‘చేసేది గోరంత... చెప్పుకునేది కొండంత’ అన్నట్లుగా టీడీపీ సర్కార్ వైఖరి కన్పిస్తోంది. ప్రచారానికి... కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రతి చర్యలను అనువుగా మలుచుకుంటున్నారు. తుదకు వృద్ధులను సైతం వదిలిపెట్టడం లేదు. సీఎం చంద్రబాబు ఫొటోతో ముద్రించిన స్టిక్కర్ మీ ఇంటి తలుపు ఉండాల్సిందే! లేదంటే పెన్షన్ కట్ అంటూ బలవంతంగా అప్పగిస్తున్నారు. జన్మభూమి కార్యక్రమంలో పెన్షన్‌దారులకు ప్రచార స్టిక్కర్లు అందజేస్తున్నారు. ఏవరైనా వద్దంటే మీ ఇష్టం... మీకు పెన్షన్ సక్రమంగా అందాలంటే, జాబితా నుంచి మిమ్మల్ని తొలగించకూడదంటే ఇంటికి తగిలించుకోండని సుతిమెత్తని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి కడప : జన్మభూమి కార్యక్రమానికి ప్రజాదరణ కొరవడింది. టీడీపీ కార్యకర్తలు మినహా ప్రజానీకం హాజరు కావడం లేదు. గ్రామాల్లో, పట్టణ వార్డుల్లో అర్హులైన పెన్షనర్లు మాత్రం తప్పకుండా హాజరవుతున్నారు. అందుకు కారణం జమ్మభూమిలో పెన్షన్ డబ్బులు ఇస్తుండడమే. జన్మభూమి ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రచారం చేసుకోవాలని తలిస్తే ఆశించిన మేరకు ప్రజలు హాజరు కావడం లేదు. ఈక్రమంలో వృద్ధుల ద్వారా ప్రచారం చేసుకోవాలనే తలంపు ఏర్పడింది. సీఎం చంద్రబాబు ఫొటోతో ముద్రించిన ‘మా ఇంటి పెద్దకొడుకుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు’ అన్న స్టిక్కర్ అందిస్తున్నారు.
ఇదెందుకని ఎవరైనా ప్రశ్నిస్తే మీ ఇంటి తలుపుకు ఈ స్టిక్కర్ ఉంటేనే తర్వాత నెల పింఛన్ వస్తుందని అధికారులు బదులిస్తుండడం విశేషం. జిల్లాలో 2,84,685 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీరందరి ఇళ్లకు జన్మభూమిలో సీఎం ఫోటోతో ముద్రించిన స్టిక్కర్ ఉండాలంటూ హుకుం ప్రదర్శిస్తున్నారు. ఇదే విషయమై సాక్షి ప్రతినిధి పలువురు వృద్ధాప్య పింఛనుదారులతో ప్రశ్నిస్తే ‘మొన్నటిదాకా జన్మభూమి కమిటీ పేరుతో వేధించారు, వాళ్లు కడుపుకాళ్లు పట్టుకొని పింఛన్ తొలగించకుండా చూసుకున్నాం. ఇప్పుడేమో మీ ఇంటి గుమ్మానికి ఈ ఫోటో లేకుంటే మా పెన్షన్ తీసేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోన్నారని’ పలువురు పెన్షన్‌దారులు వాపోయారు. మాఇట్లా మాట్లాడినట్లు చెప్పోద్దు నాయనా...ఆ దుర్మార్గులు ఇంకెన్నాళ్లుంటారో... అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని వృద్దులు మండిపడడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment