పెనుకొండ రూరల్: ఎమ్మెల్యే బీకే పార్థసారథిని నిలదీస్తున్న వెంకటేష్
అనంతపురం అర్బన్ : జన్మభూమి–మా ఊరు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. సభల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. గత జన్మభూమిలో ఇచ్చిన సమస్యలనే పరిష్కరించలేనప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. పుట్లూరు మండలం కోమటికుంట్లలో ప్రజాగ్రహం నేపథ్యంలో అధికారులు వెనక్కు తిరగక తప్పలేదు. దాదాపుగా అన్నిచోట్లా నిరసనలు, నిలదీతలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇకపోతే ప్రజల నుంచి కూడా స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తామంటూ ప్రచారం చేసుకొని వచ్చిన లబ్ధిదారులతోనే మమ అనిపించారు.
జన్మభూమి సభల్లో ప్రజాసమస్యలపై కంటే ప్రభుత్వం ప్రచార ఆర్భాటంపైనే దృష్టి సారించింది. అభివృద్ధి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ప్రసంగాలను ఊదరగొట్టారు. ఒకవైపు కరువుతో ప్రజలు, రైతులు అల్లాడుతుంటూ జిల్లాలో సమస్యలు లేవన్నట్లుగా మాట్లాడుతూ అభివృద్ధి పథంలో జిల్లా దూసుకుపోతోందంటూ చెప్పుకొచ్చారు. రాయదుర్గం మునిసిపాలిటీ పరిధిలోని 30, 1, 2వ వార్డుల్లో గృహ నిర్మాణ శాఖమంత్రి కాలవ శ్రీనివాసులును ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరగా అర్జీలు ఇవ్వండని సరిపెట్టారు. మడకశిర మండలం గౌడనహళ్ళి, చెందకచెర్లు, శంకరగల్లు పంచాయితీల్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పాల్గొనిప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు.
నిలదీతల పర్వం
♦ శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కోమటికుంట్లలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకున్నారు. గ్రామంలో తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం, ప్రచార ఆర్భాటానికి చేపట్టిన కార్యక్రమాన్ని జరగనివ్వబోమంటూ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి ఫ్లెక్సీని, ఫర్నిచర్‌ను తొలగించారు. గత జన్మభూమిలో ఇచ్చిన అర్జీలు పరిష్కరించలేనప్పుడు ఎందుకీ జన్మభూమి అంటూ నిలదీశారు. గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలోనూ జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి స్వగ్రామంలోనే ఎలాంటి అభివృద్ధి లేదని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన అర్జీలు ఇంతవరకు పరిష్కారం కాలేదంటూ అధికారులను నిలదీశారు. ఆయకట్టుకు నీరు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
♦ తాడిపత్రి నియోజకవర్గం చిన్న, పెద్దవడుగూరు గ్రామసభలు రసాభాసగా మారాయి. పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు, పెద్దవడుగూరు గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో సమస్యలపై సీపీఐ, సీపీఎం నాయకులు అధికారులను నిలదీశారు. గత గ్రామసభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ అధికారులుపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామసభలను అడ్డుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో బుధవారం ప్రారంభమైన జన్మభూమి సభల్లో జనం రాకపోవడంతో సంక్రాంత్రి కానుకల పంపిణీ చేపట్టారు.
♦ గుంతకల్లు మండలం కసాపురం, గుత్తి మండలంలో నిర్వహించిన జన్మభూమి సభలకు ప్రజలు నుంచి స్పందన కరువైంది. కేవలం అధికారుల ఉపన్యాసాలు, ఆటపాటలు, పింఛన్ల పంపిణీతో మమ అనిపించారు. గుత్తి పట్టణం ఒకటవ వార్డులో నిర్వహించిన జన్మభూమిలో సమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. గత జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు నేటికీ పరిష్కరించలేదని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని సభలు నిర్వహిస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు
♦ హిందూపురం నియోజకవర్గం పరిధిలో హిందూపురం అర్బన్‌లో నిర్వహించిన జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. చిలమత్తూరులో జరిగిన సభలో చెరువులకు నీళ్లు ఇవ్వాలని అధికారులను రైతులు నిలదీశారు.
♦ కదిరి నియోజకవర్గంలోనూ సభలు మొక్కుబడిగా సాగాయి. అధికారికంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. కదిరి పట్టణం ఒకటవ వార్డు జన్మభూమిలోనూ, కదిరి మండలం బూరుగుపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. అర్హులైన ఎంతోమందికి పింఛన్‌లు ఇవ్వడం లేదంటూ తలుపుల మండలం ఉదమలకుర్తి గ్రామసభలో అధికారులను ప్రజలు నిలదీశారు. తనకల్లు మండలం డీసీ పల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో తమకు పింఛన్ రాలేదని పెద్దన్న.. అంజినమ్మ, వెంకటరమణలు రేషన్ కార్డు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు మంజూరు చేయడం లేదని తిరుపాల్, ఆదిలక్ష్మి, పుల్లయ్య, సుజాతతో పాటు పలువురు అధికారులపై మండిపడ్డారు.
♦ కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గూబనపల్లి, దొడగట్ట, మండల పరిధిలోని గోళ్ల గ్రామాలతో పాటు శెట్టూరు, కంబదూరు మండలాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీశారు. గూబనపల్లిలో కొన్నేళ్లుగా శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గత జన్మభూమిలో విన్నవించినా నేటికీ స్థలం చూపలేదని గంట పాటు సభను అడ్డుకున్నారు. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామసభలో రైతుల సమస్యలపై అధికారులను వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు.
♦ రాప్తాడు నియోజకవర్గంలో జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. అధికారులు, స్థానిక ప్రజాప్రతిని«ధులు మాత్రమే హాజరయ్యారు. పింఛన్ తీసుకునేందుకు వచ్చిన పింఛన్‌దారులను గ్రామసభల్లో కూర్చోబెట్టుకొని కార్యక్రమాన్ని కొనసాగించారు.
మీ అల్లుడు షాడో ఎమ్మెల్యే
అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీ అల్లుడు శశిభూషణ్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. మునిమడుగు సమీపంలోని సర్వే నంబర్ 699–20లో 28 సెంట్ల స్థలాన్ని గ్రామానికి చెందిన ఎఫ్‌పీ షాపు డీలర్ ఆంజనేయులు కబ్జా చేసి తన భార్య కోనమ్మ పేరిట 1బీ, అడంగల్ చేయించుకున్నాడు. ఈ వ్యవహారానికంతటికీ కారణమైన మీ అల్లునిపై చర్యలు తీసుకోగలరా?– పెనుకొండ మండలం మునిమడుగులోఎమ్మెల్యే పార్థసారథిని నిలదీసిన టీడీపీ కార్యకర్త వెంకటేష్
Comments
Please login to add a commentAdd a comment