యాడికి మండలం నగరూరులో జన్మభూమి కార్యక్రమానికి బల్లలు మోస్తున్న జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు
ధర్మవరం పట్టణానికి చెందిన లక్ష్మమ్మ వయస్సు 75ఏళ్లు. నా అనే వాళ్లు ఎవ్వరూ లేరు. ఉన్న ఆశ అంతా ప్రభుత్వం అందించే పింఛన్‌పైనే. మందులు కొనాలన్నా.. పూట గడవాలన్న ఇదే ఆధారం. ఎప్పటిలానే పింఛన్ కోసం 1వ తేదీన వెళ్లింది. అయితే పంపిణీ సిబ్బంది వేలిమద్ర వేయించుకొని చిన్నపాటి చీటీ ఇచ్చి జన్మభూమి కార్యక్రమంలో ఇస్తామని మెళిక పెట్టారు. దీంతో ఈ అవ్వ నిస్సహాయ స్థితిలో వెనక్కి వెళ్లింది.
అనంతపురం అర్బన్: జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలకు నిరసన సెగ తగులుతోంది. సమస్యలను పరిష్కరించలేని సభలు మాకొద్దంటూ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రెండు రోజు గురువారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో గ్రామసభలో ప్రభుత్వం ఐదేళ్లుగా పంట నష్ట పరిహారం, బీమా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ లిఖితపూర్వకంగా అధికారులకు తెలియజేశారు. కూడేరు మండలం కలగళ్ల గ్రామసభలో తాగునీరు, పక్కా గృహాల కోసం ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. పాత మరుగుదొడ్లకు బిల్లులు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పలు చోట్ల గ్రామసభలను మొక్కుబడిగా నిర్వహించారు.
ఏమిటయ్యా.. మాకీ కష్టాలు
రాయదుర్గం టౌన్ : పట్టణంలో నిర్వహిస్తున్న జన్మభూమి వార్డు సభల్లో పండుటాకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సభలు ముగిసేదాకా పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో భోజనం కూడా లేక నీరసిస్తున్నారు. గురువారం పట్టణంలోని 3వ వార్డులో జన్మభూమి సభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగింది. మంత్రి రాకకోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సి వచ్చింది. సభ ముగిసిన తర్వాత కూడా పింఛన్లు పంపిణీ చేయలేదు. 4 గంటలకు రావాలని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.
జన్మభూమికి వస్తేనే పింఛను
‘‘కొత్తపల్లిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమానికి వస్తేనే పింఛను ఇస్తామన్నారు. మేమంతా పొద్దునే ఆటో తీసుకొని రాజమోల్లపల్లి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఈ మీటింగ్ ఎప్పుడు అయిపోతాదో, మాకు పింఛను ఎప్పుడు ఇస్తారో. తిండీతిప్పలు లేకుండా సంపుతున్నారు.’’– నల్లచెరువు మండలం రాజమోల్లపల్లి తండాకు చెందినఈశ్వరమ్మ, పార్వతమ్మ, వెంకటమ్మ ఆవేదన
సభల తీరు ఇలా..
♦ గుంతకల్లు మండలం గుండాల తండా గ్రామంలో ప్రజలు సమస్యలపై అధికారులును నిలదీశారు. గడిచిన జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన ఫిర్యాదులు ఇంతవరకు పరిష్కరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
♦ కదిరి అర్బన్ పరిధిలోని మోటుకుపల్లిలో ఎన్‌టీఆర్ ఇల్లు మంజూరు చేయలేదని లక్ష్మీబాయ్ అనే మహిళ ఆగ్రహించింది. హౌసింగ్ ఏఈ ఖాజామోద్దీన్‌తో వాగ్వాదానికి దిగింది. పశుగ్రాసం, పశువులకు మందులు ఇవ్వలేదంటూ తనకల్లు మండలం బాల సముద్రంలో రైతులు రమణ, గోవిందు, శివన్న, కొండలరావ్ నిరసన వ్యక్తం చేస్తూ అధికారులతో వాదనకు దిగారు.
♦ గాండ్లపెంట మండలం మద్దివారిగొంది పంచాయతీలోని కమతంపల్లిలో జనం లేక గ్రామసభ వెలవెలబోయింది. తలుపుల మండలం ఓదులపల్లిలో రేషన్ కార్డులు, సీసీరోడ్లు మంజూరు చేయాలని జన్మభూమి సభను గొల్ల పల్లి తండావాసులు అడ్డుకున్నారు.
♦ మడకశిర మండలం రొళ్ల మండలం హులికుంట గ్రామసభలో సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులను ప్రజలు నిలదీశారు. మడకశిర పట్టణంలోని 3, 8 వార్డుల్లో, రూరల్ మండలం అమిదాలగొంది, కదిరేపల్లి పంచాయితీల్లోనూ, అగళి మండలం ఇరిగేపల్లి, గుడిబండ మండలం చిగతుర్పి, నాగేపల్లి పంచాయితీల్లో జన్మభూమి గ్రామసభలు మొక్కుడిగా సాగాయి.
♦ పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం ఇనగలూరులో సమస్యలపై అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కొద్ది సేపు సభను అడ్డుకున్నారు. బుక్కపట్నం, పుట్టపర్తి పట్టణంలో మొక్కుబడిగా సాగాయి.
♦ శింగనమల నియోజకవర్గం ఉల్లికల్లు గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు.
♦ తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం నగరూరులో సమస్యల పరిష్కారానికి అధికారులను గ్రామస్తులు నిలదీశారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ కొద్దిసేపు సభను అడ్డుకున్నారు.
♦ రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలంలోని గలగల గ్రామంలో ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment