ప్రత్తిపాడులో మహిళలు సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోకుండా కాపలా ఉన్న వెలుగు సీసీలు, వీవోఏలు (సర్కిల్స్‌లో ఉన్నది సీసీలు, వీవోఏలు)
సాక్షి, గుంటూరు: ఆరో విడత జన్మభూమి–మా ఊరు చివరి రోజు కార్యక్రమాలు జిల్లాలో రసాభాసగా సాగాయి. స్థానిక సమస్యలపై అధికార పార్టీ నేతలు, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఆఖరి రోజు కావడంతో అధికారులు, అధికార పార్టీ నేతలు సన్మానాలు, రాజకీయ ప్రసంగాలు, ప్రభుత్వ గొప్పలు చెప్పుకోడానికే సభల్లో సమయం కేటాయించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు గ్రామంలో జన్మభూమి సభలను నాయకులు మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలు పెట్టారు. ప్రతిజ్ఙ కూడా చేయకముందే టీడీపీ నాయకులు సన్మానాలు ప్రారంభించారు. దీంతో సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలు నాయకులు, అధికారుల తీరుపై మండిపడ్డారు.
తాడికొండ నియోజకవర్గం తాడికొండ గ్రామంలో టీడీపీ నాయకులు జన్మభూమి సభలో బహిరంగంగా గొడవకు దిగారు. అధికారులు తమ మాట వినడం లేదంటూ జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు వర్గానికి చెందిన ఎడ్డూరి హనుమంతరావు, సభ వేదిక కింద అనుచరులతో బల ప్రదర్శనకు అధికారులను దూషించారు. ఇంతలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి మధుసుదనరావు కలుగజేసుకోవడంతో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు వాగుద్ధానికి దిగి తమను ఇబ్బంది పెట్టడంతో అధికారులు వారి ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికార పార్టీ నాయకులే బహిరంగంగా జన్మభూమి సభల్లో వాగ్వాదానికి దిగడంతో ప్రజలు వారి తీరుపట్ల మండిపడ్డారు. ఈ పరిణామంతో అధికార పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు..
గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోబోమని, ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని నకరికల్లులో నిర్వహించిన జన్మభూమి సభలో రైతులు స్పష్టం చేశారు. గతంలో అద్దంకి–నార్కట్‌పల్లి హైవే విస్తరణలో నిర్వాసితులైన వారికి నేటికీ ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, మళ్లీ ఇప్పుడు భూములు ఇవ్వలేమని అన్నారు. ఆ సమస్యలపై అధికారులను నిలదీస్తూ ప్లకార్డులతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా సత్తెనపల్లి పట్టణంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ 27, 30వ వార్డుల కౌన్సిలర్లు షేక్ నాగూర్‌మీరాన్, ఆకుల స్వరూపాలు బహిష్కరించారు.
నిలదీతలు..
నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులో మట్టిని అక్రమంగా తవ్వుకుని అమ్ముకున్నారు, గ్రామంలో అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని ప్రత్తిపాడు నియోజకవర్గం ఓబులనాయుడుపాలెంలో అధికారులను ప్రజలు నిలదీశారు. అదే విధంగా పెదపలకలూరు గ్రామంలో నిర్వహించిన సభలో సైతం స్థానిక సమస్యలపై అధికారులను ప్రజలు ప్రశ్నించారు. దీంతో ఆయా గ్రామాల్లో సభలు రసాభాసగా సాగా యి. గుంటూరు తూర్పు, పశ్చిమ, మాచర్ల, నరసరావుపేట సహా జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో అధికారులు, అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీశారు. ఐదు జన్మభూముల్లో ఇచ్చిన సమస్యలు బుట్టదాఖలయ్యాయని, ఈ సారైన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అని ప్రశ్నించారు. చివరి రోజు కావడంతో పలు ప్రాంతాల్లో పింఛన్లు, రేషన్ కార్డులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రసంగాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment