
సాక్షి, విశాఖపట్నం: దళితులపై టీడీపీ ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రజాసమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి - మా ఊరు సభల్లో దళితులకు అడగడుగునా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దళిత నాయకుడికి జన్మభూమి సభలో తీవ్ర అవమానం ఎదురయింది. గోలుగుండ మండలం జోగంపేట జన్మభూమి సభలో స్థానిక ఎంపీటీసీ నూకరత్నంకు చేదు అనుభవం చోటుచేసుకుంది.
కక్ష సాధింపుల్లో భాగంగా స్థానిక దళితులను పిలవకుండానే సభను నిర్వహించడం పట్ల నూకరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమైనందునే తమను జన్మభూమి సభకు ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుల వివక్ష ఎందుకని అధికారులను ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించకుండా సభను నిర్వహించిన అధికారులపైన, మండల నాయకులపైన స్థానిక మంత్రికి, కలెక్టర్‌కు పిర్యాదు చేస్తానని నూకరత్నం తెలిపారు.