తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలో ఎక్సైజ్ మంత్రి జవహర్‌ను నిలదీస్తున్న ఎస్సీప్రాంత వాసులు
జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి మొదటిరోజే నిరసనలు ఎదురయ్యాయి. చాలాచోట్ల జనం లేక సభలు బోసిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీశారు. అధికార పార్టీ నేతలు కూడా నిరసన తెలిపే పరిస్థితి చాలాచోట్ల కనపడింది. పింఛన్లు ఇవ్వకుండా సభకు రప్పించి చివరివరకూ కూర్చోపెట్టడం పట్ల వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో మేం ఏం పాపం చేశామని ఎస్సీ ఏరియాలో రోడ్లు వేయడం లేదని మంత్రి కేఎస్ జవహర్‌ను గ్రామస్తులు నిలదీశారు. ప్రతి జన్మభూమి కార్యక్రమంలో చెబుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
♦ పెరవలి మండలం అజ్జరం గ్రామంలో కొండా శ్రీలక్ష్మి అనే మహిళా డ్వాక్రా రుణమాఫీ జరగలేదని, వడ్డీలేని రుణాలు సక్రమంగా ఇవ్వడంలేదని అధికారులను ప్రశ్నించింది. పసుపు, కుంకుమ కింద ప్రతి సభ్యురాలికి రూ.10 వేలు ప్రభుత్వం ఇస్తోందని అధికారులు, అధికారపార్టీ నేతలు సర్దిచెప్పే యత్నం చేశారు.
♦ గ్రామంలోని సమస్యలపై స్పందించని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకని పెదకాపవరం ఎంíపీటీసీ సభ్యుడు మందలంక జాన్‌వెస్లీ నిలదీశారు. గ్రామంలోనూ, శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు బిందెలతోనూ, క్యాన్‌లతోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవలసి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన మాజీ సర్పంచ్ లంబాడ మురళీ వెంకటలక్ష్మిని పిలవలేదని ఆమె వేదిక పైకి వెళ్లలేదు.
♦ తాడేపల్లిగూడెంలో 1, 2, 3, 4, 5 వార్డులలో ప్రజలు స్థానిక సమస్యలపై నిలదీశారు. వీకర్స్‌కాలనీలో జరిగిన సభలో అగ్రిగోల్డ్ బాధితురాలు కె.జయసుధ తాను ఏజెంట్‌గానేకాకుండా సొంత సొమ్ములు లక్షలాది రూపాయలు నష్టపోయానని, జన్మభూమి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అభ్యర్థించారు. దీనిపై ఆ మహిళకు, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌కు మధ్య చాలా సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. జగ్గన్నపేటగ్రామ పంచాయితీలో జరిగిన సభలో తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని చెప్పుకుంటున్నారని, ఎక్కడ, ఎవరికి చేశారో చెప్పాలని జెడ్పీ చైర్మన్ బాపిరాజును స్థానికులు నిలదీశారు.
♦ కామవరపుకోట మండలం ఉప్పలపాడు, రామన్నపాలెం పంచాయతీ పరిధిలో జన్మభూమి కమిటీ సభ్యులే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును వీరు తప్పు పట్టారు. పంచాయతీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్లకు సంబంధించి 67 మంది లబ్ధిదారులకు రూ.1.34 కోట్లు మంజూరు చేసినట్లు సభలో పేపర్లు పంచడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అధికారులను ప్రశ్నించారు. నాలుగేళ్లుగా 15 మందికి కూడా రుణాలు మంజూరు చేయలేదని జన్మభూమి కమిటీ సభ్యులు చవల శ్రీనివాసరావు, ఉప్పలపాటి రాధాకృష్ణ పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సబ్సిడీ లోన్లు మంజూరైనట్లు చెబుతున్నా, బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పంచాయతీ పరిధిలో అర్హులైన వారికి రేషన్‌కార్డులు మంజూరు, చంద్రన్న పెళ్లికానుక కూడా ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు.
♦ నిడదవోలు పట్టణం 7వ వార్డు విద్యానగర్‌లో జన్మభూమి సభల పేరుతో పింఛన్ ఇవ్వడానికి సిబ్బంది లేకపోవడంతో రాత్రి వరకూ వృద్ధులు వేచి ఉండాల్సి వచ్చింది.
♦ పాలకొల్లు మండలం తిల్లపూడిలో తాము పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకూ మంజూరు కాలేదంటూ వృద్ధులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని నిలదీశారు.
♦ పాలకొల్లు ఒకటో వార్డు సభలో ఇళ్లు కేటాయించిన వారు నెలకు మూడు వేల రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ యడ్ల తాతాజీ ప్రశ్నించడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
♦ బుట్టాయగూడెం, కొమ్ముగూడెంలో జరిగిన సభలలో గిరిజనేతర పేదలు, మహిళలు అధికారులను నిలదీశారు. అయ్యా.. మేము ఓట్లు వేయడానికేనా? మా సమస్యలు ఎవ్వరూ పరిష్కరించరా అంటూ ప్రశ్నించారు.
బడిపిల్లలతో పని!
నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో జరిగిన జన్మభూమి మాఊరు కార్యక్రమం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారి, ఈఓపీఆర్డీ ఇ.లక్ష్మికాంతం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వినతులు అందజేసేందుకు వచ్చిన గ్రామస్తులకు పాఠశాల విద్యార్థులతో టీ, తాగునీరు పంపిణీ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఎ.ఆంజనేయులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment