కొత్తపట్నం మండలం గుండమాలలోని జన్మభూమి సభలో అధికారులు మాత్రమే ఉన్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రజా సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకంటూ జనం నిలదీతలు.. అధికారుల నిర్బంధాల నడుమ జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఆరో విడత జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో పలు చోట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు మండిపడ్డారు. అర్జీలు పరిష్కారానికి నోచుకోకపోవడంపై విరుచుకుపడ్డారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
తొలిరోజు యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడులో నిర్వహించిన జన్మభూమి– మాఊరు సభలో అధికార పార్టీ కార్యకర్తలు, ప్రజలు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో రెండుగంటల పాటు నిర్బంధించారు. గ్రామంలో చేపట్టిన500 ఇంకుడు గుంతలు, 200 మరుగుదొడ్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదంటూ గ్రామానికి చెందిన
అధికార పార్టీ నాయకులు, గ్రామస్థులు కలిసి జన్మభూమి అధికారులను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. బిల్లులు ఇచ్చేంత వరకు జన్మభూమిని జరగనివ్వమంటూ తేల్చి చెప్పారు. తహశీల్దార్ సుబ్బారావు, ప్రత్యేక అధికారులు నర్సింహారావుతో పాటు మిగిలిన అధికారులను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం ఏపీఓ వచ్చి గ్రామస్థులతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ప్రజలు అధికారులను వదిలి పెట్టారు.
ఉన్న గూడూ పోయింది..
త్రిపురాంతంకం మండలం అన్న సముద్రంలో జరిగిన జన్మభూమిలో ఎమ్మెల్యే డేవిడ్‌రాజును ప్రజలు సమస్యలపై నిలదీశారు. పక్కా గృహం ఇస్తామన్నారని ఉన్న గుడిసెను పీకేసుకుని 8 నెలలుగా రోడ్డున పడ్డానని, అయినా పక్కాగృహం మంజూరు కాలేదని వెంకటమ్మ అనే మహిళ ఎమ్మెల్యే డేవిడ్ రాజును నిలదీసింది. గ్రామానికి స్మశాన స్థలం కేటాయిస్తామని ఏళ్ళ తరబడి చెబుతున్నా ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎమ్మెల్యేను, అధికారులను నిలదీశాడు. భూములకు సంబంధించి ఆన్‌లైన్ అక్రమాలపైనా గ్రామస్థులు అధికారులను నిలదీశారు.
వీధిలైట్ల మాట ఏమైంది?
అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు మండలం పమిడి పాడులో తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. సంతమాగలూరు మండలం మిన్నెకల్లులో గ్రామంలో ఎల్‌ఈడీ దీపాలు బిగిస్తామని గత జన్మభూమిలో హామీ ఇచ్చిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కనీసం వీధిలైట్లు కూడా వేయలేదని అధికారులను నిలదీశారు. జే పంగులూరు మండలం ఆరికట్ల వారిపాలెంలో రేషన్‌కార్డులు ఇవ్వడం లేదంటూ అధికారులను గ్రామస్థులు నిలదీశారు.
గణాంకాలు.. పలు విధాలు..
దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం రజానగరంలో జరిగిన జన్మభూమిలో అధికారులను జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకారెడ్డి నిలదీశారు. ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రభుత్వం చెబుతుందని, వెలుగు ఉద్యోగులతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు చేస్తుంటే ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని ఎలా చెబుతారని ఆయన నిలదీశారు. అధికారులు ప్రజా ప్రతినిధుల ఒకరకంగా సభల్లో చదివేందుకు మరో రకంగా ప్రభుత్వ గణాంకాలు తయారు చేయడంపై ఎంపీపీ దూళ్లపాడటి మోషే అధికారులను నిలదీశారు. నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
♦ గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు మండలం బొల్లుపల్లిలో జరిగిన సభలో తాగునీటి సమస్యతో పాటు రోడ్లలేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులను గ్రామస్తులు నిలదీశారు.
♦ కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం కొత్తపేటలో మూడు నెలలుగా ఉపాధిపనులు లేక ఇబ్బందులు పడుతున్నామని అయినా అధికారులు పనులు కల్పించడం లేదని ప్రజలు నిలదీశారు.
♦ కొండపి నియోజకవర్గం శింగరాయకొండ పాకలలో జరిగిన జన్మభూమి సభలో పాఠశాలల అభివృద్ధి నిధులు ప్రభుత్వం ఇవ్వలేదంటూ యూటీఎఫ్ నాయకుడు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆరు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులను జీతాలు అందడం లేదని చెప్పారు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో డ్రైనేజీలు పూర్తిచేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
♦ ఒంగోలు గోపాల్‌నగర్‌లో జన్మభూమికి ఎమ్మెల్యే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తారంటూ అధికారులు చెప్పడంతో ఉదయం తొమ్మిది గంటలకే మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్యే మధ్యాహ్నం దాటినా రాకపోయే సరికి మహిళలు ఎదుచూస్తూ ఉండిపోయారు. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామంలో జన్మభూమి సభకు స్పందన కొరవడింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ 11 గంటల వరకు గ్రామస్తులు ఎవరూ రాకపోవడంతో అధికారులు ఎదురు చూపులుచూడాల్సి వచ్చింది.
♦ కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం చౌటగోగులపల్లి సభలో అంగన్‌వాడీ సెంటర్ సక్రమంగా నిర్వహించడం లేదని, గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేదనిగ్రామస్తులు అధికారులను నిలదీశారు. మొత్తంగా తొలిరోజు జన్మభూమి మావూరులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజల నుంచి నిరసనలు తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment