో ఉన్నా హీనంగా చూస్తున్నారన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడ ఎమ్మెల్యే అయి పార్టీ మారిన డేవిడ్‌రాజు, దళిత ఎంపీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కోఆప్షన్ సభ్యుడు నీలం లాజర్ మాట్లాడుతూ బీజేపీ ఉనికినే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాము జిల్లా అధ్యక్షుడ్ని కలిసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బొద్దులూరి ఆంజనేయులు, ముదివర్తి బాబూరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment