
ట్రాఫిక్ ఐలాండ్ వద్ద కూర్చున్న మేయర్ సుంకర పావని
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ నగర మేయర్ సుంకరి పావనికి అవమానం జరిగిందా? సీఎం పర్యటన సందర్భంగా ఆమె అసంతృప్తికి గురయ్యారా? అంటే అవుననే చెబుతోంది ఈ చిత్రం. జిల్లా పరిషత్ శతవసంతాల పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా జెడ్పీలోకి వెళ్లకుండా ఆమె బయట రోడ్డుపై ట్రాఫిక్ ఐలాండ్‌పై కూర్చొనడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మేయర్‌కు అవమానం
జెడ్పీ వ్యవహారం పక్కన పెడితే జన్మభూమి గ్రామసభలో మేయర్ పావనికి అవమానం ఎదురైంది. సభ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రులతో పాటు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ ఫొటోలు పెట్టారు కానీ మేయర్ సుంకర పావని ఫొటో పెట్టలేదు. వాస్తవానికి సభ జరిగిన ప్రాంతం కార్పొరేషన్ పరిధిలోనిదే. ఈ లెక్కన చూస్తే నగర ప్రథమ మహిళగా మేయర్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత స్థానిక కార్పొరేటర్‌కు ఇవ్వాలి. వారిద్దరి ఫొటోలను ఫ్లెక్సీలో పెట్టలేదు. దీనివెనక నియోజకవర్గ కీలక నేత హస్తం ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.
ఇప్పటికే కార్పొరేషన్‌లో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నీ తానై వ్యవహరించి, ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే తన మాటే నెగ్గించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన జన్మభూమి గ్రామసభ వేదిక ఫ్లెక్సీలో మేయర్ పావని ఫొటో కన్పించకపోవడం మరింత అనుమానాలకు తావిచ్చింది. దీని వెనక ఎమ్మెల్యే హస్తం ఉందా? లేకుంటే అధికారులు ఉద్దేశపూర్వకంగా ఫొటో లేకుండా చేశారా? అన్నది తెలియాలి. విశేషమేమిటంటే సీఎం పర్యటనకు ఆద్యంతం నగరకార్పొరేషన్ సిబ్బంది సేవలే వినియోగించారు. ఇలాగైనా మేయర్ ఫొటో తప్పనిసరిగా ఫ్లెక్సీలో ఉండాలి. కారణమేంటో తెలియదుగానీ జెడ్పీలో జరిగిన సీఎం కార్యక్రమానికి మేయర్ వెళ్లకుండా బయటే ఉండిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment