జన్మభూమిలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రభుత్వ ఉపాధ్యాయులను వినియోగించడం విమర్శలకు తావిస్తోంది. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ‘సామాజిక స్పృహ’ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంవత్సరం కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకొచ్చి ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా జన్మభూమి–మా ఊరు నిర్వహిస్తోంది. చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిర్వహించిన తొలి జన్మభూమి కార్యక్రమంలోనే సమస్యల పరిష్కారానికి ప్రజలు నిలదీశారు. పలుచోట్ల జన్మభూమి సభలను సైతం బహిష్కరించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి ప్రశ్నించే వారిపై కఠినంగా వ్యవహరించింది. ఆ తర్వాత నుంచి జన్మభూమి సభల్లో పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యాన్ని అనధికారికంగా తప్పనిసరి చేసిందనే విమర్శలు తల్లిదండ్రులనుంచి వినిపిస్తోంది.
గతానికి భిన్నంగా
జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్థ్ధిష్టమైన నిబంధనలు విధించింది. ఆయా సమీప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో కమిటీలు వేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రచారం, మూఢ నమ్మకాలపై గ్రామీణులకు అవగాహన పేరుతో విద్యార్థులతో నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించే బాధ్యతలను అప్పగించింది. వీరితో పాటు సమీప ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులను వలంటీర్ల పేరుతో నియమించింది. ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను సైతం జనవరి 8 నుంచి 12వ తేదీకి వాయిదా వేసింది. విద్యా సంవత్సరం కీలక దశలో ఉంది. గురువారం నుంచి జిల్లా అంతటా ఫార్మేటివ్–3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులకు ఈ అదనపు బాధ్యతలు, విధుల వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
జన్మభూమిలో ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేయడం వల్ల వారి విలువైన బోధనా సమయం కోల్పోతారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను మినహాయించాలి. దీన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.– డీవీ రాఘవులు,జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్.
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడమే
జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి ఉపాధ్యాయులు వ్యతిరేకం కాదు. జన్మభూమిలో విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించే ఏడో తేదీ ఒక రోజు పాల్గొనడానికి అభ్యంతరం లేదు. ప్రతి రోజు ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడమంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే.– కవి శేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్‌టీయూ
Comments
Please login to add a commentAdd a comment