అధికారులను నిలదీస్తున్న రైతు క్రిష్ణయ్య
అనంతపురం అర్బన్: సమస్యల పరిష్కారానికంటే ప్రభుత్వం సొంత బాకా ఊదుకునేందుకే జన్మభూమి–మా ఊరు కార్యక్రమం పరిమితమైంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీశారు. వెల్లువలా ఎదురైన నిరసనలతో అధికారులకు భంగపాటు తప్పలేదు. ఐదో రోజు జిల్లాలో ఆదివారంనిర్వహించిన జన్మభూమి సభల్లో పలు చోట్ల సమస్యలపై అర్జీలు స్వీకరించడం, ఉపన్యాసాలతో తూతూ మంత్రంగా సభలను ముగించారు. ప్రభుత్వ పథకాల అవినీతిపై కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో నిర్వహించిన సభలో వైఎస్సార్‌సీపీ నాయకులు బొమ్మలింగ, బీజప్ప, తిప్పేస్వామి తదితరులు నిలదీశారు. వేదిక మీద ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అసహనానికి గురవుతూ ‘మా ప్రభుత్వంలో మేము దోచుకుంటే తప్పేంటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మడకశిర మండలం ఆర్.అనంతపురం, మెళవాయిలో జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పాల్గొని ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
నిరసనలు ఇలా...
♦ కళ్యాణదుర్గం నియోజకవర్గం రాంపూరం సమీపంలోని పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కంబదూరులో జరిగిన సభలో అధికారులను మాజీ సర్పంచ్ తిరుపాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటేశులు, మారెన్న తదితరులు నిలదీశారు. టీడీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు.
♦ పింఛన్లు, మరుగుదొడ్ల బిల్లులు, పక్కా ఇళ్ల మంజూరులో అవినీతి జరిగిందని బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామంలో సభలో వైఎస్సార్‌సీపీ నాయకులు లోకేష్, మంజునాథ్, లింగన్న తదితరులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొంది. మా గ్రామంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఏం మేలు చేశారో చెప్పాలని తిమ్మసముద్రంలో జరిగిన జన్మభూమిలో అధికారులను వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు.
♦ శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్సీ శమంతకమణిని ఎంఆర్‌పీఎస్ నాయకులు నిలదీశారు. గ్రామంలో నీటి సమస్య ఉందని, వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దానిని ఇంతవరకూ అమలు చేయలేదని ఆగ్రహించారు. గ్రామంలోకి వచ్చిన ప్రతిసారీ బీసీ కాలనీలోకే వెళతారు. ఎస్సీ కాలనీ ప్రజలు కనిపించరా? , నాలుగున్నరేళ్లలో ఒక్కసారైన ఎస్సీ కాలనీకి వచ్చారా? సమస్యలు విన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంటలు ఎండుతున్నాయహే.. కాలువలకు నీళ్లొదలండి
వానలు లేక పంటలు ఎండుతున్నాయహే.. కాలువలకు నీళ్లొదలండి’ అంటూ అధికారులను రైతు క్రిష్ణయ్య నిలదీశారు. రాప్తాడు మండలం హంపాపురంలో ఆదివారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు తొలుత ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రభుత్వానికి బాకా ఊదుతుంటే అసహనానికి గురైన రైతు క్రిష్ణయ్య ఒక్కసారిగా పైకి లేచి అలా విరుచుకుపడ్డాడు. ఇంత కాలం మీరు చెప్పిన సోదంతా విన్నాం. కనీసం ఇప్పుడైనా మేము చెప్పేది వినండి. బోరు బావి కింద నాలుగు ఎకరాల్లో తాను సాగు చేసిన చీనీ తోట, ఎకరా విస్తీర్ణంలో వరి ఎండిపోతోందని వివరించారు. ధర్మవరం కుడి కాలువకు నీరు వదిలితే భూగర్భ జలాలు పెరిగి పంట సాగుకు అనుకూలమవుతుందని వివరించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని క్రిష్ణయ్యను కూర్చోబెట్టారు. – రాప్తాడు
రేషన్‌కార్డు ఒకరిది.. లబ్ధి మరొకరికి
ఇతని పేరు దామోదర్, గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం. తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నాడు. సొంతింటి కోసం లెక్కకు మించి చాలా సార్లు అర్జీలు ఇచ్చాడు. అయినా మంజూరు కాలేదు. ఇటీవల మరోసారి అర్జీ ఇస్తే హౌసింగ్ అధికారులు పరిశీలించి.. అతని రేషన్‌కార్డుపై ఇల్లు మంజూరైందని తెలపడంతో అవాక్కయ్యాడు. తాను ఇంత వరకూ ఇల్లు కట్టలేదని, అయితే బిల్లులు ఎవరు తీసుకున్నారంటూ వాకాబు చేస్తే పెనకచెర్లకు చెందిన వ్యక్తి పేరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తేలింది. తనకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆదివారం జన్మభూమి గ్రామసభలో మరోసారి అధికారులకు అర్జీ ఇచ్చాడు. – గార్లదిన్నె
Comments
Please login to add a commentAdd a comment