ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముత్యాన లక్ష్మి
పశ్చిమగోదావరి, ఆకివీడు: ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని మహిళలు, బాధితులు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజును చుట్టుముట్టారు. జన్మభూమి సభ ముగిసిన తర్వాత వెళ్లిపోతున్న ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించేందుకు జనం చుట్టుముట్టి, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, డ్వాక్రా రుణమాఫీ, ఉపాధి హామీ కూలి డబ్బులు అందలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరిస్తానని, ఇళ్ల çస్థలాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పి పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే చల్లగా జారుకున్నారు. ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు కేటాయింపులో అవకతవకలు జరిగాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు.
మహిళలు, స్థానిక యువకులు నిలబడి ఇళ్ల పట్టాలు అనర్హులకు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేయడంతో సభ రసాభాసగా మారింది. ఎంపీడీఓ ఎంఎస్ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఇళ్ల స్థలాల మంజూరు, పట్టాల పంపిణీపై తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతుండగా గ్రామ మహిళ ముత్యాన లక్ష్మి, బేతాళ్ల మార్తమ్మ, సంతకాని శారమ్మ తదితరులు పట్టాలు అనర్హులకు ఇస్తున్నారని, ఏళ్ల తరబడి దరఖాస్తులు చేసుకున్నా తమకు అన్యాయం చేశారని వాపోయారు. అద్దెలు కట్టుకుని జీవించలేకపోతున్నామని, ఎన్నాళ్లు అద్దె ఇళ్లలో నివసించాలని నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తమ గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమిని పంపిణీ చేయడానికి పదేళ్లు పట్టిందన్నారు. అయితే పదేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు భూమి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెవెన్యూ అధికారులు అండార్స్‌మెంట్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా అనర్హులకు పట్టాలిస్తున్నారని దుయ్యబట్టారు.
ఉపాధి కూలీల గోడు
ఉపాధి హామీ పనులు చేసినా కూలి డబ్బులు ఇవ్వడంలేదని, ఏడాదిగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయతీ చెరువు తవ్వించుకుని కూలి సొమ్ము చెల్లించలేదని మరికొంత మంది మహిళలు ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం సభకు హాజరైన ఎమ్మెల్యే వీవీ శివరామరాజు మాట్లాడుతూ ప్రస్తుతం స్థలం ఉన్న ప్రాంతంలో అర్హులకు పట్టాలిస్తామని, మిగిలిన వారికి భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. సభలో ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, జెడ్పీ వైస్ చైర్మన్ మన్నే లలితాదేవి, ఎంపీపీ పి.వాణి, వడ్డి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment