సుండుపల్లె మండలంలోని మడితాడు గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే మేడాను నిలదీస్తున్న వడ్డేపల్లి గ్రామస్తులు
కడప అగ్రికల్చరల్ : జిల్లాలో రెండవరోజు గురువారం నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమం నిరసనల మధ్య ముగిసింది. ఐదు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదని....మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సభలు నిర్వహిస్తారని అటు టీడీపీ నాయకులను, ఇటు అధికారులను ప్రజలు నిలదీశారు. అధికారులు చాలాచోట్ల సమాధానాలు చెప్పలేకపోయారు. జిల్లాలో నిర్వహించిన అన్ని సభల్లో నిరసనలు, నిలదీతలు కనిపించాయి. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం కొండ్రెడ్డిగారిపల్లెలో సీసీ రోడ్డుకు శిలాఫలకం ఆవిష్కరించడానికి వచ్చిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీసీరోడ్లు, తాగునీరు, వీధిలైట్లు తదితర సమస్యలు నాలుగేళ్లుగా పరిష్కారం కాలేదని, ఇప్పుడొచ్చి ఏం చేస్తారని నిలదీశారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల అగ్రహారంలో తాగునీటి విషయమై గ్రామసభను ప్రజలు అడ్డుకున్నారు. పెన్షన్లు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం లక్ష్మిపేట, సీతాపురంలలోనిర్వహించిన కార్యక్రమంలో రుణమాఫీ కాలేదని రైతులు అధికారులను నిలదీశారు.
తువ్వపల్లె సభలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, టీడీపీ నాయకులు కుర్చీలో కూర్చోగా, అధికారులు కింద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం ఉరుటూరులో సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, గ్రామస్తులు నిలదీశారు. చెన్నూరు మండలం కొండపేటలో నిర్వహించిన గ్రామసభలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన గొప్పలను చెబుతుండగా, ఎంపీటీసీ సభ్యుడు కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి కల్పించుకుని ఈ వృద్ధుడికి పింఛన్ ఇప్పటికీ రాలేదని ప్రశ్నించారు. ప్రజలందరూ అర్హులకు పింఛన్లు ఇవ్వలేదని నిలదీయడంతో మిన్నకుండిపోయారు. బద్వేలులో పోలీసు బందోబస్తు మ«ధ్య జన్మభూమి సభలు జరిగాయి. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లె సభను ప్రజలు బహిష్కరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని డివిజన్లలో నిర్వహించిన సభల్లో కాలువల్లో పూడికతీత విషయమై మహిళలు అటు చైర్మన్‌ను, ఇటు కమిషనర్‌లను నిలదీశారు.జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు వేర్వేరు గ్రామసభల్లో పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లేలలో వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులు సమస్యలను పరిష్కరించలేదని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment