రాజానగరం మండలం కొండగుంటూరు జన్మభూమి సభలో పాల్గొన్న నన్నయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ రామకృష్ణారావు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ‘ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం విద్యార్థుల్ని వాడుకోండి. జన్మభూమి కార్యక్రమం జరిగేంతవరకు వారినిగ్రామాలకు పంపించండి. బృందాలుగా విభజన చేసి ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయించడమే కాకుండా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయించండి’ కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాలివీ....
ఇప్పుడా ఆదేశాల ఆధారంగా నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. యూనివర్సిటీ పరిధిలోని ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులందర్నీ జన్మభూమి అయిపోయేంతవరకు గ్రామాల్లోకి పంపించి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించాలని లిఖిత పూర్వక ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించారు. ఇంకేముంది నన్నయ యూనివర్సిటీ పరిధిలోని 450 కళాశాలలకు వైస్ చాన్సలర్ తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలల్లో ఉన్న ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల్ని తప్పనిసరిగా జన్మభూమి కార్యక్రమానికి పంపించండని ఆదేశించారు. ప్రస్తుతం కళాశాల యాజమాన్యాలు అదే పనిలో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులందర్నీ జన్మభూమికి పంపించే పనిలో పడ్డారు. అధికార పార్టీకి ఉపయోగపడే ప్రచారంలో తమల్ని భాగస్వామ్యం చేయడమేంటని విద్యార్థులు మదనపడుతున్నారు. ఒక్క ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల్నే కాదు వైస్ చాన్సలర్, ప్రొఫెసర్లు, అధ్యాపకులు కూడా భాగస్వామ్యం కావాలని ఆదేశించడంతో జన్మభూమి ముగిసేవరకు వారంతా గ్రామాల్లో ఉండాల్సిందే. అధికారికంగా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం, దాని ఆధారంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం, ఆమేరకు కళాశాలలకు వైస్ చాన్సలర్ ఆదేశాలివ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
నన్నయ యూనివర్సిటీ పరిధిలోఇలా చేయాలట...!
నన్నయ యూనివర్సిటీ పరిధిలో 450 కళాశాలలున్నాయి. కళాశాలకు ఒక యూనిట్ చొప్పున 120 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులుంటారు. వారిలో 60 మందిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి కళాశాల దత్తత గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయాలట. మిగతా 60 మందిని 12 యూనిట్లుగా విభజించి యూనిట్‌కు ఐదుగురు చొప్పున విద్యార్థుల్ని నియమించి, వారికొక ఉపాధ్యాయుడ్ని అప్పగించి, మండలమంతా ప్రచారం చేయాలి. ఇప్పడదే పనిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు నిమగ్నమయ్యారు.
రెండో రోజూ నిరసన సెగ...
ఆరో విడత జన్మభూమి రెండో రోజు కార్యక్రమాలకూ నిరసన సెగ తగిలింది. జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున అధికారులను, ప్రజా ప్రతినిధులను నిలదీశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదని, గ్రామాలకు రావడమెందుకని నిరసనలు తెలియజేశారు. కొన్నిచోట్ల ఏకంగా గ్రామసభలను బహిష్కరించారు. దీంతో పలుచోట్ల జన్మభూమి సభలు రసాభాసగా మారాయి.
అమలాపురంలో...
ఉప్పలగుప్తం మండలం నంగవరం జన్మభూమి గ్రామసభలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలుగుదేశం నాయకులు చెప్పారు. దీనిపై గ్రామసభకు హాజరైన మాజీ సర్పంచి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇందలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి కేవలం 10 శాతం నిధులు మాత్రమేని, మిగిలినవి కేంద్ర ప్రభుత్వ నిధులంటూ చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గుర్లింక చిన్న వాగ్వివాదానికి దిగి పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఈ పరిణామంతో మాజీ ఎంపీపీ శిరంగు సత్తిరాజు, మాజీ సర్పంచి జున్నూరి వెంకటేశ్వరరావు గ్రామసభను బహిష్కరించారు.
పెద్దాపురంలో...
ప్రభుత్వ సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీ సభ్యులకేనా.. ప్రజలకు కాదా అంటూ పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలోని జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో గ్రామ రైతులు గురువారం అధికారులు, ప్రజా ప్రతినిధులను నిలదీశారు. గ్రామంలో అమలు కావాల్సిన సంక్షేమ పథకాలు ఒక వర్గానికి సంబంధించినవిగా ఉంటున్నాయని, ఏమైనా అడిగితే జన్మభూమి కమిటీల పెత్తనంతో అర్హులకు సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నారంటూ గ్రామ రైతులు మండిపడ్డారు.
కాకినాడరూరల్‌లో
అనర్హులకు ఇళ్ళపట్టాలు ఎలా ఇస్తారని కరప మండలం అరట్లకట్టలో జేడ్పీటీసీ బుంగా సింహాద్రి, ఎంపీపీ బుల్లిపల్లి శ్రీనివాసరావులను గ్రామస్తులు నిలదీశారు. భర్తచనిపోయి ఏడాది అవుతున్నా వింతంతు పింఛన్లు ఇవ్వడంలేదంటూ సమస్యలను ఎకరువు పెట్టారు, గొడ్డటిపాలెం గ్రామసభలో స్థానికులు మాట్లాడుతూ గతంలో ఇళ్ళ స్థల పట్టాలను ఇచ్చినవారికి రద్దు చేసి వేరొకరికి ఇవ్వడంపై నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామసభకు ప్రజలు రాకపోవడంతో పాఠశాల పిల్లలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దీంతో గ్రామసభ వెలవెలబోయింది.
ప్రత్తిపాడులో...
శంఖవరం మండలం అన్నవరంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో సమస్యలు పరిష్కరించడంలేదంటూ గ్రామస్తులునిరసనలు తెలిపారు.
రంపచోడవరంలో...
రహదారి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేవని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని విలీన మండలమైన ఎటపాకలో జన్మభూమి గ్రామభను గ్రామస్తులు బహిష్కరించారు. మోతుగూడెం ఎస్సీకాలనీకి వాటర్ సదుపాయం కల్పించలేదని, శివారు గిరిజన ప్రాంతాలకు సీసీరోడ్లు వేయలేదని, ఉపాధి హామీ పనులు, మరుగుదొడ్లు అసంపూర్తిగా నిలిచిపోవడంపై అధికారులను, ప్రజాప్రతినిధులును గ్రామస్తులు నిలదీశారు. దీంతో సభ రసాభాసగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment