సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో సోమవారం జరిగిన ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామ సభల్లో కూడా నిలదీతల పరంపర కొనసాగింది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామం, కొత్తపల్లి మండలం కొమరిగిరి, గోర్సల్లో తమ సమస్యలు పరిష్కరించని ఈ సభలు ఎందుకని అధికారులను నిలదీశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో సీపీఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ‘దశాబ్దాలు దాటుతున్నా ఈనాం భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ నేతలను దిగ్బంధనం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు మండలం పేగ గ్రామంలో గిరిజనులు ఏకంగా సభలో నిరసన తెలిపి బహిష్కరించారు. దేవీపట్నం మండలం కూడిపల్లి, చినరమణయ్యపేటలో పోలవరం ముంపు బాధితులు తమ నిరసన గళం వినిపించారు.
సభను బహిష్కరించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన సభలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. తన పట్ల టీడీపీ నేతలు అవలంబించిన తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సభను బహిష్కరించారు. సభలో తొలుత ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ అరకొరగా అమలు చేస్తున్న పథకాలను, అమలు చేయని హామీలను, ప్రభుత్వ దుబారాను ఎండగడుతుండగా టీడీపీ శ్రేణులు లేచి అడ్డుతగిలి గలాటా సృష్టించారు. దానికి ప్రతిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందుకు రావడంతో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసి రసాభాసగా మారింది. దీన్ని నిరసిస్తూ జగ్గిరెడ్డి సభను బహిష్కరించి బయటకు వచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment