కాకినాడ జేఎన్‌టీయు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో జనం వెళ్ళిపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సీఎం చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం పేలవంగా ముగిసింది. కాకినాడ జేఎన్టీయూ మైదానంలో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో బాబు చెప్పిందే చెప్పి విసుగు తెప్పించడంతో ప్రసంగం అవుతుండగానే జనం జారిపోవడం ప్రారంభించారు. మరోవైపు అంతా తానై వ్యవహరించి వేదికపై మరొకరికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. స్థానిక కార్పొరేటర్‌కు, మేయర్‌కు, ఎమ్మెల్యేకు, మంత్రులకు ఏ ఒక్కరికీ ప్రాధాన్యత కల్పించలేదు. చంద్రబాబే సుదీర్ఘంగా ప్రసంగం చేయడంతో వచ్చిన జనం లేవడం ప్రారంభించారు. కుర్చీలన్నీ ఖాళీ అయిపోవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. వెళ్లిపోతున్న జనాన్ని ఆపేందుకు గేట్లు మూసి, నిలువరించేందుకు యత్నించినా ఫలించలేదు.
ఆద్యంతం భజనే...
సభా ప్రారంభం దగ్గరి నుంచి సీఎంను పొగడ్తలతో ముంచెత్తించారు. ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరిని రప్పించుకుని పొగిడించుకున్నారు. అంతటితోఆగకుండా మళ్లీ మీరే సీఎం కావాలని అనిపించారు. గత జన్మభూమిలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదనో మరేంటో తెలియదు గాని కాకినాడలో జరిగిన ఆరో విడత జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులనే తన ఘనతగా చెప్పుకుని, మరింత అభివృద్ధి చేస్తానని చెప్పుకున్నారు.
జనాలను నిలబెట్టేందుకు అధికారుల హైరానా
సీఎం హాజరైన జన్మభూమి గ్రామ సభకు అధికారులు ఆపసోపాలు పడి జన సమీకరణ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. డ్వాక్రా, ఐసీడీఎస్, ఆశా, సాధికార మిత్ర కార్యకర్తలకు లక్ష్యాలు నిర్ధేశించి జనాన్ని తీసుకొచ్చారు. కళాశాలల యాజమాన్యాలకు చెప్పి వందల సంఖ్యలో విద్యార్థుల్ని అతి కష్టం మీద రప్పించి సీఎం వచ్చేంతవరకూ నిలబెట్టారు. సీఎం పర్యటన ఆలస్యం కావడంతో జనాలను నిలువరించడం అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. ఉదయం 11.20 గంటలకు ప్రారంభం కావల్సిన జన్మభూమి గ్రామసభ మధ్యాహ్నం 1.05 వరకు సీఎం రాకపోవడంతో ప్రారంభం కాలేదు. ఆ తర్వాత సీఎం వచ్చారనేసరికి ఆయన ప్రసంగం వినలేక జనం వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీ అయిపోయాయి.
కలెక్టర్‌కు షాకిచ్చేందుకు నేతల వ్యూహాత్మక వైఖరా...
సీఎం సభ విజయవంతానికి టీడీపీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అంతా తానై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రభుత్వ నిధులే ఖర్చు పెడుతున్నప్పుడు వ్యక్తిగతంగా తాము సొమ్ము ఖర్చు పెట్టి జనాన్ని తీసుకురావడమెందుకని వదిలేయడంతో అనుకున్నంతగా సీఎం సభకు జన సమీకరణ జరగలేదు. వచ్చిన వారు కూడా సగంలోనే వెళ్లిపోవడంతో వెలవెలబోయింది. అధికారులపై ఆధారపడితే ఎలాఅని...జన సమీకరణలో నేతలు చొరవచూపించాలి కదా అని సీఎం మందలించినట్టు తెలిసింది.
బయటపడిన షాడోల నీడ...
సీఎం ఎదురుగా ఒక మహిళ మాట్లాడుతూ తనకు ఇల్లు మంజూరైందని, ఆ ఇల్లు ఎమ్మెల్యే వనమాడి సత్యనారాయణ ఇచ్చారని సభా వేదికగా చెప్పడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వనమాడి కొండబాబు సోదరుడు సత్యనారాయణ ప్రభుత్వ పథకాల్లో విపరీత జోక్యం చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఎం ఎదుటే కొండబాబు బదులు ఎమ్మెల్యే సత్యనారాయణ అని చెప్పడం ఆ వాదనలకు బహిరంగ సభ వేదికగా బలం చేకూర్చినట్టయిందని అంతా చర్చించుకున్నారు. అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్న సమయంలో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి బదులు ఆమె భర్త సత్తిబాబు పేరుతో ముందుగా ఆహ్వానం పలికారు. కాసేపటికి తప్పు తెలుసుకుని అనంతలక్ష్మి పేరు చదివారు. సత్తిబాబును ఇదే వేదికపై ముందు వరసలో కూర్చోబెట్టి, సూపర్ ఎమ్మెల్యే వాదనకు బలం చేకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment