రాజధాని నిర్మాణంలో దూసుకెళ్తా! | Kadapa airport in Andhra Pradesh is now open | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణంలో దూసుకెళ్తా!

Published Mon, Jun 8 2015 2:04 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM

రాజధాని నిర్మాణంలో దూసుకెళ్తా! - Sakshi

రాజధాని నిర్మాణంలో దూసుకెళ్తా!

యజ్ఞానికి ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోంది
గోదావరి-కృష్ణా అనుసంధానం చేసి తీరుతాం
డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలు
‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రైతులు స్వచ్ఛందంగా రాజధాని ఏర్పాటుకు భూములిస్తూ సహకరించారు. కానీ రాజధాని అనే యజ్ఞానికి ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తోంది.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని ఏర్పాటులో దూసుకెళ్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్సార్  జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో ఆదివారం జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాజధానికోసం 33 వేల ఎకరాల భూమి అవసరంకాగా 21 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, మరో 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.

గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని కృష్ణా నదికి తెప్పించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాయలసీమలోని మెట్టప్రాంతాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరివ్వాలనే సంకల్పంతో.. ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటున్నామని, అందులో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని చెప్పుకొచ్చారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు రహిత రాయలసీమగా చేస్తామన్నారు.

డిసెంబర్ నాటికి ప్రభుత్వమే కేబుల్ టీవీ సర్వీసులను ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.100కే కేబుల్‌టీవీ, ఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సాక్షిగా పసువుమయం చేశారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి సర్పంచ్‌కు ఆహ్వానమే అందలేదు. స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకూ అదే పరిస్థితి. చివరకు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డికీ ఆహ్వానం అందలేదని సమాచారం.  కేంద్రమంత్రి సుజనాచౌదరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఎమ్మార్పీఎస్ నిరసన.. : ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతుండగా ఒక్కమారుగా సీఎం డౌన్‌డౌన్ అంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్నికల్లో మాదిగలకిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  
 
సుజనా.. బాబు చర్చల సారాంశమేమిటో..
ఖాజీపేట జన్మభూమి కార్యక్రమ వేదికపై కేంద్రమంత్రి సుజనాచౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసేపు గుసగుసలాడుకున్నారు. ఓ వైపు సభ జరుగుతుండగా.. మరోవైపు సుజనా చౌదరి ఫోన్‌లో బిజీగా గడిపారు. ఫోన్ మాట్లాడటం ముగియగానే నేరుగా చంద్రబాబు వద్దకొచ్చి ఆయన విషయం వివరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ఏదో ముఖ్యమైన అంశంపై చర్చిస్తున్నారనే భావన అందరిలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వీరు హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలవడం గమనార్హం.
 
డప విమానాశ్రయం ప్రారంభం
‘అన్నమయ్య’ పేరును సిఫార్సు చేస్తామన్న సీఎం

కడప విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. బెంగళూరు నుంచి ఉదయం 11.22 గంటలకు తొలిసారి ఎయిర్ పెగాసెస్ విమానం కడపకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలన అమోఘమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కడప విమానాశ్రయానికి అన్నమయ్య పేరు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చాయని, ఆ మేరకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏపీలోని తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నామని, ట్రీపుల్ ఐటీ, ఐఐటీ, ఐఈఎస్‌ఆర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

హిందూపురంలో రూ.500 కోట్లతో సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అకాడమీ ఏర్పాటు చేశామని, రక్షణశాఖ విభాగాల తయారీ కేంద్రాన్ని సీమలోనే ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. కడపలో విమానాశ్రయంతోపాటు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని, వాటిని నిలుపుకోవడం మీచేతుల్లోనే ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు.

కడప విమానాశ్రయానికి తొలిసారిగా ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ పెగాసెస్ విమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement