
దువ్వూరువారిపాళెంలో చెవులు మూసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు
జన్మభూమి..మా ఊరు గ్రామసభల్లో రెండో రోజూ గురువారంనిరసనలు..ఆందోళనలూ కొనసాగాయి. పలుచోట్ల గ్రామసభలను బహిష్కరించడంతో పాటు అధికారులను నిలదీశారు. పలు ప్రాంతాల్లో సభలకు ప్రజలు రాకపోవడంతో వెలవెలబోయాయి. ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకోసం నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక అధికారులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి ప్రసంగానికే అధికారులు ఎక్కువ సమయం కేటాయించి సభకు వచ్చిన వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాళెంలో చెవులు మూసుకొని నిరసన వ్యక్తం చేశారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలు ఏమయ్యాయి.. ఏడాది తర్వాత మళ్లీ ఎలా వచ్చారని ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామ ప్రజలుజెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆర్డీఓ సువర్ణమ్మలను
నిలదీశారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఏడాది కిందటే అర్జీలు పెట్టుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలం కేతిగుంటలో గ్రామసభను బహిష్కరించారు. కరువుతో అల్లాడుతున్నాం.. సాగు, తాగునీరు ఇప్పించాలంటూ ప్రజలునిలదీశారు.
నెల్లూరు(పొగతోట): ప్రభుత్వం ప్రచారం కోసం నిర్వహిస్తున్న 6వ విడత జన్మభూమి – మా ఊరు గ్రామసభల బహిష్కరణలు, నిరసనలు, అధికారులను నిలదీయడం కొనసాగుతున్నాయి. పలుచోట్ల ప్రజలు గ్రామసభలను బహిష్కరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. రైతు రథాలు పచ్చనేతలకే అందిస్తున్నారంటూ రైతులు వ్యవసాయశాఖ అధికారులను నిలదీశారు. పలు ప్రాంతాల్లో జన్మభూమి సభలకు ప్రజలు రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
జన్మభూమి సభల బహిష్కరణ
జిల్లాలో గురువారం రెండో రోజు జన్మభూమి – మాఊరు గ్రామసభలను అధికారులు నిర్వహించారు. మర్రిపాడు మండలం పొంగూరు పంచాయతీ కేతిగుంట గ్రామంలో జన్మభూమి సభను ప్రజలు బహిష్కరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కావడం లేదంటూ అధికారులను నిలదీసి సభను బహిష్కరించారు. ఆత్మకూరు మండలం బోయలచిరివేల్లలో ఇచ్చిన వారికి ఇళ్లు ఇస్తున్నారని అర్హులైన కొత్త వారికి ఇవ్వడంలేదని ప్రజలు అధికారులను నిలదీశారు. చేజర్ల మండలం ఎన్‌వీ కండ్రిక గ్రామంలో జన్మభూమి గ్రామసభలో వ్యవసాయశాఖ అధికారులను రైతులు తమ సమస్యలపై నిలదీశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సంక్షేమ పథకాలు అనర్హులకు ఎందుకు అమలు చేస్తున్నారంటూ ప్రజలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారికి అమలు చేయాలని ప్రజలు అధికారులను కోరారు. వాకాడు మండలం మొలగనూరు గ్రామంలో అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేయడం లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. దుత్తలూరు మండలం వెంగనపాళెం జన్మభూమి గ్రామసభకు అధికారులు ఆలస్యంగా హాజరయ్యారు. మండల ఉపాధ్యక్షురాలు అధికారుల కోసం నిరీక్షించాల్సివచ్చింది. జన్మభూమి గ్రామసభల్లో ప్రచారం చేసుకోవడానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం, పథకాల ప్రచారానికి అధిక సమయం కేటాయిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మొక్కుబడిగా సభలు నిర్వహిస్తున్నారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లు కేటాయించారు. ఈ విషయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి సభల్లో అధికారులను నిలదీస్తున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేక నీళ్లునములుతున్నారు.
జన్మభూమి సభను అడ్డుకున్న గ్రామస్తులు
జలదంకి: మండలంలోని గోపన్నపాలెంలో గురువారం ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు గ్రామసభను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో చిప్పలేరు వద్ద, పోలేరమ్మ గుడి వద్ద, వడ్లమూడి వెంకటేశ్వర్లు పొలం వద్ద బాటలు ఆక్రమణలకు గురై ఉన్నాయని రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. అలాగే గ్రామంలో 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండా మోసం చేశారంటూ ప్రజలు గ్రామసభలో నిరసన వ్యక్తం చేశారు. చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 5వ నంబర్ తూము ద్వారా సాగునీరు ఇవ్వకుండా చేశారని జన్మభూమి సభకు హాజరైన టీడీపీ మండల అధ్యక్షుడు పూనూరు భాస్కర్‌రెడ్డి, సోమశిల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వంటేరు జయచంద్రారెడ్డిలను నిలదీశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీడీఓ ఆక్రమణలకు గురైన బాటలను గ్రామస్తులతో కలిసి పరిశీలించి ఆక్రమణలను తొలగిస్తామని వారికి చెప్పడంతో వారు శాంతించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రామసభ ప్రారంభమైంది.
జన్మభూమిని పక్కాగా నిర్వహించకపోతే చర్యలు
జలదంకి మండలం ఎల్‌ఆర్‌అగ్రహారం, గోపన్నపాలెంలలో గురువారం జరిగిన జన్మభూమి సభలను కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ తనిఖీ చేశారు. ఎల్‌ఆర్ అగ్రహారంలో గ్రామ సందర్శనను అధికారులు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువైద్య సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసి జన్మభూమి సభలను సక్రమంగా నిర్వహించకపోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనూరాధ, పీఆర్ ఏఈ శ్రీనివాసులు, ఆర్‌డబ్లూఎస్ ఏఈ మసూద్, హౌసింగ్ ఏఈ ఏఎస్‌ఎన్ సింగ్, వ్యవసాయాధికారిణి లక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం సందేశం వినలేం బాబూ!చెవులు మూసుకొని నిరసన
నెల్లూరు ముత్తుకూరు: అభూత కల్పనలతో నిండిన ముఖ్యమంత్రి సందేశాన్ని వినలేకపోతున్నామంటూ చెవులు మూసుకొని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలంలోని దువ్వూరువారిపాళెంలో 6వ విడత జన్మభూమి–మా ఊరు గ్రామసభలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వెటర్నరీ ఏడీ సోమయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్న ఈ గ్రామసభలో ఎంఈఓ మధుసూదన లేచి సీఎం సందేశాన్ని వినిపిస్తుండగా దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు చెవులు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. సందేశం పూర్తిపాఠం ముగిసే వరకు వినకుండా నిరసన వెలిబుచ్చారు. వ్యవసాయాధికారి హరికరుణాకర్‌రెడ్డి, సీడీపీఓ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.