ఒంగోలు గోపాల్‌నగర్ గ్రామసభలో పింఛన్ డబ్బులు ఇస్తారా అని ఎదురు చూస్తున్న వృద్ధులు (ఫైల్ )
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో జరుగుతున్న జన్మభూమి గ్రామసభలకు జనం కరువవుతున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతున్నా ప్రజల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. జన్మభూమి ప్రారంభమైన తొలిరోజు పింఛన్‌దారులను, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను యంత్రాంగం తరలించింది. పింఛన్లు ఇప్పిస్తామంటూ చెప్పి ఎమ్మెల్యే సభ ముగిసే వరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను కూర్చోపెట్టారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత రావాలంటూ పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది చెప్పడంతో వారు ఉసూరుమంటూ అక్కడే చతికిలబడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఒంగోలు పీజీ క్యాంపస్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ మహిళా వాలంటీర్లను జన్మభూమి సభకు తరలించారు. దాదాపు 20 మంది మహిళా వాలంటీర్లతోపాటు వారితో కూడా సంబంధిత అ«ధ్యాపకులను జన్మభూమికి గ్రామసభలకు రప్పిస్తున్నారు. శుక్రవారం కబాడీపాలెంలో జరిగిన సభకు హాజరు కావాల్సిన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సభ జనం లేక వెలవెలబోవడం చూసి, పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్టు స్థానికులు తెలిపారు.
ఎక్కడి సమస్యలు అక్కడే..
జన్మభూమి గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తున్నారు. గత ఐదు విడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో తమ సమస్యలను విన్నవించుకున్నప్పటికీ పరిష్కారానికి నోచుకోవడంలేదని యంత్రాంగాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యుడు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు తూర్పార పడుతున్నారు. స్థానిక కమ్మపాలెంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో తమ పార్టీకి ఈ ప్రాంతమంతా గట్టిగా పట్టు ఉండటంతో ఇక్కడ ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌రావు ఒంగోలుకు శాసనసభ్యుడా లేకుంటే కమ్మపాలెంకు శాసనసభ్యుడా అంటూ కొంతమంది గ్రామ సభ జరుగుతున్న సమయంలోనే వ్యాఖ్యానించడం విశేషం.
నాలుగున్నరేళ్లుగా అదేమాట..
ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామంటూ గత నాలుగున్నరేళ్ల నుంచి దామచర్ల చెబుతూనే ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను గెలిపించిన వెంటనే నగర ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీల వర్షం కురిపించారు.అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత కూడా ఇంతవరకు ప్రతిరోజూ తాగునీరు వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి గ్రామసభల్లో కూడా ఎమ్మెల్యే స్వయంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒకటి రెండు నెలల్లో తాగునీటి పైపులైన్ల పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత ప్రతిరోజూ తాగునీరు అందిస్తామంటూ మరోసారి ప్రకటనలు చేయడంపట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ శాసనసభ్యునిగా ఉంటున్న దామచర్ల తాను ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. మరో ఒకటి రెండు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోందని, ఎన్నికల నోటిఫికేషన్‌ను సాకుగా చూపించి తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిరోజూ తాగునీటి సరఫరా వాగ్దానాన్ని తిరిగి తెరపైకి తీసుకువస్తారంటూ కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం.
జన్మభూమి సభను బాయ్‌కాట్ చేసిన టీడీపీ కార్యకర్తలు
పాదర్తి (కొత్తపట్నం): ఎన్ని సార్లు ఎమ్మెల్యేకు చెప్పాలి.. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకోవాలి.. ఎన్ని సార్లు అర్జీలు ఇవ్వాలి.. మాకు ఇదే పనా? ఈ జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో కూడా ఇంతేగా అని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కొత్తపట్నం మండలం పాదర్తిలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామ సభలకు బాయ్‌కాట్ చేశారు. ‘ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చాం. ఎమ్మెల్యే అధికారులతో అనేక సార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు కావస్తోంది, ఇంత వరకు మా సమస్యలు పరిష్కరించలేదు. అధికారులు వచ్చి సభలు జరుపుకుంటే సరిపోతుందా? ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా భూమి ఆన్‌లైన్‌లు, శ్మశానికి బట, నీటి సమస్యలు గత జన్మభూమి–మా ఊరు గ్రామ సభలో అర్జీలు ఇచ్చాం, చర్చించారు. ఇంత వరకు పరిష్కరించ లేదు’ అంఊ పాదర్తి, రంగాయపాలెం గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు గ్రామ సభను బాయ్‌కట్ చేశారు. టీడీపీ పార్టీ పెట్టిన సమావేశాలకు, గ్రామ సభలకు వచ్చేదే లేదని తెగేసి చెప్పారు. టీడీపీ కార్యకర్తలు కలిసి ఒక తోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ సభ అయిపోయిన తరువాత గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. గ్రామస్తుల సహకారంతో గ్రామ సభ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment