సభా ప్రాంగణ మధ్యలో డ్యాన్సు చేస్తున్న బాలికలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అధికారులందరూ జన్మభూమి– మాఊరు కార్యక్రమానికి ఓ నమస్కారం అనే పరిస్థితి నెలకొంది. కారణం టీడీపీ నేతల ఒత్తిళ్లతో సమస్యలు పరిష్కరించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక ఉద్యోగులు అడకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నారు. ఫలితంగా వారికి జన్మభూమి కార్యక్రమం అంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి. జిల్లాలోని అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు తమకున్న అధికారాలను విని యోగించి పేద ప్రజలకు న్యాయం చేద్దామని ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలను టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అడ్డుకుం టున్నారు. వారిని సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో జన్మభూమి– మాఊరు గ్రామసభల్లో ప్రజలిచ్చే అర్జీలకు అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలా నిర్ణయం తీసుకునే కొందరి అధికారులపై అక్కడి టీడీపీ ప్రజాప్రతినిధులు తమ అక్కసు ప్రదర్శిస్తున్నారు.
టీడీపీ నేతల ఆమోదం తప్పనిసరి
ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న పేదలను గుర్తించి, వాటిని వారి చెంతకు చేర్చే బాధ్యత నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఏ శాఖలోనైనా ప్రభుత్వ పథకాల మంజూరుకు సంబంధించి టీడీపీ ప్రజాప్రతినిధుల ఆమోదం తీసుకోవాల్సి వస్తుందని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు సూచించే కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ఆశయం నిర్వీర్యం కావడమే గాక పేదలకు ఆ పథకాలు చేరడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ వివాదంతో నెలకొన్న ఉద్రిక్తత
పోలీసు బందోబస్తు నడుమ జన్మభూమి
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆరో విడత జన్మభూమి– మా ఊరు కార్యక్రమ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఛీత్కారాలు, ప్రజల తిరుగుబాటు, ఆగ్రహజ్వాలలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమం పోలీసు బందోబస్తు నడుమ కొనసాగాల్సిన దుస్థితి నెలకొంది.అయితే జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకే అధికారుల వచ్చి, ప్రజా సమస్యలు విని పరిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇందుకోసం రూ.కోట్ల ఖర్చు పెడుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన ఐదు విడతల జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలకు న్యాయం జరగలేదు. దీంతో గతంలో ఇచ్చిన అర్జీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారిని ప్రభుత్వం పోలీసులతో బెదిరిస్తోంది. ఈ క్రమంలో జన్మభూమి సభల్లో అధికార పార్టీ నాయకులు, నేతలు మాట్లాడే ప్రసంగాలను ప్రజలు మౌనంగా వినడం తప్ప, మరో మార్గాంతరం లేకుండాపోతోంది. ప్రజలిచ్చే అర్జీలను తామైనా పరిష్కారం చేద్దామని అధికారులు భావిస్తున్న ఉద్యోగులపై టీడీపీ నేతలు ఒత్తిడి పెంచి, ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
సీఎం సభకు వచ్చిన అర్జీలే నిదర్శనం
గత ఐదు విడతల జన్మభూమిలో ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదనడానికి గురువారం కుప్పంలో జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనలో వచ్చిన అర్జీలే నిదర్శనం. సీఎం కుప్పంలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 875 మందికి పైగా పాల్గొని, అర్జీలు అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కా రం కాకపోవడంతోనే ప్రజలు నేరుగా సీఎంకైనా తమ ఆవేదనను చెప్పుకుందామని వచ్చి, వినతులు ఇచ్చారనడానికి సాక్షం. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, టీడీపీ నేతలు అధికారులను బెదిరించడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు జన్మభూమిలో నిర్వాకం
గంగవరం: మండలంలోని గండ్రాజుపల్లెలో జరిగిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో బడిపిల్లలతో నాగినీ డ్యాన్సులు వేయించారు. గురువారం గండ్రాజుపల్లె, కీలపల్లె పంచాయతీల్లో జన్మభూమి నిర్వహించారు. గండ్రాజుపల్లిలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు బడి పిల్లలతో నాగినీ డ్యాన్స్‌లు వేయించారు. ఇలా సభా ప్రాంగణం మధ్యలో బాల, బాలికలతో డ్యాన్స్‌లు వేయించడం విమర్శలకు దారితీసింది. బడిలో చక్కగా చదువుకోవాల్సిన పిల్లలను ఇలా జన్మభూమికి రప్పించి వారితో డ్యాన్సులు వేయించడం ఏమిటని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వెలుగు మహిళలను రప్పించడానికి అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు.
ఆగ్రహజ్వాలలు.. ఆందోళనలు
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరో విడత జన్మభూమి– మాఊరు కార్యక్రమంలో రెండో రోజైన గురువారం కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేశారు. అధికారులను నిలదీశారు. గత ఐదు విడతల్లో ఇచ్చిన అర్జీల మాటేమిటని? వాటికే దిక్కులేదని, మళ్లీ ఇప్పుడు జన్మభూమి ఎందుకు నిర్వహిస్తున్నారని సభలను అడ్డుకున్నారు. జనాగ్రహం, నిలదీతలు, ఆందోళనలు ఎదుర్కొని, వారికి సంజాయిషీ చెప్పుకోలేక అధికారులకు ముచ్చెమటలు పట్టాయి.
♦ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు స్థలాలు చూపకుంటే చంద్రగిరి మండలంలో జరిగే జన్మభూమిని అడ్డుకుంటామని మామండూరు గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు.
♦ ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు ప్రోటోకాల్ పాటిం చడం లేదని టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు గీతాయాదవ్ ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కార్వేటినగరం మండలం కేఎం పురంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో అధికారకంగా స్టేజీపై కూర్చోవారిని పక్కనపెట్టి ఎలాంటి అర్హత లేని వారిని వేదికపై కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
♦ నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరిం చింది. గతంలో జరిగిన ఐదు జన్మభూమి–మా ఊరు సభల్లో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటికీ పరిష్కారం చూపలేదు. మళ్లీ ఆరో విడత ఏం వెలగబెట్టడానికని జన్మభూమి గ్రామసభలు జరుపుతున్నారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి నిలదీశారు.
♦ చౌడేపల్లె మండలం చారాలలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, టీడీపీ ఇన్‌చార్జి అనూషారెడ్డి, శ్రీనాథరెడ్డి గోబ్యాక్ అంటూ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు నినాదాలు చేశారు. అయినా వారు వేదికపైనే కూర్చోని ఉండడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
♦ సమస్యలుంటే జన్మభూమి కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్ష్యంలోనే చెప్పమంటారు... తర్వాత అధి కారులు ఏమీ పట్టించుకోరు. ఇదేమిటని తవణంపల్లె మండలం చెర్లోపల్లె గ్రామ సభలో అధికారులపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦ కుశస్థలి నది కుడి, ఎడమ కాలువలు దురాక్రమణకు గురవుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందిం చడం లేదని సీపీఐ నాయకులు నగరిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అధికారులను నిలదీశారు.
♦ నాగలాపురం మండలం కడివేడులో జరిగిన జన్మభూమి– మా ఊరు గ్రామ సభను ఆ గ్రామ దళితులు బహిష్కరించారు. జన్మభూమి ప్రారంభంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ మండల కన్వీనర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో దళితులు జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు.
♦ తంబళ్లపల్లె మండలంలోని వేమారెడ్డిగారిపల్లె, పంచాలమర్రి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. సమస్యలపై ప్రజలు అధికారులను నిలదీశారు. ప్రజలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
♦ జన్మభూమి సభల్లో దరఖాస్తు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. తిరుపతి నగరంలోని 2, 12, 22, 32, 42 వార్డుల్లో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే సుగుణమ్మకు ఈ అనుభవం ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment