మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే బడేటి బుజ్జి
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: నాలుగున్నరేళ్లుగా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ప్రశ్ని స్తున్నారు. ప్రజలు ప్రశ్నించడాన్ని సహిం చలేని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జన్మభూమి రెండోరోజు బెదిరింపులకు దిగారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏం తమాషా చేస్తున్నావా
‘ఏం తమాషా చేస్తున్నావా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తవా జీవితంలో రూపాయి లబ్ధి రాకుండా చేస్తా... ఏమనుకున్నావు? అంటూ ఓ మహిళపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక 28వ డివిజన్ అశోక వర్ధన పాఠశాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఓ మహిళ మైక్ తీసుకొని ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయలేదని, పావలా వడ్డీకి డ్వాక్రా రుణాలు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఎమ్మెల్యే నువ్వు ఆగు ఇంకా అనడంతో ఒక్కసారిగా స్థానిక కార్పొరేటర్ ఆ మహిళ వద్ద నుంచి మైక్ లాక్కున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్య చెప్పుకుంటే డబ్బు వస్తుంది. నువ్వు వైఎస్సార్ సీపీ కార్యకర్తలా అరిస్తే, జీవితంలో రూపాయి రాకుండా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏ ఆగు నీకు మైక్ ఇచ్చింది.. సమస్యలు చెప్పుకోవడానికి మీటింగ్‌లు చెప్పడానికి కాదు’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. పావలా వడ్డీకి రుణాలు అందడం లేదని చెబుతున్నా వినకుండా ఆగ్రహించడం సరికాదని ఆ మహిళ చెబుతుండగా టీడీపీ నేతలు ఆమెను పక్కకు తీసుకువెళ్లి బుజ్జిగించారు.
ప్రశ్నిస్తే అరెస్టులే...
చాగల్లు మండలంలో ఊనగట్లలోనూ మంత్రి జవహర్‌ను సమస్యలపై ప్రశ్నిం చిన మట్టా శివ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మీ సమస్యలు తెలపండి అని అడగడంతో గ్రామానికి చెత్త ట్రాక్టర్ రావటం లేదని, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, డ్రెయినేజీ వ్యవస్థ బాగో లేదని మట్టా శివ మంత్రి జవహర్‌కి వివరించారు. ఈ సమస్యలపై 1100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని జవహర్ చెప్పడంతో వెంటనే శివ తన ఫోన్ నుంచి 1100కు ఫోన్ చేసి ఫోన్ కలవడం లేదని మంత్రికి చెప్పాడు. దీంతో మంత్రి ఆగ్రహించారు. శివను పోలీసులు అదుపులోకి తీసుకుని చాగల్లు పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు.
జనాలు కరువు
జిల్లావ్యాప్తంగా జన్మభూమి సభలు ప్రజాప్రతినిధుల ప్రసంగాలకే పరిమితమయ్యాయి. ప్రజల నుంచి అర్జీల స్వీకరణ మినహా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి అందించడం లేదు. నిడదవోలులో సభకు జనాలు రాకపోవడంతో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళా శాల విద్యార్థులను సభకు తరలించి, వారిని ముందు వరుసలో కూర్చొబెట్టి సభను మమ అనిపించారు. వచ్చిన కొద్దిపాటి జనం కూడా మధ్యలోనే విసుగు చెంది వెళ్లిపోయారు. వారిని బతిమలాడి కూర్చో బెట్టడానికి టీడీపీ నేతలు అవస్థలు పడ్డారు.
గ్రామసభను అడ్డుకున్న టీడీపీ నాయకులు
అధికార పార్టీలోని విభేదాలు జన్మభూమి గ్రామసభను అడ్డుకొనే వరకూ వచ్చాయి. భీమోలులో టీడీపీ మండల అధ్యక్షుడు మేణ్ణి సుధాకర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటూ తమలో మాకు తగాదాలు పెడుతున్నారని టీడీపీ యూత్ మండల అధ్యక్షుడు బెజవాడ మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు, ఇంటి పట్టాలకు గ్రామ పెద్దలు పెట్టిన జాబితాలు బయట పెట్టాలని, అప్పటి వరకూ గ్రామసభను జరగనివ్వబోమని పట్టుబట్టారు. తొక్కిరెడ్డిగూడెం, భీమోలు గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీలు చెప్పిన వారికి ఇళ్లు కేటాయించకుండా ఇంటికి రూ.10వేల నుంచి రూ. 20వేల వరకూ తీసుకుని కేటాయించారని మేణ్ణి సుధాకర్‌పై ఫిర్యాదు చేశారు.
అల్లరి చేయడానికి వచ్చారా!ఆగ్రహించిన ఎమ్మెల్యే శివ
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గరగపర్రు గ్రామాల్లో జరిగిన జన్మభూమి సభల్లో ప్రజలు ఎమ్మెల్యే శివను ఐదేళ్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. ఇళ్లస్థలాల కోసం ప్రశ్నించిన వారితో ఎమ్మెల్యే పండగ వెళ్లాక చూద్దాం అంటూ చెప్పడంతో ఎన్ని పండగలు వెళ్లాయంటూ వారు నిలదీయడంతో అల్లరి చేయడానికి వచ్చారా అంటూ ఎమ్మెల్యే శివ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేత ఇంటి ముంగిట జన్మభూమి
పాలకొల్లు గవరపేటలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభ టీడీపీ నేత ఇంటి ముంగిట్లో నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆ టీడీపీ నేతకు వ్యతిరేకంగా ఉన్న గ్రామస్తులు, అలాగే వైఎస్సార్ సీపీ శ్రేణులు సభను బహిష్కరించారు. తాజా మాజీ సర్పంచ్ యల్లపు వెంకటరమణ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
జనం కోసం లక్కీడిప్
పాలకొల్లు మండలంలో గ్రామ సభలకు జనం రాకపోవడంతో జనాలను రప్పించేందుకు తహసీల్దార్ దాసి రాజు జన్మభూమి లక్కీడిప్ అంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లక్కీడిప్ తీసి అందులో వచ్చిన నంబర్‌కి చీరలు బహూకరిస్తున్నారు. రోజూ ఐదుసార్లు లక్కీడిప్ తీసి ఐదు చీరలు పంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment