janmabhoomi maa vooru programme
-
ముగిసిన జగడాల జన్మభూమి!
నిరసనలు..నిలదీతలు..బహిష్కరణల నడుమ ఆరో విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమం ముగిసింది. తిత్లీ తుపాను నష్ట పరిహారం అందలేదని బాధితులు..గత జన్మభూమిలో అందించిన వినతులు పరిష్కారం కాలేదని సామాన్యులు.. రేషన్‌కార్డులు, పింఛన్లు అర్హులకు అందలేదని దరఖాస్తుదారులు అధికారులు, ప్రజా ప్రతినిధులను సభల్లో నిలదీశారు. సమస్యలను పరిష్కరించలేని గ్రామసభలు ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికారులు ఇబ్బంది పడ్డారు. జన్మభూమి ప్రారంభం రోజు నుంచి ముగింపు వరకూ ఇదే పరిస్థితి. ఈ నెల రెండో రెండో తేదీన ప్రారంభమైన గ్రామ సభలు శుక్రవారంతో ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఈసారి జిల్లా వ్యాప్తంగా సుమారు 20,609 వినతులు అధికారులకు అందాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆరో విడత జన్మభూమి కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్ అయిందనే అభిప్రాయం జనం నుంచి వ్యక్తమవుతోంది. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన గ్రామ సభలతో ఎలాం టి ప్రయోజనం లేకపోవడంతో నామమాత్రంగా నే ముగిశాయి. గత ఐదు విడతుల్లో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో పలు విభాగాలకుసంబంధించి 2,96,856 వినతులు రాగా.. ఆరో విడతలో 45 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 20,609 వినతులు వచ్చాయి. తాజాగా ముగి సిన కార్యక్రమంతో కలిపి 3,17,465 వినతలు వచ్చాయి. గత వినతులే పరిష్కారానికి నోచుకోలేదు. ఈ పరి స్థితిలో తాజాగా వచ్చిన వినతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే. ఆరో విడత జరిగిన గ్రామ, వార్డు సభల్లో ప్రజలకంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులే ఎక్కు వ కనిపించారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు జన్మభూమిలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చదువులు గాలికి వదలి సభల్లో కూర్చున్నారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో ఒక్క పింఛను కూడా ఎవరికీ అందజేయలేదు. అలాగే ఒక్క రేషన్‌కార్డు కూ డా జారీ చేయలేదు. కొత్తగా ఇళ్లు కూడా మంజూ రు చేయలేదు. దీంతో లబ్ధిచేకూరని సభలెందుక ని చాలచోట్ల అధికారులను ప్రజలు నిలదీశారు. మరికొన్ని చోట్ల సభలను అడ్డుకొన్నారు. దీంతో పోలీసుల జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని చాలా సభలను ప్రజలు బహిష్కరించా రు. కొన్ని సభల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బందులు పడ్డా రు. జిల్లావ్యాప్తంగా 1098 గ్రామ పంచాయతీ లు, 161 నగర, పురపాలక సంఘాల పరిధిల్లోని వార్డుల్లో ఆరో విడత గ్రామ సభలు జరిగాయి. వీటిలో చాలా సభల్లో నిరసనలు, నిలదీతలు, బహిష్కరణలు చోటుచేసుకున్నాయి. వచ్చిన వినతులు.. ఈసారి జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో చివరిరోజు మినహా తొమ్మిది రోజులకు గాను 18,609 వినతులు వచ్చాయి. వీటిలో పేదరికానికి సంబంధించిన సమస్యలే ఎక్కువగా నమోదయ్యాయి. చివరి రోజున మరో రెండు వేలు వరకు వినతులు అందాయి. అయితే ఇవి ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. మొత్తం 20,609 వరకూ వినతులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో పేదరికానికి సంబంధించి–8060 వినతులుండగా, సివిల్ సప్లై విభాగం (రేషన్‌కార్డు)– 4781, గృహనిర్మాణం –2566, పురపాలక సంఘాల్లో సమస్యలపై –834, ఉద్యానవన శాఖ – 575, భూ సమస్యలు 386, పశు వర్ధక శాఖ 293, వ్యవసాయం 238, మత్స్యశాఖ 213, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ వింగ్ 109, గ్రామీణ నీటి సరఫరా 99, గిరిజన సంక్షేమ శాఖ 92, పంచాయతీరాజ్ 80, బీసీ కార్పొరేషన్ 79, విద్యుత్ శాఖ 35, గ్రామీణాభివృద్ధి 30, రైతు సాధికార సంస్థ 23, రోడ్లు భవనాల విభాగం 21, పాఠశాల విద్య 18, మహిళా భివృద్ధి శాఖ 9, ఆరోగ్య శ్రీ 9, చేనేత శాఖ 8, ఉపాధి కల్పన, శిక్షణకు సంబంధించి –8, ఇరిగేషన్ 7, ఎస్ఎస్ఏ 5, ఎస్సీ కార్పొరేషన్ 4, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు శాఖలకు మూడేసి, కమర్షియల్ టాక్సు, వికలాంగుల శాఖ, ఆర్టీవో, అగ్నిమాపక శాఖలకు సంబంధించి రెండేసి, ఫైనాన్స్, పోలీస్, ఎండోమెంట్, క్రీడలు, అటవీ, నైనిక సంక్షేమం, మైక్రో ప్రాజెక్టులు, కార్మిక శాఖ, భూ గర్భజలాలు, బీమా విభాగం, పరిశ్రమలు, వెనుకబడి తరగతుల శాఖలకు సంబంధించి ఒక్కో వినతి అధికారులకు అందాయి. -
హమ్మయ్య... ముగిసింది
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగిసింది. గడచిన ఐదు విడతల కంటే ఈ సారి కార్యక్రమం రసాభాసగానే సాగింది. జనవరి 2వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం శుక్రవారంతో ముగిసింది. తక్కువ గ్రామపంచాయతీలు, వార్డులు ఉన్న పురపాలకసంఘాల్లో ఒకటి, రెండురోజులు ముందే గ్రామసభలు ముగియగా మిగతా చోట్ల శుక్రవారంతోపూర్తయ్యాయి. మొత్తం 920 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాల్టీల్లో 149 వార్డుల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. బహిష్కరణతో నిరసన ఐదు విడతల్లో లేని విధంగా ఈ సారి జన్మభూమి గ్రామసభలను జనం బహిష్కరించారు. అధికారులు అన్ని సభలు జరిగాయని చెబుతున్నా కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో సభలను జనం బహిష్కరించారు. సభలు జరిపేందుకు అధికారుల బృందాలు గ్రామానికి రాకుండా ఆయా మండలాలతోపాటు మైదాన ప్రాంత మండలాల్లో కూడా అడ్డుకున్నారు. ఇలా 50వరకు సభల్లో జరగ్గా అధికారం అండ, పోలీసు బందోబస్తు మధ్య సభలు సాగించారు. అయినా జిల్లాలో సుమారు 10 గ్రామాల్లో సభలు అసలు జరగలేదు. నిరసనలు... నిలదీతలు నిరసన, నిలదీతలతో జిల్లాలో మరో 200కు పైగా సభలు అసంపూర్తిగా ముగించినట్లు సమాచారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోయింది. అయినా అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. గత జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులు పరిష్కరించలేదని, చేస్తామన్న పనులు కూడా చేయలేదని పలుచోట్ల ప్రజలు అధికారపార్టీ నాయకులు, అధికారులను నిలదీశారు. జిల్లాలో 10 రోజుల్లో మొత్తం సభలు చూస్తే జిల్లాలో ఉన్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుతోపాటు జెడ్పీ ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఆరుగురు ఎమ్మెల్యేలను, ఇతర అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ఏదో సందర్భంలో ఏదో ఒక గ్రామసభలో నిలదీయడం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వివక్ష చూపుతున్నారని, జన్మభూమి కమిటీల పేరుతో అధికారపార్టీ వారికే పెన్షన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు, రుణాలు మంజూరు చేస్తున్నారని కడిగేశారు. ప్రభుత్వ పథకాల మంజూరులో రాజకీయాలేమిటని ప్రశ్నించారు. ఇతర సమస్యలు ఏమి పరిష్కరించారని మండిపడ్డారు. ఇక అధికారులకు ఎక్కడికక్కడ నిరసనలు, నిలదీతలు తప్పలేదు. దాదాపు 70శాతం సభల్లో అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించడం, నిలదీయడం, నిరసన వ్యక్తం చేయడం విశేషం. జనం లేక వెలవెల ఇక గ్రామసభలకు జనం హాజరు కూడా తక్కువగానే ఉంది. జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందని అధికారులు చెబుతున్నా వాస్తవానికి పది, పదిహేనుశాతం మినహా మిగతా సభలకు చెప్పుకోదగ్గ జనం లేరు. అధికారపార్టీ కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు ఈ విషయాన్ని చెప్పుకోవడం విశేషం. తొలిరోజు నుంచి చివరి రోజు వరకు చూస్తే 10శాతం సభలకు జ నం కాస్తా వచ్చారు. 70శాతం సభలకు 30 నుంచి 80 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. మరో 10 శాతం గ్రామసభలు అధికారులు, అధికారపార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యాయనడంలో అతిశయోక్తి లేదు. నెరవేరని లక్ష్యం జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగున్నరేళ్లలో ఎంతో చేశామని ప్రచారం చేసుకుందామనుకున్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లు వృథా అయ్యాయి. జనం రాకపోవడం, వచ్చిన చోట వినే కంటే తిరిగి ప్రశ్నించడం, నిలదీయడంతో అధికారులు ఏమీ చెప్పలేకపోయారు. అధికారులు కూడా తమకెందుకు వచ్చిన గొడవ అంటూ నామమాత్రంగా కార్యక్రమం చేసి ముగించారు. నిలదీతలు, నిరసనలు, అడ్డుకోవడంతో వ్యతిరేకత మరింత పెరిగిందన్న వాదన వినిపిస్తోంది.సీతానగరం మండలం -
హమ్మయ్య...గండం గడిచింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులకు గండం గడిచింది. ఆరో విడత జన్మభూమి ఎట్టకేలకు ముగిసింది. ఆద్యంతం నిరసనల మధ్య సాగింది. మొత్తానికి నెట్టుకొచ్చామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మునుపెన్నడూలేని విధంగా జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిలదీశారు. పలుచోట్ల సభలను ఏకంగా బహిష్కరించారు. మరికొన్నిచోట్ల అధికారులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. గతంలో వచ్చిన అర్జీలకు సమాధానం చెప్పలేక అధికారులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నుంచి పరిష్కారం కాక, అర్జీదారులకు నచ్చచెప్పలేక నలిగిపోయారు. ఎంపీపీల దగ్గరి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు నిలదీతకు గురయ్యారు. చేతి చమురు వదిలించుకున్న అధికారులు జన్మభూమి కార్యక్రమానికి అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకొంది. అవి ఏమాత్రం సరిపోలేదు. అట్టహాసంగా నిర్వహించాలని, భారీగా జన సమీకరణ చేయాలని అధికారుల మెడపై కత్తి పెట్టింది. కానీ, ఆ స్థాయిలోనిధుల్లేక అధికారులు ప్రస్తుతానికి చేతి చమురు వదిలించుకున్నారు. మున్ముందు వాటి కోసం ఏ అడ్డదారులు తొక్కుతారో చూడాలి. ఒక్కో పంచాయతీకి రూ. 2 వేలు చొప్పున కేటాయించింది. అవి కూడా ఎంపీడీఓల ఖాతాల్లోనే ఉన్నాయి. క్షేత్రస్థాయికి చేరలేదు. వాస్తవానికైతే, ఒక్కో గ్రామసభ నిర్వహణకు రూ. 33వేలు ఖర్చయింది. మంత్రులు హాజరైతే దానికి రెట్టింపు ఖర్చయింది. దీనిబట్టి మిగతా సొమ్ము ఎవరు పెట్టుకున్నారన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికైతే ఆ భారమంతా క్షేత్రస్థాయి అధికారులపైనే పడింది. భవిష్యత్తులో వాటిని ఏ రకంగా సమకూర్చుకుంటారో చూడాలి. చివరి రోజూ తప్పని నిరసనలు ఆరో విడత జన్మభూమి కార్యక్రమం చివరి రోజునా నిరసనలు తప్పలేదు. ఎంత వేగంగా ముగిసిపోతుందా అని అధికారులు ఆత్రుత కనబరిచారు. ఎక్కడికక్కడ నిలదీత, ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మరుగుదొడ్ల అవినీతిపై నిలదీత కిర్లంపూడి మండలం జగపతినగరంలో అధికారులను సమస్యలపై స్థానిక ప్రజలు నిలదీశారు. గ్రామ పంచాయతీలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగింది. దీనిపై విచారణ చేపట్టి మధ్యలో ఆపేశారు. దీనిలో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉండడంవల్లే ఆపేశారా? అని స్థానికులు ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు, కిర్లంపూడి ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఎడ్ల కృష్ణ ఎన్జీవో పేరుతో ఎటువంటి మరుగుదొడ్లు నిర్మించకుండానే ఎలా నిధులు మంజూరు చేశారని జెడ్పీటీసీ వీరంరెడ్డి కాశిబాబును నిలదీయడంతో చాలాసేపు జన్మభూమి సభ నిలిచిపోయింది. కొంత సమయం తరువాత జెడ్పీటీసీ మాట్లాడుతూ విచారణ చేయిస్తామని హామీ ఇవ్వడంతో జన్మభూమి సభ సజావుగా సాగింది. కాకినాడ రూరల్‌లో చిన్నారులకు తిప్పలు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని స్పందన ఫంక్షన్ హాలులో జన్మభూమి సభను నిర్వహించారు. ఈ సభలో పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు మెమెంటోలను పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని, అధికారులను నిలదీశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పారు. దీంతో రావూరి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమమైతే ఈ మెమెంటోలు హడావుడి ఏమిటంటూ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు రావూరి వెంకటేశ్వరరావును బయటకు గెంటుకుంటూ తీసుకుపోయారు. ఈ కార్యక్రమమంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్తిబాబుల మాస్క్‌లను స్కూల్ పిల్లలకు అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప చేయడం విమర్శలకు దారితీసింది. మంత్రి లోకేష్‌కు చేదు అనుభవం మంత్రి నారా లోకేష్‌ను ‘మంచినీటి సమస్యను పరిష్కరించరా?’ అంటూ జన్మభూమి గ్రామసభలో మహిళలు నిలదీశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభకు హాజరైన మంత్రిలోకేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను తెలియజేస్తుండగా, సభకు హాజరైన మహిళలు, స్థానికులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో ఏళ్లతరబడి తాగునీరు అందడంలేదని, గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి రోడ్లు ఛిద్రమై ఉన్నా పట్టించుకునేవారే లేరంటూ మంత్రి లోకేష్‌ను నిలదీశారు. అయినా మంత్రి లోకేష్ సర్దిచెప్పి మాట్లాడదామని చూసినప్పటికీ మహిళలు, స్థానిక యువకులు సమస్యలను ఏకరవుపెట్టడంతో మధ్యలో ప్రసంగాన్ని ఆపి కూర్చుండిపోయారు. దీంతో అధికారులు సమస్యలు పరిష్కరిస్తామంటూ సర్దిచెప్పినప్పటికీ మహిళలు వినకుండా సభ నుంచి వెనుతిరిగారు. -
అంతటా ఆగ్రహమే!?
సాక్షి, గుంటూరు: ఆరో విడత జన్మభూమి–మా ఊరు చివరి రోజు కార్యక్రమాలు జిల్లాలో రసాభాసగా సాగాయి. స్థానిక సమస్యలపై అధికార పార్టీ నేతలు, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఆఖరి రోజు కావడంతో అధికారులు, అధికార పార్టీ నేతలు సన్మానాలు, రాజకీయ ప్రసంగాలు, ప్రభుత్వ గొప్పలు చెప్పుకోడానికే సభల్లో సమయం కేటాయించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు గ్రామంలో జన్మభూమి సభలను నాయకులు మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలు పెట్టారు. ప్రతిజ్ఙ కూడా చేయకముందే టీడీపీ నాయకులు సన్మానాలు ప్రారంభించారు. దీంతో సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలు నాయకులు, అధికారుల తీరుపై మండిపడ్డారు. తాడికొండ నియోజకవర్గం తాడికొండ గ్రామంలో టీడీపీ నాయకులు జన్మభూమి సభలో బహిరంగంగా గొడవకు దిగారు. అధికారులు తమ మాట వినడం లేదంటూ జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు వర్గానికి చెందిన ఎడ్డూరి హనుమంతరావు, సభ వేదిక కింద అనుచరులతో బల ప్రదర్శనకు అధికారులను దూషించారు. ఇంతలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి మధుసుదనరావు కలుగజేసుకోవడంతో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు వాగుద్ధానికి దిగి తమను ఇబ్బంది పెట్టడంతో అధికారులు వారి ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికార పార్టీ నాయకులే బహిరంగంగా జన్మభూమి సభల్లో వాగ్వాదానికి దిగడంతో ప్రజలు వారి తీరుపట్ల మండిపడ్డారు. ఈ పరిణామంతో అధికార పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు.. గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోబోమని, ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని నకరికల్లులో నిర్వహించిన జన్మభూమి సభలో రైతులు స్పష్టం చేశారు. గతంలో అద్దంకి–నార్కట్‌పల్లి హైవే విస్తరణలో నిర్వాసితులైన వారికి నేటికీ ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, మళ్లీ ఇప్పుడు భూములు ఇవ్వలేమని అన్నారు. ఆ సమస్యలపై అధికారులను నిలదీస్తూ ప్లకార్డులతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా సత్తెనపల్లి పట్టణంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ 27, 30వ వార్డుల కౌన్సిలర్లు షేక్ నాగూర్‌మీరాన్, ఆకుల స్వరూపాలు బహిష్కరించారు. నిలదీతలు.. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుకుని అమ్ముకున్నారు, గ్రామంలో అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఓబులనాయుడుపాలెంలో అధికారులను ప్రజలు నిలదీశారు. అదే విధంగా పెదపలకలూరు గ్రామంలో నిర్వహించిన సభలో సైతం స్థానిక సమస్యలపై అధికారులను ప్రజలు ప్రశ్నించారు. దీంతో ఆయా గ్రామాల్లో సభలు రసాభాసగా సాగా యి. గుంటూరు తూర్పు, పశ్చిమ, మాచర్ల, నరసరావుపేట సహా జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో అధికారులు, అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. ఐదు జన్మభూముల్లో ఇచ్చిన సమస్యలు బుట్టదాఖలయ్యాయని, ఈ సారైన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అని ప్రశ్నించారు. చివరి రోజు కావడంతో పలు ప్రాంతాల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రసంగాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. -
జన్మభూమిలో..సమస్యల జాతర
ఒంగోలు సిటీ:మళ్లీ మళ్లీ అవే సమస్యలు.. మొక్కుబడిగా పరిశీలిస్తున్న అర్జీలు.. ఆర్థికేతర సమస్యలైలే సరి.. లేదంటే అధికారులు ఆ అర్జీలను ముట్టుకోవడం లేదు. ఇదీ జిల్లాలో జరిగిన ఆరోవిడత జన్మభూమి–మాఊరు అర్జీల పరిష్కారం తీరు. మండల కార్యాలయాల్లో, మీకోసంలో, ఇప్పుడు జన్మభూమి గ్రామసభల్లో అవే సమస్యలపై అర్జీలు వచ్చాయి. ఏళ్ల తరబడి ఒకే సమస్యపై తిరిగిన జనం ప్రభుత్వవిసిగి పోయారు. జన్మభూమి మాఊరు కార్యక్రమంలోనైనా సమస్య తీరుతుందని బావించి భంగపాటుకు గురయ్యారు. జనం దగ్గర అర్జీలను తీసుకోవడం.. వాటిని పక్కన పడేయడం.. ఇది జరిగిన తంతు. ఈనెల 2వ తేదీ నుంచి శుక్రవారం వరకు జిల్లాలో పది రోజుల పాటు జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమంలో ప్రజలకు వనగూరిన ప్రయోజనం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1028 పంచాయతీలు, 225 వార్డుల్లో ఆరో విడత జన్మభూమి మాఊరు కార్యక్రమం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం గ్రామసభలు పేలవంగా జరిగాయి. ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి అందుతుందని బావించిన బాధితులకు నిరాశ మిగిలింది. అర్జీలను తీసుకొని చూస్తాం.. చేస్తామని అర్జీదారుల్ని పంపించేశారు. అత్యధిక భాగం వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ సభలకు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు. జన్మభూమి–మాఊరు కార్యక్రమం తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల్లో ఐఏఎస్ అధికారి ఎం.రామారావు ఎస్‌ఎన్‌పాడు మండలంలోని చండ్రపాలెం గ్రామంలో పాల్గొన్నారు. చుట్టూ ముసిరిన జనం సమస్యలు.. జన్మభూమి గ్రామసభల్లో జనం సమస్యలు చుట్టూ ముసిరాయి. అన్నీ వ్యక్తిగత సమస్యలే. అత్యధికంగా తమకు ఫించన్లు కావాలని అర్జీలు వచ్చాయి. ఇంటి నివేశన స్థలాలు కావాలని అంతే మోతాదులో అర్జీలు వచ్చాయి. ఎన్టీఆర్ గృహనిర్మాణం కింద పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించామని ప్రభుత్వం చెబుతున్నా ఇల్లు కావాలని పెద్ద సంఖ్యలోనే అర్జీలను సమర్పించారు. తర్వాత స్థానంలో తెల్ల రేషన్‌కార్డులు కావాలని కోరారు. ఇక తర్వాత స్థానాల్లో భూమి వివాదాలు, తమ భూములకు కొలతలు వేయడం లేదని, రెవెన్యూ సమస్యలు,అధికారులు సరిగ్గా పనిచేయడం లేదని, తహసీల్దార్లు అందుబాటులో ఉండం లేదని, వైద్య సేవలు మెరుగ్గా లేవని రకరకాల సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి.వచ్చిన వాటిలో ఆర్థికపరమైన అంశాలే అధికంగా ఉన్నందున ఇప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుపడదని అధికారులు అర్జీదారులకు తేల్చిచెప్పారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలిస్తే సరే ఇక పదండి అంటూ తిరుగు జవాబు కూడా చెప్పే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 23 శాతమే పరిష్కారం.. జిల్లాలో జన్మభూమి మాఊరు కార్యక్రమం చివరి రోజు శుక్రవారం సుమారు 1000 అర్జీలు వచ్చాయి. మిగిలిన రోజుల్లో జరిగిన గ్రామసభలకు 32,233 మంది అర్జీలను ఇచ్చారు. వీటిలో 98 శాతంగా వ్యక్తిగత సమస్యలపైనే జనం అర్జీలిచ్చారు. చేతికి తీసుకున్న అర్జీల్లో పింఛను కావాలని కోరితే నిర్థాక్షిణ్యంగా తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లు మంజూరు లేదు. మీరు పింఛన్‌కు అర్హులు కాదంటూ పక్కన పెట్టేశారు. వచ్చిన అర్జీల్లో 4049 అర్జీలను తిరస్కరించారు. ఇంకా 726 అర్జీలను పరిశీలించకుండానే.. అందులో అర్జీదారుడు ఏం కోరుతున్నాడో చూడకుండా పక్కన పెట్టేశారు. పరిశీలన పూర్తయినా 19661 అర్జీలకు ఎలాంటి మంజూరు ఉత్తర్వులు ఇవ్వలేదు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలే పై అధికారుల నుంచి ఆదేశాలు రాక వాటిని పక్కనపెట్టారు. 1,540 అర్జీలను పరిష్కరించినట్లుగా నమోదు చేశారు. ఈ అర్జీలకు సంబంధించిన ఎలాంటి మంజూరు ఉత్తర్వులు గానీ, ఎండార్సుమెంట్లు కాని అర్జీదారునికి ఇవ్వలేదు. మొత్తంగా జన్మభూమి మాఊరు గ్రామసభల్లో వచ్చిన అర్జీల్లో 22 శాతంగా పరిష్కరించినట్లుగా చెబుతున్నారు. అర్జీదారుల్లో ఒక్కరికైనా మంజూరు ఉత్తర్వులు గానీ, ఇతర ప్రొసిడింగ్స్ ఉత్తర్వుల ప్రతులను కాని ఇవ్వలేదు. గిద్దలూరు మున్సిపాలిటీ 14 శాతం, మార్కాపురం 22 శాతం, చీమకుర్తి 23 శాతం, ఒంగోలు అర్బన్ 6 శాతం, అద్దంకి 17 శాతం, చీరాల అర్బన్ 13 శాతం, కనిగిరి 16 శాతం ఈ రకంగా పరిష్కరించినట్లుగా నమోదు చేశారు. అర్జీదారులకు మాత్రం తమ అర్జీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం లేకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలా ముగిసిన గ్రామసభలు అధికార పార్టీ ఎన్నికల ప్రచార సభల్లా గ్రామసభలు ముగిశాయన్న విమర్శలు నెలకున్నాయి. రాష్ట్ర స్థాయిలో నియమించిన అధికారులు గ్రామసభలకు జనం వస్తున్న తీరు, వారి నుంచి స్పందనలు, పార్టీ నాయకుల్లో సఖ్యత, గ్రామసభలో వస్తున్న ఫిర్యాదులు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. గ్రామసభలకు వచ్చిన అధికారులు పాలకుల బలాబలాలను బేరీజు వేసి వివరాలను పైవారికి చెప్పాల్సి ఉంది. ఆ కోణం నుంచే గ్రామసభల నిర్వహణ పరిశీలన జరిగిట్లుగా సమాచారం. అధికారిక నివేదిక ప్రకారం గ్రామసభలకు 1,03,622 మంది హాజరయ్యారు. విద్యార్థులు 3,97,985 మంది, ఫ్యాకల్టీ 34,266 మంది, ఉపాధ్యాయులు 48,990 మంది, గ్రామస్తులు 18 లక్షల మంది హాజరైట్లుగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని పలు చోట్ల గ్రామసభలు పేలవంగా జరిగాయి. ఒంగోలులోనూ అలాగే జరిగాయి. ఎండ్లూరులో తెలుగుదేశం శ్రేణుల్లోనే సమస్యలు వచ్చాయి. పార్టీ పెద్దలు పంచాయితీ చేయాల్సి వచ్చింది. తర్లుపాడు మండలం మంగలిపాలెంలో భూమి సమస్యను అధికారులు పరిష్కరించనందుకు ఆ గ్రామ సభను జనం బహిష్కరించారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా స్థానికంగా నాయకులు సర్థుబాటు చేశారు.రానున్నది ఎన్నికల కాలం ఇçప్పుడు విభేదాలు వద్దని నచ్చచెప్పారు. గ్రామసభలు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. కొన్ని చోట్ల జనం లేకుండా అధికారులు, యంత్రాంగంతోనే సభలు ముగిశాయి. అడుగడుగునా నిర్బంధాలు.. నిలదీతలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జన్మభూమి–మావూరు కార్యక్రమంలో అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులకు ్రçపజల నుండి నిలదీతలు, నిర్బంధాలు తప్పలేదు. పలుచోట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, అధికారులను జనం తీవ్ర స్థాయిలో నిలదీశారు. కొన్ని చోట్ల నిర్బంధించారు. మరి కొన్ని చోట్ల సభలను బహిష్కరించారు. మొత్తంగా జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. తొలిరోజు యర్రగొండపాలెం ఆమని గుడిపాలెంలో జరిగిన జన్మభూమి–మావూరులో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో రెండుగంటల పాటు నిర్బంధించారు. గ్రామంలో చేపట్టిన 500 ఇంకుడు గుంటలు, 200 మరుగుదొడ్లకు ప్రభుత్వం బిల్లులు ఇచ్చేంత వరకు జన్మభూమిని జరగనివ్వమంటూ గొడవకు దిగారు. అధికారులను పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. త్రిపురాంతంకం మండలం అన్న సముద్రంలో జరిగిన జన్మభూమిలో తాను పక్కా గృహం ఇస్తామని చెప్పడంతో ఉన్న గుడిసెను పీకేసుకుని 8 నెలలుగా రోడ్డున పడ్డానని, అయినా పక్కాగృహం మంజూరు కాలేదని వెంకటమ్మ అనే మహిళ ఎమ్మెల్యే డేవిడ్ రాజును నిలదీసింది. గ్రామానికి స్మశాన స్థలం కేటాయిస్తామని ఏళ్ళ తరబడి చెబుతున్నా ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎమ్మెల్యేను, అధికారులను నిలదీశాడు. జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, పర్చూరు, చీరాల, కందుకూరు, కనిగిరి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. చివరకు తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని జనం ధ్వజమెత్తారు. రెవెన్యూ సమస్యలపైనా జనం అధికారులను నిలదీశారు. సమస్యలు పరిష్కరించలేని జన్మభూములు ఎందుకంటూ పలు చోట్ల సభలను బహిష్కరించారు. ఈ జన్మభూమిలో సమస్యలు పరిష్కరిస్తారని ఇబ్బడి ముబ్బడిగా రేషన్ కార్డులు, పించన్లు ఇస్తారని అందరూ ఆశించినా ప్రభుత్వం మాత్రం జన వినతులను పరిష్కరించక ఈ జన్మభూమిని కూడా ప్రచారానికే వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 6వ విడత జన్మభూమిలో వచ్చిన అన్ని వినతులను పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి సభల్లో చెప్పినా క్షేత్ర స్థాయిలో అది జరగలేదు. గత 5 విడతల జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన వినతులు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇక కొత్త వినతులకు ఎప్పటికీ మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి. ఏమి చేయకుండానే ఎంతో చేశామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకునేందుకే జన్మభూమిని ఉపయోగించుకున్నట్లు కనపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పదిరోజులూ ప్రజాగ్రహమే
అనంతపురం అర్బన్: ప్రచార ఆర్భాటం కోసం ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలో చేపట్టిన ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. తొలిరోజు నుంచి చివరి రోజు వరకు సమస్యల పరిష్కారానికి ప్రజలు అధికారులను నిలదీశారు. సమస్యల పరిష్కారానికంటే ప్రజాప్రతినిధుల ఊకదంపుడు ఉపన్యాసాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో జనం సభలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అధికారులు పింఛను తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో సభలు నడిపించారు. చాలాచోట్ల సభలు అధికారపార్టీ కార్యక్రమాలను తలపించాయి. సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎందుకీ కార్యక్రమాలు... సభలు అంటూ కొన్ని చోట్ల రైతులు, ప్రజలు ‘జన్మభూమి’ సభలను బహిష్కరించారు. ఇక సమస్యలపై నిలదీసిన ప్రజలపై అ«ధికారపార్టీ నాయకులు తమ ప్రతాపం చూపారు. బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంటలో జరిగిన సభలో సమస్యలపై నిలదీసిన వారిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఏకంగా తిట్ల దండకం అందుకున్నారు. తనను ప్రశ్నించిన వారిని మెడ పట్టి గెటించారు. ఇక శింగనమల ఎమ్మెల్యే యామినీబాలను, కదిరి ఎమ్మెల్యే అత్తార్చాంద్బాషాను పలు సభల్లో జనం సమస్యలపై నిలదీశారు. శుక్రవారం ఉరవకొండలో జరిగిన సభ రసాభాసగా సాగింది. నిరుపేదలకు ఇంటి పట్టాలివ్వాని వైఎస్సార్ సీపీ నేతలు జన్మభూమి సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా..పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సమస్యలపై 23,921 అర్జీలు జిల్లావ్యాప్తంగా 10 రోజులపాటు జరిగిన జ న్మభూమి సభల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 23,921 అర్జీలు అందాయి. అర్జీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తి చేస్తే ఈ సంఖ్య మరికొద్దిగా పెరిగే అవకాశం ఉం ది. ఇక వీటితో సంబంధం లేకుండా అనంతపురం అర్బన్‌లో 934, రూరల్‌లో 3,476 అర్జీ లు అందాయి. అందిన అర్జీల్లో అప్పటికప్పు డు 1,105 పరిష్కరించామనీ, 14,693 అర్జీలను పరిశీలన పూర్తి చేశామనీ, 6,239 అర్జీ లు పరిశీలన చేయాల్సి ఉందని ఆన్లైన్లో నమోదు చేశారు. అందిన అర్జీల్లో 1,884 అర్జీలను తిరస్కరించారు. నియోజకవర్గాల వారీ గా చూసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో అత్యధికంగా 4,867 అర్జీలు రాగా పుట్టపర్తిలో అత్యల్పంగా 903 అర్జీలు అందాయి. -
అడ్డుకుంటే అంతు చూస్తాం
కర్నూలు సీక్యాంప్: రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన కర్నూలు మండలం పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులపై పోలీస్, రెవెన్యూ అధికారులు శివాలెత్తారు. జన్మభూమి సభలను అడ్డుకుంటే అంతు చూస్తామని, కేసుల నమోదుతో పాటు ప్రభుత్వ పథకాలను సైతం తొలగిస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా గ్రామాల్లోకి ప్రవేశించి సభలు నిర్వహించారు. అయితే..అటువైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులు దశాబ్ద కాలంగా రోడ్డు సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమున్న రోడ్డు ప్రయాణాలకు ఏమాత్రమూఅనువుగా లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక 20 మందికి పైగా చనిపోయారు. రోడ్డు బాగు చేయాలంటూ కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో గత జన్మభూమిలో భారీఎత్తున నిరసనలు తెలియజేశారు. రోడ్డు నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే..ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోవిడత జన్మభూమిని కూడా బహిష్కరించడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈ రెండు గ్రామాల్లో శుక్రవారం సభలు ఏర్పాటు చేయగా..అధికారులెవరూ రాకుండా ముందుగా పడిదెంపాడు ఊరిబయటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు. తాలూకా సీఐ వెంకటరమణ వచ్చి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. సమస్య చెప్పిన వారితో పాటు వాహనాల వీడియోలు, ఫొటోలు తీసుకుని.. కేసులు పెడతామంటూ బెదిరించారు. దీంతో గ్రామస్తులు వెనక్కి తగ్గగా..అధికారులు ఊళ్లోకి వెళ్లి సభ నిర్వహించారు. గ్రామస్తులెవరూ సభకు రాలేదు. ఆ తర్వాత పూడూరులో సభ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఊరిబయటే ప్రతిఘటన ఎదురైంది. గ్రామస్తులు టైర్లు అంటించి, ఆటోలు, ఇతర వాహనాలు అడ్డంపెట్టి ఆందోళన చేపట్టారు. ఇక్కడ తాలూకా ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి రెచ్చిపోయారు. గ్రామస్తులను తోసివేశారు. అడ్డుకునేవారిని వాహనాలతో తొక్కిస్తానంటూ బెదిరించారు. అక్కడే ఉన్న జర్నలిస్టులపైనా చిందులు వేశారు. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలు, సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండగా వాటిని లాక్కున్నారు. అధికారులు బలవంతంగా గ్రామంలోకి వెళ్లి జన్మభూమి సభ నిర్వహించగా.. ఇక్కడ కూడా గ్రామస్తుల నుంచి చుక్కెదురైంది. -
నిరసనలదే పైచేయి
కర్నూలు(అగ్రికల్చర్)/సాక్షి నెట్వర్క్: జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో నిరసనలదే పైచేయి అవుతోంది. పలు గ్రామాల్లో ప్రజల ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురు వారం జరిగిన గ్రామ సభల్లో పలు చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. 9వ రోజు జిల్లా వ్యాప్తంగా 112 సభలు జరిగాయి. పలుచోట్ల జనాలు లేక సభలు వెలవెలబోయాయి. కాగా జన్మభూమి కార్యక్రమం శుక్రవారం ముగియనుంది. చివరి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ♦ ఓర్వకల్లో గురువారం జరిగిన సభలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వ్యవహరించిన తీరుపై ముస్లీం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్లా అనే వ్యక్తి మాట్లాడుతూ ఓర్వకల్లో షాదీఖానా నిర్మాణానికి రెవెన్యూ, విద్యుత్ అధికారులు సహకరించడం లేదని, రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ♦ కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నీటి సమస్యపై ప్రజలు అధికారులపై ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరులో అర్హులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ ఆదోని మండలం ఇస్వి గ్రామంలో ఇప్పటి వరకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేయకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. సభకు హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణా రెడ్డి డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్‌ను సస్పెండ్ చేయాలని జేసీతో మాట్లాడారు. ఒక్క రోజులో కార్డుదారులందరికీ కానుకలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ♦ పాములపాడు మండలం మిట్టకందాలలో ప్రజలు అధికారులను నిలదీశారు. తాగునీటికి అల్లాడుతున్నాం... టీడీపీ నాయకులు అసైన్ల్యాండ్లో ఎర్రమట్టి కోసం అడ్డుగోలుగా తవ్వుకొని తరలిస్తున్నా చర్యలు లేవరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించనందుకు కింద కూర్చొని నిరసన తెలిపారు. ♦ బేతంచెర్ల మండలం సీతారాంపురం గ్రామంలో సమస్యలపై ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని, పింఛన్లు, పక్కా ఇళ్లు అనర్హులకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ♦ వెల్దుర్తి మండలం బోగోలులో వివిధ ప్రాంతా లకు చెందిన వారికి పక్కా ఇళ్లు మంజూరు కావడంపై అధికారులను నిలదీశారు. తమ రేషన్ కార్డులతో కర్నూలులో ఉన్న వారికి ఇళ్లు మంజూరు కావడమేంటని ప్రశ్నించారు. ♦ కర్నూలు నగరపాలకసంస్థలోని 44వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీపీఎం నేతలు వివిధ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్‌సింగ్ నగర్ నుంచి వెళ్లే ప్రధాన రోడ్డులో మమతానగర్, ప్రేమ్నగర్ల మధ్యనున్న అసంపూర్తి రోడ్డుపై సీపీఎం నాయకులు రాముడు, అంజిబాబు, ఉస్మాన్‌బాషా తదితరులు ధ్వజమెత్తారు. -
నిరసన మంటలు.. ఖాళీ కుర్చీలు
జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నిరసనలు మిన్నంటుతున్నాయి.. గత సభల్లో ఇచ్చిన అర్జీల పరిష్కారానికే ఇప్పటి వరకూ దిక్కులేదు.. మళ్లీ ఎందుకు వచ్చారంటూ గ్రామగ్రామానా అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. సీఎం నివసిస్తున్న ఉండవల్లిలో గురువారం జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి ప్రజలను అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా జన్మభూమి గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు, నిలదీతల ఎదురవుతున్నాయి. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయని జనాలు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తునారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి, గ్రామ సభల్లో గురువారం ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరులో స్థానిక సమస్యలు పరిష్కరించండం లేదంటూ జన్మభూమి సభలో ఓ యువకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీశాడు. గ్రామంలోని ప్రా«థమిక వైద్యశాలలో సిబ్బంది లేక జనం ఇబ్బందులు పడుతున్నారని సిబ్బందిలేని పీహెచ్సీ ఎందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యేను యువకుడు నిలదీయడంతో పక్కనే ఉన్న పోలీసులు కలుగజేసుకుని నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడివి సభలో గందరగోళం సృష్టించడానికి వచ్చావని పక్కకు లాక్కెళ్లారు. దీంతో ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుడని ముద్ర వేస్తారా అంటూ యువకుడు పోలీసులు అధికారులపై మండిపడ్డాడు. నిలదీతలు.. ఎదురీతలు మాచర్ల మండలం తాళ్లపల్లిలో నిర్వహించిన జన్మభూమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక సమస్యలపై అ«ధికారులను నిలదీశారు. నాలుగున్నరేళ్ల పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. మాచర్ల పట్టణం 25,26,27 వార్డుల్లోని జన్మభూమి సభల్లో జనం లేక వెలవెలబోయాయి. నరసరావుపేట ప్రకాష్‌నగర్ నిర్వహించిన జన్మభూమి సభలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ ఎం రమణారెడ్డి అధికారులను నిలదీశారు. దరఖాస్తులు బుట్టదాఖలవుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో జన్మభూమి సభలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ గని ప్రజా సమస్యలపై పాలకులు, అధికారులను నిలదీశారు. నకరికల్లు మండలం చేజర్లలో అధికారులపై రైలు మండిపడ్డారు. పంటలకు నీరివ్వడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఫిర్యాదు చేశారు. వాడవాడలా ఆగ్రహం సత్తెనపల్లి 26వ వార్డు, పాకాలపాడులో జన్మభూమి సభలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకాలపాడు చెరువు అక్రమాలపై విచారణ జరిపించాలని రైతులు స్పీకర్ కోడెలకు వినతి పత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన జన్మభూమి సభలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు ప్రజా సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టి తమ వార్డుల్లో చాలా సమస్యలు నెలకొన్నాయన్నారు. అనంతవరంలో.. అనంతవరం(తుళ్లూరురూరల్): సమస్యలను పరిష్కరించలేని సభలు నిర్వహించడం ఎందుకు అని అనంతవరం ప్రజలు అధికారులను నిలదీశారు. గురువారం తుళ్లూరు మండలం అనంతవరం, వడ్డమాను గ్రామాలలో జన్మభూమి సభ నిర్వహించారు. వడ్డమాను రహదారిలోని కాలువ అస్తవ్యస్తంగా ఉందన్నారు. శ్మశాన వాటికకు నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామంలో క్వారీల నిర్వహణతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. -
ఉయ్యూరు జన్మభూమి సభలో ఉద్రిక్తత
కృష్ణాజిల్లా, ఉయ్యూరు(పెనమలూరు): ఉయ్యూరులో జన్మభూమి సభ రసాభాస అయ్యింది. ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు రగడ సృష్టించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అసభ్యపదజాలంతో నోరుపారేయడంతో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావుతోపాటు పార్టీ శ్రేణులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. జవాబు చెప్పలేక.. గొడవ సృష్టించి.. పట్టణంలోని 15, 16,17 వార్డులకు సంబంధించి కాటూరు రోడ్డులోని ఓ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం జన్మభూమి సభ నిర్వహించారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తాను కేవలం ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి వెళ్లిపోతానని, ఎలాంటి వివాదం ఉండదని అధికారులతోపాటు సీఐ కాశీవిశ్వనాథంతో పేర్కొన్నారు. అధికారులు, చైర్మన్లు పార్థసారథిని వేదికపైకి ఆహ్వానించి మాట్లాడాలని కోరారు. ఆయన జనం మధ్య నుంచే టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, డ్వాక్రా రుణ మాఫీ, పంట నష్టం, అంశాలపై ప్రశ్నలు సంధించారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సహనం కోల్పోయి రామచంద్రరావుతోపాటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో అసభ్యపదజాలంతో దూషించారు. రాయడానికి వీలులేని పదజాలంతో ధూషించారు. మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మంచి పద్ధతి కాదంటూ సూచిస్తున్నా పట్టించుకోకుండా దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కుర్చీలు పైకిలేచాయి. పోలీసులు ఇరువర్గాలను నెట్టి పార్థసారథితోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులను సభా ప్రాంగణం నుంచి బయటకు పంపారు. ఎమ్మెల్యే రాకతో రగడ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వేదికపైకి రావడంతోనే మైక్ తీసుకుని పార్థసారథిని ఉద్దేశిస్తూ ఎద్దేవాగా మాట్లాడారు. అయినా సంయమనం పాటించి పార్థసారథి జీ+3 నిర్మాణాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను, అవినీతిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వాదన మొదలైంది. ఈస్ట్ ఏసీపీ విజయభాస్కర్‌తోపాటు పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను వేదికకు దూరంగా నెట్టివేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. పార్థసారథి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు వేదికపైకి ఎక్కి నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. టీడీపీ శ్రేణులను కూడా వేదిక దింపి దూరంగా పంపాలని రామచంద్రరావు సూచించడంతో ఎమ్మెల్యే ఎద్దేవాగా వ్యాఖ్యానించడంతో వాదులాట చోటుచేసుకుంది. -
జన్మభూమిలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం
పశ్చిమగోదావరి, ఆకివీడు: ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని మహిళలు, బాధితులు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజును చుట్టుముట్టారు. జన్మభూమి సభ ముగిసిన తర్వాత వెళ్లిపోతున్న ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించేందుకు జనం చుట్టుముట్టి, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, డ్వాక్రా రుణమాఫీ, ఉపాధి హామీ కూలి డబ్బులు అందలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరిస్తానని, ఇళ్ల çస్థలాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పి పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే చల్లగా జారుకున్నారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు కేటాయింపులో అవకతవకలు జరిగాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలు, స్థానిక యువకులు నిలబడి ఇళ్ల పట్టాలు అనర్హులకు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేయడంతో సభ రసాభాసగా మారింది. ఎంపీడీఓ ఎంఎస్ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఇళ్ల స్థలాల మంజూరు, పట్టాల పంపిణీపై తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతుండగా గ్రామ మహిళ ముత్యాన లక్ష్మి, బేతాళ్ల మార్తమ్మ, సంతకాని శారమ్మ తదితరులు పట్టాలు అనర్హులకు ఇస్తున్నారని, ఏళ్ల తరబడి దరఖాస్తులు చేసుకున్నా తమకు అన్యాయం చేశారని వాపోయారు. అద్దెలు కట్టుకుని జీవించలేకపోతున్నామని, ఎన్నాళ్లు అద్దె ఇళ్లలో నివసించాలని నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తమ గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమిని పంపిణీ చేయడానికి పదేళ్లు పట్టిందన్నారు. అయితే పదేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు భూమి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెవెన్యూ అధికారులు అండార్స్మెంట్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా అనర్హులకు పట్టాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఉపాధి కూలీల గోడు ఉపాధి హామీ పనులు చేసినా కూలి డబ్బులు ఇవ్వడంలేదని, ఏడాదిగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ చెరువు తవ్వించుకుని కూలి సొమ్ము చెల్లించలేదని మరికొంత మంది మహిళలు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం సభకు హాజరైన ఎమ్మెల్యే వీవీ శివరామరాజు మాట్లాడుతూ ప్రస్తుతం స్థలం ఉన్న ప్రాంతంలో అర్హులకు పట్టాలిస్తామని, మిగిలిన వారికి భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. సభలో ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, జెడ్పీ వైస్ చైర్మన్ మన్నే లలితాదేవి, ఎంపీపీ పి.వాణి, వడ్డి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రచ్చ రచ్చ
జన్మభూమి సభలంటేనే జనం మండిపడిపోతున్నారు. ఎక్కడి కక్కడే అడ్డుకుని పాలకపక్ష నాయకులు, అధికారులనునిలదీస్తున్నారు. సమస్యలుపరిష్కరించని సభలెందుకంటూ నిరసిస్తున్నారు.మరికొన్ని చోట్ల ఏకంగా సభలు నిర్వహించవద్దంటూబహిష్కరించడం...అధికారులు ఊళ్లోకి రాకుండాముళ్లకంపలు అడ్డంగావేయడం వంటి నిరసనలుచోటు చేసుకున్నాయి. విజయనగరం గంటస్తంభం: జన్మభూమి కార్యక్రమం చివరి దశకు చేరుకునే సరికి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోం ది. జిల్లాలో గురువారం నిర్వహించిన సభల్లో ఎక్కువగా నిలదీతలు.. నిరసనలు కనిపించాయి. గ్రామసభలకువెళ్లే నేతలను, అధికారులను అడ్డుకోవడం, జన్మభూమి మాకొద్దంటూ బహిష్కరించడంతో నిరసన తెలిపారు. సభ జరిగిన చోట గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేదని నిలదీతలు చోటు చేసుకున్నాయి. జెడ్పీ ఛైర్మన్, చీపురుపల్టి, గజపతినగరం ఎమ్మెల్యేలకు ఈ పరాభవం తప్పలేదు. గంట్యాడ మండలం కిర్తుబర్తిలో అర్హులకు పింఛన్లు అందలేదని, సంక్షేమ పథకాలు కొంత మందికే అందజేస్తున్నారని ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును గ్రామస్తులు నిలదీశారు. దత్తిరాజే రు మండలం టి.బూర్జవలసలో నాలుగేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా అర్హులైన వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయలేదని, పంటలు పోయి రైతులు కొట్టు మిట్టాడుతున్నా కరువు మండలంగా ప్రకటించలేదని , గోకులాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి అప్పలనాయుడు మండల ప్రత్యేక అధికారి పాండు రంగారావు దృష్టికి తెచ్చారు. ♦ గుర్ల మండలం చింతపల్లిపేటలో జన్మభూమిలో అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులను గ్రామ మాజీ సర్పంచ్ జమ్ము అప్పలనాయుడు నిలదీశారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో ఆంధ్రా పెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అక్కడి ఉద్యోగి కె.కె.ఎం.నాయుడు నిలదీశారు. ♦ బొబ్బిలి మున్సిపాలిటీ మల్లంపేటలో రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తూనిక, తేమ కొలిచే విధానంలో రైతులను మోసం చేస్తున్నారని ప్రత్యేక అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మహిళలు ఆరోపించారు. ♦ పార్వతీపురం మునిసిపాలిటీ 14వ వార్డులో ప్రతిపక్ష కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహించడంతో ఒక్క ప్రజా ప్రతినిధికూడా హాజరుకాలేదు. వార్డు ప్రజలు సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే పాలకులు ఎవరూ ఈ వార్డుకు హాజరుకానట్లు తెలిసింది. ♦ కురుపాం నియోజకవర్గంలో వనకాబడి గ్రామంలో జరిగిన జన్మభూమిని గ్రామస్తులు బహిష్కరించారు. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించలేని జన్మభూమి ఎందుకని కార్యక్రమాన్ని బహిష్కరించారు. అలాగే గోడివాడ పంచాయతీలో కూడా సమస్యలు పరిష్కరించలేని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకంటూ గ్రామస్తులు కార్యక్రమానికి హాజరైన అధికారులను అడ్డుకున్నారు. మరో దారి లేక అధికారులంతా వెనుదిరిగారు. సాలూరు మండలం నెల్లిపర్తి గ్రామంలో సమస్యలపై అధికారులను నిలదీయడంతో పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ♦ వేపాడ మండలం పి.కె.ఆర్.పురం గ్రామంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు మాకు గ్రామసభలొద్దంటూ గ్రామస్తులు అధికారులను గ్రామంలోకి రాకుండా ట్రాక్టరు, ఆటో, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించని సభలు వద్దని మొండికేశారు. శంగవరపుకోట మండలం దారపర్తిలో రోడ్డు పేరుతో గిరిజనులను ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ దారపర్తి గిరిశిఖర పంచాయతీ గ్రామాల గిరిజనులు, యువకులు జన్మభూమి సభలో అధికారులను నిలదీశారు. -
జన్మభూమి గ్రామసభల్లో రచ్చరచ్చ
శ్రీకాకుళం, భామిని: తమ కష్టాలు, నష్టాలపై నిలదీస్తున్న ప్రజలకు అధికారులు సమాధానం ఇవ్వకుండా, టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా టీడీపీ సమావేశమా? అధికారులు సమాధానం చెప్పాలని నిలదీశారు. వీరికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. తహసీల్దారు జేబీ జయలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని బాలేరులో గురువారం నిర్వహించిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో తిత్లీ తుఫాన్ పంట నష్టాలపై గ్రామస్తులు నిలదీశారు. తుఫాన్ ధాటికి ఎగిరిపోయిన ఇళ్లు, పశువుల పాకల నష్టాలను గుర్తించి పలుమార్లు జియోట్యాగింగ్ చేసిన అధికారులు పరిహారాలు ఇవ్వడంలో వైఫల్యం చెందారని వైఎస్సార్సీపీ నాయకులు మేడిబోయిన చలపతిరావు, కొత్తకోట చంద్రశేఖర్, రొక్కం రామారావు, దామోదర జగదీష్ మండిపడ్డారు. ఈ క్రమంలో పక్కా గృహాల బిల్లులు కోసం ప్రశ్నించిన లబ్ధిదారులకు టీడీపీ నాయకుడు జయకృష్ణను కలవాలని ప్రత్యేకాహ్వానితులు ఎం జగదీశ్వరరావు అని సూచించడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన సమాధానం ఇవ్వడమేమిటని, అధికారులే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వివాదం రేగింది. వీరికి మద్దతు పలికిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో తోపులాట సాగింది. రెండు వర్గాల కోట్లాటకు చేరుకునే దశలో ఏఎస్సై అప్పలనాయుడు జోక్యం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, ప్రజలను బయటకు పంపించారు. ఇంతలో బత్తిలి ఎస్సై ముదిలి ముకుందరావు, కొత్తూరు సీఐ మజ్జి నాగేశ్వరరావు పోలీసు బృందాలతో వేర్వేరుగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో ప్రజా సమస్యలపై అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీనక భారతి, వెలుగు ఏపీఎం వై రమణ, వాటర్‌షెడ్ ఏపీవో బీ శంకరరావు, ఆర్ఐ కొల్ల వెంకటరావు పాల్గొన్నారు. మూగజీవాలపై కనికరం లేదా? వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని నగరంపల్లి గ్రామంలో గురువారం జన్మభూమి– మాఊరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. గ్రామస్తుల నిలదీతలతో రెండు గంటలపాటు నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని పోలీసుల పహరా మధ్య నిర్వహించారు. ‘తిత్లీ తుఫాన్‌కు పశువుల శాలలు నేలమట్టం కావడంతో మూగజీవాలకు తాత్కాలిక రక్షణగా ప్రభుత్వం ఇచ్చిన టార్పాలిన్లు అనర్హుల చేతిలో చేరాయి, దీంతో ప్రస్తుతం అవి చలికి వణుకుతున్నాయి, ఏమాత్రం వీటిపై మీకు కనికరం లేదా’ అంటూ అధికారులను బాధితులు నిలదీశారు. ఈ టార్పాలిన్లు ఎవరికీ ఇచ్చారో లెక్క చెప్పాలని వారితోపాటు పీఏసీఎస్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు దువ్వాడ మధుకేశ్వరావు, మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాంచౌదరి పట్టుబట్టడంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. ఇదేక్రమంలో మానసిక దివ్యాంగురాలికి పదేళ్లుగా పింఛను ఇవ్వడంలేదని, ఈ పాప ఏ పాపం చేసిందని చిన్నారి తల్లి ఎల్ హేమలతతోపాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఎస్సై నర్సింహులు అక్కడకు హుటాహుటిన చేరుకుని పరిస్థితి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శాంతించని బాధితులు సభ నిర్వహణకు అడ్డుతగిలారు. పోలీసుల పహరా ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరికి టార్పాలిన్లు లబ్ధిదారుల జాబితాను పలాస నుంచి వీఆర్వో తీసుకొచ్చి బహిర్గతం చేయడంతో సభ ముగిసింది. అదేవిధంగా పెదబాడంలోనూ తుఫాన్ బాధితులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జీ వసంతరావు, వజ్రపుకొత్తూరు పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ దువ్వాడ వెంకటకుమార్ చౌదరి, డిప్యూటీ తహసీల్దారు అప్పలస్వామి, వివిధ శాఖాధికారులు మెట్ట పాపారావు, గోపి, గౌతమి పాల్గొన్నారు. జన్మభూమిని బహిష్కరించిన బెంతొరియాలు కంచిలి: మండలంలోని కొన్నాయిపుట్టుగ పంచాయతీ కేంద్రంలో గురువారం జన్మభూమి– మాఊరు గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. ప్రజాసాధికార సర్వేలో బెంతొరియా సామాజిక వర్గాన్ని విస్మరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు తహసీల్దారు డీ రామ్మోహనరావుకు వినతి పత్రం అందజేశారు.– మోసాలకు పాల్పడుతున్న మిల్లర్లు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు మోసాలకు పాల్పడుతున్నారని జన్మభూమిలో కుత్తుం గ్రామానికి చెందిన రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తేమ ఎక్కువగా ఉందనే కారణంతో బస్తా వద్ద 3 నుంచి 4 కిలోల వరకు కొలతలో తక్కువగా లెక్కిస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి, ఎంపీడీవో చల్లా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సభలెందుకు దండగ
తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి సభలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత గ్రామ సభల్లో ఇచ్చిన అర్జీల గురించి పట్టించుకోకుండా మళ్లీ ఎందుకు వచ్చారంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే అర్జీలు కూడా బుట్టదాఖలు కావాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు గ్రీవెన్స్‌లో ఇచ్చిన అర్జీలకే దిక్కు లేనప్పుడు ఈ సభలెందుకు దండగని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా తాము మాటలు పడాల్సి వస్తోందని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: ఏళ్ల తరబడి జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు, ఫిర్యాదులకు మోక్షం లభించలేదు..మళ్లీ జన్మభూమి సభలెందుకంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. పలు ప్రాంతాల్లో మంగళవారం జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ పునేఠా పాల్గొన్నారు. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదని వృద్ధులు సీఎస్‌కు చెప్పుకునే ప్రయత్నం చేయగా అధికారులను వారిని అడ్డుకున్నారు. సీఎస్ కేవలం అర్ధగంట సేపు మాత్రమే సభలో ఉన్నారని, కనీసం తమ బాధలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ప్రజలు వాపోయారు. అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు... అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని, పచ్చ కండువా కప్పుకుంటేనే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులను నిలదీశారు. సత్తెనపల్లి పట్టణం 20వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ కూకుట్ల లక్ష్మి అధికారులపై మండిపడ్డారు. పొన్నూరు 22, 23వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగమవుతున్నాయని మండిపడ్డారు. ఎన్ని పంటల పొలాలు లాక్కుంటారు... ప్రభుత్వం అభివృద్ధి, పథకాల పేరుతో పంట పొలాలను లాక్కుంటోందని మేడికొండూరు మండల పరిధిలో నిర్వహించిన సభలో నీరు చెట్టు పథకం పేరుతో అధికార పార్టీ నేతలు తమ పంట పొలాలు లాక్కున్నారని మహిళా రైతులు అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. రోడ్డు విస్తరణల పేరుతో ఇంకా ఎన్ని పొలాలు లాక్కుంటారని అధికారులను రైతులు నిలదీశారు. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయరా ? దుగ్గిరాల, తాడేపల్లి మండలాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం ప్రజలు ఆందోళన చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అధికార పార్టీ నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29, 40, 28 డివిజన్లలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే మంత్రా.. అధికారులు, మంత్రి తమషాలాడుతున్నారా? గుంటూరు నగరపాలక సంస్థ రెగ్యులర్ ఎస్సీ నియమించకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాధికారక సర్వే ఓ పెద్ద బోగస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట, తెనాలి సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు సమస్యల పరిష్కారంపై నిలదీశారు. పూలు ప్రాంతాల్లో పాఠశాలలు జరిగే రోజుల్లోనే జన్మభూమి సభలు పాఠశాలల్లో ఏర్పాటు చే యడంతో పాటు జనాలు లేని ప్రాంతాల్లో విద్యార్థులను కూర్చోబెట్టి సభలు నిర్వహించారు. -
సమస్య పరిష్కరించకుండా మీరెందుకు..?
ప్రకాశం, తర్లుపాడు: ‘మా సమస్యను పరిష్కరించాకే గ్రామానికి రండి. సమస్యను పరిష్కరించకుండా గ్రామసభ నిర్వహించి ఏం ఉపయోగం’ అని మండలంలోని మంగళకుంట గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. జన్మభూమి గ్రామసభలో భాగంగా అధికారులు మంగళవారం మంగళకుంటకు వచ్చారు. అయితే గ్రామసభ నిర్వహించకుండా గ్రామస్తులు అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయకుండా అధికారుల ఎదుట నిరసన తెలియజేసి గ్రామసభను బహిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మంగళకుంట రెవెన్యూ ఇలాకాలో 208 సర్వే నంబర్లో 15 ఏళ్ల క్రితం మంగళకుంట, కొత్తూరు గ్రామాలకు 350 ఎకరాల పొలాన్ని ప్రతి ఇంటికి 5 ఎకరాలు చొప్పున పట్టాలు మంజూరు చేశారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి అదే నంబర్లో సబ్ డివిజన్లు చేసి మండల, మండలేతరులకు, ధనికులకు ఆన్లైన్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు మంగళవారం గ్రామసభను అడ్డుకున్నారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించకుండా సహాయ నిరాకరణ చేశారు. గ్రామానికి వచ్చిన అధికారులకు కుర్చీలు ఇవ్వకుండా నిరసన తెలియజేశారు. అధికారులు బయట నుంచి కుర్చీలు తెప్పించుకున్నా వాటిని కూడా తీసేసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మా ఊరికి రండని తేల్చి చెప్పారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాన్ని కనిపెట్టుకుని ఉన్న గ్రామస్తులను కాదని రెవెన్యూ అధికారుల ఇష్టప్రకారం పొలాలు పంపిణీ చేసే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. అక్రమంగా భూములను ఆన్లైన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకుని పేదలకు పంపిణీ చేసిన తర్వాత గ్రామానికి రావాలని తెలిపారు. అధికారులు ఎంత ప్రాధేయపడినా గ్రామస్తులు జన్మభూమి సభకు హాజరుకాలేదు. దీంతో అధికారులు చేసేది లేక గ్రామం నుంచి తిరుగుముఖం పట్టారు. వృద్ధులతో గ్రామసభ నిర్వహణ: సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధుడు కందుకూరు రూరల్: జన్మభూమి గ్రామ సభలకు ప్రజల స్పందన కరువైంది. సభలకు ప్రజలెవ్వరూ హాజరుకాకపోవడంతో వృద్ధులు, పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి సభను ముగిస్తున్నారు. మండలంలోని బలిజపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. బలిజపాలెంలో జరిగిన గ్రామసభకు ఎమ్మెల్యే పోతుల రామారావు హాజరయ్యారు. గ్రామసభలో ప్రజలను చూపించేందుకు నాయకులు, అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, వితంతువులకు గ్రామసభ వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పడంతో వారంతా గ్రామసభకు వచ్చారు. పింఛన్ తీసుకున్న వారంతా గ్రామ సభలోనే ఉండాలని అధికారులు చెప్పడంతో వారంతా గంటల తరబడి వేచి ఉన్నారు. దీంతో గ్రామసభ జరుగుతున్న సమయంలోనే జి.నరసింహం అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్లి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. గ్రామసభలో బలవంతంగా వృద్ధులను కూర్చోబెట్టడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. -
జన్మభూమి సభలో దళిత నేతకు అవమానం
సాక్షి, విశాఖపట్నం: దళితులపై టీడీపీ ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రజాసమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి - మా ఊరు సభల్లో దళితులకు అడగడుగునా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దళిత నాయకుడికి జన్మభూమి సభలో తీవ్ర అవమానం ఎదురయింది. గోలుగుండ మండలం జోగంపేట జన్మభూమి సభలో స్థానిక ఎంపీటీసీ నూకరత్నంకు చేదు అనుభవం చోటుచేసుకుంది. కక్ష సాధింపుల్లో భాగంగా స్థానిక దళితులను పిలవకుండానే సభను నిర్వహించడం పట్ల నూకరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమైనందునే తమను జన్మభూమి సభకు ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుల వివక్ష ఎందుకని అధికారులను ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించకుండా సభను నిర్వహించిన అధికారులపైన, మండల నాయకులపైన స్థానిక మంత్రికి, కలెక్టర్‌కు పిర్యాదు చేస్తానని నూకరత్నం తెలిపారు. -
దోచుకుంటే తప్పేంటన్న ఎమ్మెల్యే ఉన్నం
అనంతపురం అర్బన్: సమస్యల పరిష్కారానికంటే ప్రభుత్వం సొంత బాకా ఊదుకునేందుకే జన్మభూమి–మా ఊరు కార్యక్రమం పరిమితమైంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీశారు. వెల్లువలా ఎదురైన నిరసనలతో అధికారులకు భంగపాటు తప్పలేదు. ఐదో రోజు జిల్లాలో ఆదివారంనిర్వహించిన జన్మభూమి సభల్లో పలు చోట్ల సమస్యలపై అర్జీలు స్వీకరించడం, ఉపన్యాసాలతో తూతూ మంత్రంగా సభలను ముగించారు. ప్రభుత్వ పథకాల అవినీతిపై కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మలింగ, బీజప్ప, తిప్పేస్వామి తదితరులు నిలదీశారు. వేదిక మీద ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అసహనానికి గురవుతూ ‘మా ప్రభుత్వంలో మేము దోచుకుంటే తప్పేంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మడకశిర మండలం ఆర్.అనంతపురం, మెళవాయిలో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పాల్గొని ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలు ఇలా... ♦ కళ్యాణదుర్గం నియోజకవర్గం రాంపూరం సమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కంబదూరులో జరిగిన సభలో అధికారులను మాజీ సర్పంచ్ తిరుపాలు, వైఎస్సార్సీపీ నాయకులు వెంకటేశులు, మారెన్న తదితరులు నిలదీశారు. టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు. ♦ పింఛన్లు, మరుగుదొడ్ల బిల్లులు, పక్కా ఇళ్ల మంజూరులో అవినీతి జరిగిందని బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలో సభలో వైఎస్సార్సీపీ నాయకులు లోకేష్, మంజునాథ్, లింగన్న తదితరులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది. మా గ్రామంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఏం మేలు చేశారో చెప్పాలని తిమ్మసముద్రంలో జరిగిన జన్మభూమిలో అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. ♦ శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ శమంతకమణిని ఎంఆర్పీఎస్ నాయకులు నిలదీశారు. గ్రామంలో నీటి సమస్య ఉందని, వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దానిని ఇంతవరకూ అమలు చేయలేదని ఆగ్రహించారు. గ్రామంలోకి వచ్చిన ప్రతిసారీ బీసీ కాలనీలోకే వెళతారు. ఎస్సీ కాలనీ ప్రజలు కనిపించరా? , నాలుగున్నరేళ్లలో ఒక్కసారైన ఎస్సీ కాలనీకి వచ్చారా? సమస్యలు విన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండుతున్నాయహే.. కాలువలకు నీళ్లొదలండి వానలు లేక పంటలు ఎండుతున్నాయహే.. కాలువలకు నీళ్లొదలండి’ అంటూ అధికారులను రైతు క్రిష్ణయ్య నిలదీశారు. రాప్తాడు మండలం హంపాపురంలో ఆదివారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు తొలుత ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రభుత్వానికి బాకా ఊదుతుంటే అసహనానికి గురైన రైతు క్రిష్ణయ్య ఒక్కసారిగా పైకి లేచి అలా విరుచుకుపడ్డాడు. ఇంత కాలం మీరు చెప్పిన సోదంతా విన్నాం. కనీసం ఇప్పుడైనా మేము చెప్పేది వినండి. బోరు బావి కింద నాలుగు ఎకరాల్లో తాను సాగు చేసిన చీనీ తోట, ఎకరా విస్తీర్ణంలో వరి ఎండిపోతోందని వివరించారు. ధర్మవరం కుడి కాలువకు నీరు వదిలితే భూగర్భ జలాలు పెరిగి పంట సాగుకు అనుకూలమవుతుందని వివరించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని క్రిష్ణయ్యను కూర్చోబెట్టారు. – రాప్తాడు రేషన్‌కార్డు ఒకరిది.. లబ్ధి మరొకరికి ఇతని పేరు దామోదర్, గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం. తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నాడు. సొంతింటి కోసం లెక్కకు మించి చాలా సార్లు అర్జీలు ఇచ్చాడు. అయినా మంజూరు కాలేదు. ఇటీవల మరోసారి అర్జీ ఇస్తే హౌసింగ్ అధికారులు పరిశీలించి.. అతని రేషన్‌కార్డుపై ఇల్లు మంజూరైందని తెలపడంతో అవాక్కయ్యాడు. తాను ఇంత వరకూ ఇల్లు కట్టలేదని, అయితే బిల్లులు ఎవరు తీసుకున్నారంటూ వాకాబు చేస్తే పెనకచెర్లకు చెందిన వ్యక్తి పేరు ఆన్లైన్లో ఉన్నట్లు తేలింది. తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆదివారం జన్మభూమి గ్రామసభలో మరోసారి అధికారులకు అర్జీ ఇచ్చాడు. – గార్లదిన్నె -
నిరసనల సంగ్రామాలు
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి–మా ఊరు కార్యక్రమం అధికారుల పాలిట శాపంగా మారింది. వారికి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. జనం ఆగ్రహజ్వాలలధాటికి అధికారులు తాళలేకపోతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అవస్థలకు గురవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వరుసగా నాల్గో రోజు కూడా నిరసనలు ఎదురయ్యాయి. నక్కపల్లి మండలం ఉద్దండపురం, వేంపాడు గ్రామసభలు రసాభాసగా జరిగాయి.అధికార పార్టీ నేతల చిల్లర రాజకీయాలు అంగన్వాడీ కేంద్రాలపై వారు పాల్పడుతున్న కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు నిలదీశారు. గ్రామ సభలను అడ్డుకుని నిరసన వ్యక్తంచేశారు. ఉద్దండపురంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి ప్రారంభించారన్న కారణంగా అక్కడ టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై నూతన భవనంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు బచ్చలరాజు, పొడగట్ల వెంకటేష్, దోని గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదినుంచి చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. నూతన భవనం విషయంలో అధికారులు,రాజకీయ నాయకులు తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఏడాది నుంచి ఇరువర్గాల ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నామని గ్రామసభలో అంగన్వాడీ కార్యకర్త భర్త పొడగట్ల అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు. ఇళ్ల మంజూరుకు అర్హులే లేరా..? కె.కోటపాడు మండలం సూర్రెడ్డిపాలెం గ్రామసభలో అధికారులను నిరసన సెగ తగిలింది. నాలుగున్నరేళ్లుగా గ్రామంలో ఒక్కరికి కూడా గృహనిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేయకపోవడం ఏంటని జన్మభూమిలో పాల్గొన్న అధికారులను మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఈర్లె గంగునాయుడు(నాని) ప్రశ్నించారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్న కారణంగా పథకాల ఎంపికలో గ్రామంపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. అక్రమ చేపల చెరువులపై నిలదీత దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామసభలో నిరసనలు హోరెత్తాయి.అక్రమ చేపలు నిర్వహించడంతో పాటు చికెన్, పశుమాంస వ్యర్థాలను మేతగా వేస్తున్నారని, వీటి వల్ల కలుషితమైన నీటిని తాగిన పశువులు ఇప్పటికే మృత్యువాత పడ్డాయని, రోగాలతో బాధపడుతున్నాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు. చుట్టుపక్కల ప్రజలు సైతం అంతు చిక్కని వ్యాధులు బారిన పడుతున్నారని, పలుమార్లు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు అధికారులకు ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. వెంటనే ఈ సమస్యపై జన్మభూమి సదస్సులో తీర్మానం చేయాలని లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని, సదస్సును సైతం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. అయితే శాఖల వారీగా సభ జరుగుతున్నందున సంబంధిత శాఖ వచ్చినప్పుడు సమస్య చెప్పుకోవాలని అధికారులు చెప్పినా వినకుండా ఆందోళన చేయడంతో అసహనానికి గురైన మండల ప్రత్యేక అధికారి జి. మహలక్ష్మీ బాధిత రైతులు అందించిన వినతి పత్రాన్ని వారిపైకే విసిరేయడంతో వివాదం రేగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అరుపులు కేకలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. వికలాంగ పింఛన్ పునరుద్ధరించండి చీడికాడ (మాడుగుల): వికలాంగుడిగా గుర్తిం చి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వం పింఛన్ ఇవ్వగా, చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే తొలగించారని చీడికాడకు చెందిన గాలి శ్రీరామమూర్తి అనేదివ్యాంగుడు చెప్పాడు. నాలుగున్నరేళ్లుగా పింఛన్ పునరుద్ధరించాలని పలుమార్లు దరఖాస్తు చేశానని, పలువురు అధికారులను కోరారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలలోకి వెళితే... శ్రీరామమూర్తి 15 సంత్సరాల క్రితం ప్రమాదవాశాత్తు చింత చెట్టుపై నుంచి పడిపోవడంతో వెన్నెముకపై,కుడికాలికి తీవ్రగామైంది. కేజీహెచ్ వైద్యులు వికలాంగ ధ్రువీకరణ పత్రం అందించారు.దీంతో 200 పింఛన్ మంజూరైంది.తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండవసారి సీఎం అయిన తరువాత రూ.500 పింఛన్ అందింది. చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత పింఛన్ రూ.1000కి పెంచిన సమయంలో పాత వికలాంగ ధ్రువీకరణ ప త్రాలు పనిచేయవని, సదరంలో తీసుకోవాలని చెప్పి, తన ఫించన్‌ను నిలుపుదల చేశారని శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని సార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ధ్రువీకరణపత్రం ఇవ్వలేదని, కలెక్టర్‌కు, నాలుగు విడతల జన్మభూమి సభల్లో అర్జీలిచ్చి వేడుకున్నా ప్రయోజనం లేకపోయిందని చెప్పాడు. సోమవారం చీడికాడలో జరిగే జన్మభూమిలో మరో మారు దరఖాస్తు ఇస్తానని, ఇప్పటికైనా అధికారులు కరుణించాలని కోరాడు. -
పాఠాలు వదలి ప్రచారాలా?
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రభుత్వ ఉపాధ్యాయులను వినియోగించడం విమర్శలకు తావిస్తోంది. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ‘సామాజిక స్పృహ’ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంవత్సరం కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చి ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా జన్మభూమి–మా ఊరు నిర్వహిస్తోంది. చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిర్వహించిన తొలి జన్మభూమి కార్యక్రమంలోనే సమస్యల పరిష్కారానికి ప్రజలు నిలదీశారు. పలుచోట్ల జన్మభూమి సభలను సైతం బహిష్కరించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి ప్రశ్నించే వారిపై కఠినంగా వ్యవహరించింది. ఆ తర్వాత నుంచి జన్మభూమి సభల్లో పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యాన్ని అనధికారికంగా తప్పనిసరి చేసిందనే విమర్శలు తల్లిదండ్రులనుంచి వినిపిస్తోంది. గతానికి భిన్నంగా జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్థ్ధిష్టమైన నిబంధనలు విధించింది. ఆయా సమీప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో కమిటీలు వేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రచారం, మూఢ నమ్మకాలపై గ్రామీణులకు అవగాహన పేరుతో విద్యార్థులతో నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించే బాధ్యతలను అప్పగించింది. వీరితో పాటు సమీప ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులను వలంటీర్ల పేరుతో నియమించింది. ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను సైతం జనవరి 8 నుంచి 12వ తేదీకి వాయిదా వేసింది. విద్యా సంవత్సరం కీలక దశలో ఉంది. గురువారం నుంచి జిల్లా అంతటా ఫార్మేటివ్–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులకు ఈ అదనపు బాధ్యతలు, విధుల వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జన్మభూమిలో ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేయడం వల్ల వారి విలువైన బోధనా సమయం కోల్పోతారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను మినహాయించాలి. దీన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.– డీవీ రాఘవులు,జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడమే జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి ఉపాధ్యాయులు వ్యతిరేకం కాదు. జన్మభూమిలో విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించే ఏడో తేదీ ఒక రోజు పాల్గొనడానికి అభ్యంతరం లేదు. ప్రతి రోజు ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడమంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే.– కవి శేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్టీయూ -
మా ఊరు.. నిరసనల హోరు
కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఆరో విడత జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మూడోరోజు అధికారులు నిర్వహించారు. గ్రామసభలకు వృద్ధులు, విద్యార్థులే దిక్కయ్యారు. వృద్ధులకు పింఛన్లు ఇస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో వారు సభలకు వస్తున్నారు. పాఠశాలల ఆవరణలోనూ, సమీప గ్రామాల్లో సభలు ఉండడంతో వెలవెలపోకుండా విద్యార్థులను తీసుకొచ్చి కూర్చొబెడుతున్నారు. రైల్వేకోడూరు మండలంలోని చియ్యవరం పంచాయతీ ముత్తరాచుపల్లెలో పాఠశాల ప్రహారీకి కొందరు అడ్డుతగులుతున్నారని ఆరోపిస్తూ ఎంపీటీసీ రవి, పాఠశాల చైర్మన్ నేలపై బైఠాయించారు. దీంతో అధికారులు సర్దిచెప్పి ప్రహారీని తప్పకుండా నిర్మిస్తామని చెప్పారు. రాజంపేటలో కేవలం పింఛన్లు, చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె గ్రామసభలో ప్రజలు రాక వెలవెలబోవడంతో అధికారులు ఆగమేఘాలపై బాలశివ జూనియర్ కళాశాల విద్యార్థులను పిలుచుకుని వచ్చి సభలో బలవంతంగా కూర్చొబెట్టారు. ప్రొద్దుటూరులోని 10, 11 వార్డుల్లోని శ్రీరాములుపేటలో సభ నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి సమయపాలన పాటించే తీరు తెలియదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సభలో మాజీ కౌన్సిలర్ గరికెపాటి లక్ష్మిదేవి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ఇదే వార్డులో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని, అప్పుడు ఎమ్మెల్యేగా వరదరాజులరెడ్డి ఉన్నారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పేరుతో పేదలను దోచుకోవడానికి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేయగా, టీడీపీ నాయకులు అనవసర రాద్దాంతం చేశా>రు. జమ్మలమడుగులో రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు ఇచ్చారు. కడపలో నిర్వహించిన సభల్లో విద్యార్థులు, వృద్ధులే కనిపించారు. పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన సభల్లో శ్వేతపత్రాలను అధికారులు చదివారు. పింఛన్లు, చంద్రన్న కానుకలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. బద్వేలులో నిర్వహించిన సభలో జేసీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొండలు, గుట్టలమీద ఇచ్చారని, అవి ఎందుకూ పనికి రావని ప్రజలు అధికారులను నిలదీశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొని గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని ఆరోపించారు. కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పెన్షన్లు, కానుకల పంపిణీతో సరిపెట్టారు. -
ఆశ చచ్చి.. ఆత్మహత్యాయత్నం
కర్నూలు, ఆస్పరి: ప్రభుత్వం నుంచి పక్కాగృహం, కుమార్తెకు పింఛన్ మంజూరు కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆస్పరి మండలం హలిగేర గ్రామానికి చెందిన రైతు గొల్ల నరాల జలపతి అధికారుల ముందే పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హలిగేరలో నిర్వహించిన గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. గొల్ల నరాల జలపతి, సుజాతమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె శ్రుతి మూగ, చెవిటి కావడంతో పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేశాడు. అలాగే హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలంటూ నాలుగేళ్లుగా అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. జన్మభూమి సభలో మరోమారు అర్జీలు ఇవ్వడానికి కుమార్తె శ్రుతిని వెంటబెట్టుకుని వచ్చాడు. అయితే.. అధికారులు దరఖాస్తులు మధ్యాహ్నం ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘నేను చచ్చిన తరువాతైనా ఇస్తారా?’’ అంటూ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. గ్రామస్తులు పురుగు మందు డబ్బాను లాక్కునేలోపు మందు తాగేయడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గ్రామస్తులు మోటారు బైక్‌పై ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన జలపతి అపస్మారకస్థితిలో పడిపోయినా చికిత్స కోసం అధికారులు తమ వాహనంలో ఆస్పత్రికి తరలించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఇల్లు మంజూరు కాలేదు జలపతి ఆన్లైన్లో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, మంజూరైన వెంటనే బిల్లు ఇస్తామని మండల హౌసింగ్ ఏఈ సత్య భాస్కర్‌రావు తెలిపారు. జలపతి కుమార్తె శ్రుతికి గత డిసెంబర్ 26న సదరం సర్టిఫికెట్ ఇచ్చారని, అయితే డిసెంబర్ 25న ఆన్లైన్ చేసే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం బంద్ చేసిందని మండల పరిషత్ జూనియర్ క్లర్క్ దస్తగిరి చెప్పారు. బాధితుడికి న్యాయం చేయాలి నరాల జలపతికి ప్రభుత్వం న్యాయం చేయాలి. టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు మంజూరు కావడం లేదు. టీడీపీ నాయకులకు డబ్బులిస్తేనే ఇల్లు, పింఛన్లు మంజూరవుతాయి. అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఇది కనికరం లేని ప్రభుత్వం. – గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే -
ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం
సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జన్మభూమి కార్యక్రమం ‘రణ’ భూమిగా మారుతోంది. సమస్యలను ప్రస్తావించకుండా టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాము చెప్పిందే వినాలి.. తిరిగి ప్రశ్నించకూడదన్న ధోరణి అవలంబిస్తున్నారు. వెరసి ప్రజల్లో రోజు రోజుకూ అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఐదేళ్లుగా అర్జీలు ఇస్తున్నా నేటికీ పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తారని ఎక్కడికక్కడ టీడీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. వాళ్లు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సభలు తూతూ మంత్రంగా ముగించేసి జారుకుంటున్నారు. ♦ పెడన పట్టణం 6వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. సమస్యలు ప్రస్తావించేందుకు సభకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్‌పై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించగా టీడీపీ జన్మభూమి కమిటీ నాయకులు, వైస్‌చైర్మన్ అబ్దుల్‌ఖయ్యూం, వహెబ్ఖాన్, హామీదుల్లా, యక్కల శ్యామలయ్య తదితరులు చైర్మన్‌పై తీవ్ర పదజాలంతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో చైర్మన్‌ను నెట్టేశారు. ఆ సమయంలో ఆయన చేతికి ఉన్న వాచి సైతం విరిగిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగేలా చేశారు. ♦ కృత్తివెన్ను మండలం పల్లెపాలెం జన్మభూమి మాఊరు సభ రసాభాసగా మారింది. ఐదేళ్ల పాలనలో మా గ్రామానికి చేసిందేమీ లేదని, అలాంటప్పుడు మాకెందుకీ సభలు అంటూ పల్లెపాలెం వాసులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. కనీసం ప్రతిజ్ఞ, సీఎం సందేశం కూడా చదవడానికి వీలులేదంటూ పట్టుపట్టారు. దీంతో పోలీసులు పహారాలో అధికారులు తూతూ మంత్రంగా సభను నిర్వహించారు. నాలుగున్నరేళ్ల పాలనలో మా పంచాయితీకి ఇచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలే, దీనిపై ఎమ్మెల్యేని అడుగుతుంటే జెడ్పీటీసీని అడగమంటున్నారు. అసలు మాకు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా అంటూ స్థానికులైన దావీదు, వరదరాజులతో పాటు కొందరు వేదికపై ఉన్న జెడ్పీటీసీ తులసీరావును నిలదీశారు. ♦ విజయవడ నగరంలోని 29వ డివిజన్ పరిధిలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జన్మభూమి కార్యక్రమంలో వినూత్న నిరసన తెలిపారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. ♦ విజయవాడ నగరంలో శ్మశానానికి స్థలం కేటాయించాలని దళితులు జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నించారు. సమస్య పరిష్కరించాల్సిన పాలకులు దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఒక్క సారిగా దళిత నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ♦ కంకిపాడు మండలం కుండేరులో తమకు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రజలు తహసీల్దార్‌ను నిలదీశారు. ఐదేళ్లుగా అర్జీలు సమర్పిస్తున్నా.. వాటి పరిష్కారం మాత్రం లభించడం లేదని ఆవేదన చెందారు. ♦ నందివాడ మండలం పెద్ద లింగాల గ్రామంలో గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలు మార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యను ప్రజలు నిలదీశారు. దళితులు ఎక్కువ నివసిస్తున్న గ్రామంలో తాగునీటి సైతం తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం మంత్రిపాలెం(మొవ్వ): ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామసభలలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మంత్రిపాలెం గ్రామంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు సభను స్తంభింపచేశారు. మొవ్వ మండలం మంత్రిపాలం పంచాయతీ పరిధిలోని సూరసాని మాలపల్లిలో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులు నిర్మించని అధికారులపై, రోడ్డు అభివృద్ధికి కృషి చేయని ఎమ్మెల్యే కల్పన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దళితవాడ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితవాడ అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన కనీసం దాని వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏ మొఖం పెట్టుకుని గ్రామానికి వచ్చావంటూ గ్రామస్తులు నిలదీశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, తహసీల్దార్ బి రామానాయక్, ఎంపీడీవో వి ఆనందరావు పాల్గొన్నారు. -
జన్మభూమికి జనం కరువు
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జరుగుతున్న జన్మభూమి గ్రామసభలకు జనం కరువవుతున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నా ప్రజల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. జన్మభూమి ప్రారంభమైన తొలిరోజు పింఛన్‌దారులను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను యంత్రాంగం తరలించింది. పింఛన్లు ఇప్పిస్తామంటూ చెప్పి ఎమ్మెల్యే సభ ముగిసే వరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను కూర్చోపెట్టారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత రావాలంటూ పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది చెప్పడంతో వారు ఉసూరుమంటూ అక్కడే చతికిలబడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఒంగోలు పీజీ క్యాంపస్‌కు చెందిన ఎన్ఎస్ఎస్ మహిళా వాలంటీర్లను జన్మభూమి సభకు తరలించారు. దాదాపు 20 మంది మహిళా వాలంటీర్లతోపాటు వారితో కూడా సంబంధిత అ«ధ్యాపకులను జన్మభూమికి గ్రామసభలకు రప్పిస్తున్నారు. శుక్రవారం కబాడీపాలెంలో జరిగిన సభకు హాజరు కావాల్సిన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సభ జనం లేక వెలవెలబోవడం చూసి, పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఎక్కడి సమస్యలు అక్కడే.. జన్మభూమి గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తున్నారు. గత ఐదు విడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో తమ సమస్యలను విన్నవించుకున్నప్పటికీ పరిష్కారానికి నోచుకోవడంలేదని యంత్రాంగాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యుడు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు తూర్పార పడుతున్నారు. స్థానిక కమ్మపాలెంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో తమ పార్టీకి ఈ ప్రాంతమంతా గట్టిగా పట్టు ఉండటంతో ఇక్కడ ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు ఒంగోలుకు శాసనసభ్యుడా లేకుంటే కమ్మపాలెంకు శాసనసభ్యుడా అంటూ కొంతమంది గ్రామ సభ జరుగుతున్న సమయంలోనే వ్యాఖ్యానించడం విశేషం. నాలుగున్నరేళ్లుగా అదేమాట.. ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామంటూ గత నాలుగున్నరేళ్ల నుంచి దామచర్ల చెబుతూనే ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను గెలిపించిన వెంటనే నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీల వర్షం కురిపించారు.అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత కూడా ఇంతవరకు ప్రతిరోజూ తాగునీరు వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి గ్రామసభల్లో కూడా ఎమ్మెల్యే స్వయంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకటి రెండు నెలల్లో తాగునీటి పైపులైన్ల పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రతిరోజూ తాగునీరు అందిస్తామంటూ మరోసారి ప్రకటనలు చేయడంపట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ శాసనసభ్యునిగా ఉంటున్న దామచర్ల తాను ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. మరో ఒకటి రెండు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోందని, ఎన్నికల నోటిఫికేషన్‌ను సాకుగా చూపించి తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిరోజూ తాగునీటి సరఫరా వాగ్దానాన్ని తిరిగి తెరపైకి తీసుకువస్తారంటూ కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం. జన్మభూమి సభను బాయ్‌కాట్ చేసిన టీడీపీ కార్యకర్తలు పాదర్తి (కొత్తపట్నం): ఎన్ని సార్లు ఎమ్మెల్యేకు చెప్పాలి.. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకోవాలి.. ఎన్ని సార్లు అర్జీలు ఇవ్వాలి.. మాకు ఇదే పనా? ఈ జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో కూడా ఇంతేగా అని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కొత్తపట్నం మండలం పాదర్తిలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామ సభలకు బాయ్‌కాట్ చేశారు. ‘ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చాం. ఎమ్మెల్యే అధికారులతో అనేక సార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు కావస్తోంది, ఇంత వరకు మా సమస్యలు పరిష్కరించలేదు. అధికారులు వచ్చి సభలు జరుపుకుంటే సరిపోతుందా? ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా భూమి ఆన్లైన్లు, శ్మశానికి బట, నీటి సమస్యలు గత జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో అర్జీలు ఇచ్చాం, చర్చించారు. ఇంత వరకు పరిష్కరించ లేదు’ అంఊ పాదర్తి, రంగాయపాలెం గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు గ్రామ సభను బాయ్‌కట్ చేశారు. టీడీపీ పార్టీ పెట్టిన సమావేశాలకు, గ్రామ సభలకు వచ్చేదే లేదని తెగేసి చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కలిసి ఒక తోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ సభ అయిపోయిన తరువాత గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. గ్రామస్తుల సహకారంతో గ్రామ సభ ముగించారు. -
జన్మభూమిలోమూడవరోజూ కొనసాగిన నిరసనలు
సాక్షి నెట్ వర్క్ : సమస్యలు పరిష్కరించని జన్మభూమి సభలు ఎందుకని జనం మండి పడుతున్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు. ♦ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నాని ఆగడాలు ఎక్కువవు తున్నాయి. జన్మభూమి గ్రామ సభల వేదికలపైకి అనుచరవర్గాన్ని తీసుకెళ్లి కూర్చోబెడుతుండడంతో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం భాకరాపేట జన్మభూమి గ్రామసభలోనూ ఇదే తీరుగా వ్యవహరిం చడం వివాదాస్పదమైంది. ♦ నాలుగున్నరేళ్ల కాలంలో తిరుచానూరు ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి, తాజా మాజీ వార్డు సభ్యుడు మునేంద్ర రాయల్, వైఎస్సార్సీపీ నాయకురాలు యశోద అన్నా రు. ఐదు జన్మభూమి కార్యక్రమాల్లో అర్జీలు తీసుకుంటున్నారే తప్పా ఒక్కటీ పరిష్కరిం చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ♦ తన రేషన్ కార్డును యాక్టివేషన్ చేయమని అడిగితే తిరుపతి రూరల్ డీటీ రోశయ్య రూ.3వేలు లంచం అడిగారని తిరుచానూరు నేతాజివీధికి చెందిన గోపాల్ జన్మభూమిలో అధికారుల వద్ద వాపోయాడు. కార్డును ఎందుకు నిలిపేశారో చెప్పాలని గోపాల్‌తో పాటు స్థానికులు అధికారులను నిలదీశారు. ♦ గంగవరం మండలం పత్తికొండ, మామడుగు పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమాల్లో విద్యార్థులతో డ్యాన్స్‌లు చేయించారు. ♦ గుర్రంకొండలో తాగునీటి సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న జన్మభూమి గ్రామసభ ఎదురుగా మహిళలు ధర్నా చేశారు. ♦ ప్రోటోకాల్ సమస్య రావడంతో కల్లూరు జన్మభూమి కార్యక్రమంలో అధికారులందరూ కిందనే కూర్చుని సభలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అనీషా రెడ్డి వస్తారని చెప్పినా వారు హాజరుకాలేదు. ♦ తాగునీటి సమస్య పరిష్కరించాలని చౌడేపల్లె మండలం పందిళ్లపల్లె, ఆమినిగుంట గ్రామ పంచాయతీల మహిళలు జన్మభూమి సభల్లో అధికారులను నిలదీశారు. ♦ విజయపురం మండలం ఆలపాకం, మాధవరం గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో జనం కంటే అధికారులు ఎక్కువగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. ♦ బుచ్చినాయుడుకండ్రిగ మండలం వీఎస్ పురం గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. ♦ పెద్దతిప్పసముద్రం మండలం మడుమూరులో అంగన్వాడీ పిల్లలను కూర్చోబెట్టారు. ♦ రామసముద్రం మండలం కాంపల్లె పంచా యతీలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాకపోవడంపై మహిళలు అధికారులను నిలదీశారు. మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రప్పనాయుడు కలుగజేసుకోవడంపై ఎమ్మెల్యే దేశాయ్‌తిప్పారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులు జోక్యం చేసుకోవడం సభ్యత కాదని మండిపడ్డారు. ఆయ న్ను బయటకు పంపాలని ధర్నా చేశారు. -
వివాదాస్పద ‘కొఠియా’లో.. ‘జన్మభూమి’
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలోని వివాదాస్పద కొఠియా పంచాయతీ గ్రామల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం ‘జన్మభూమి’ పేరిట మళ్లీ ఆ రాష్ట్ర అధికారులు కొఠియాలో పర్యటనలు ప్రారంభించారు. వివా దాస్పద ఉపరసంచి, నేరేడివలస, గంజయిపొదర్ గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలను వ్యాన్లతో జన్మభూమి కార్యక్రమానికి సమీకరించారు. వారికి జన్మ భూమి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్ల బట్వాడా వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఒడిశా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివాదాస్పద గ్రామ ప్రజలను ఆకర్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుగా స్థానికులు చెబుతున్నారు. కొద్ది మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ అధికారులు కొఠియా ప్రజలకు రగ్గులు, సోలార్లైట్లు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామ ప్రజల అసౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పేదలకు ఉచిత సంక్షేమ పథకాలు సమకూర్చేందుకు హామీలు ఇచ్చారు. మేలుకున్న కొరాపుట జిల్లా యంత్రాంగం ఇటువంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొఠియా పంచాయతీ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకుంటున్న కథనాలు తెలుసుకుని కొరాపుట్ జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు మేలుకుని, ఆయా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ అక్కడ అభివృద్ధి పనులకు నడుం బిగించారు. రహదారుల పనులు వేగవంతం చేస్తున్నారు. సీమగుడ నుంచి నువగాం వరకు, మనరేగ, ఘాటర్గుడ,మడ్కర్ గ్రామం వరకు, ఫగుణసినారి–డలియంబ నుంచి కొఠియా వరకు రోడ్ల పనులు వేగవంతం చేశారు. రహదారులలో నిర్మించవలసిన 11 వంతెనల టెండర్ ప్రక్రియ పూర్తిచేశారు. పంచాయతీలోని మతలమ, గుమెల్పొదర్, తొలకండి, కొడియంబ, సులియమరి, సలీంపొదర్, కటర్గడ వంటి గ్రామాల్లో విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొఠియా పంచాయతీ సమగ్రాభివృద్ధికి రూ.150 కోట్ల ప్రత్యేక నిధులను ప్రకటించి ప్రజలకు అన్ని మౌలిక సౌకర్యాలు సమకూర్చేందుకు సన్నద్ధమవుతోంది. కొఠియా వివాదాస్పద గ్రామ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి ఉభయ రాష్ట్రాలు అందజేసే సేవలు అందుకుంటున్నారు.