రెంటచింతల మండలం పాలవాయిలో జనం లేక వెలవెలబోతున్న గ్రామ సభ
జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నిరసనలు మిన్నంటుతున్నాయి.. గత సభల్లో ఇచ్చిన అర్జీల పరిష్కారానికే ఇప్పటి వరకూ దిక్కులేదు.. మళ్లీ ఎందుకు వచ్చారంటూ గ్రామగ్రామానా అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. సీఎం నివసిస్తున్న ఉండవల్లిలో గురువారం జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి ప్రజలను అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.
సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా జన్మభూమి గ్రామ సభల్లో అధికారులు, అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు, నిలదీతల ఎదురవుతున్నాయి. గత జన్మభూమి సభల్లో ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయని జనాలు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తునారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి, గ్రామ సభల్లో గురువారం ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వెల్లటూరులో స్థానిక సమస్యలు పరిష్కరించండం లేదంటూ జన్మభూమి సభలో ఓ యువకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును నిలదీశాడు. గ్రామంలోని ప్రా«థమిక వైద్యశాలలో సిబ్బంది లేక జనం ఇబ్బందులు పడుతున్నారని సిబ్బందిలేని పీహెచ్‌సీ ఎందుకని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎమ్మెల్యేను యువకుడు నిలదీయడంతో పక్కనే ఉన్న పోలీసులు కలుగజేసుకుని నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడివి సభలో గందరగోళం సృష్టించడానికి వచ్చావని పక్కకు లాక్కెళ్లారు. దీంతో ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుడని ముద్ర వేస్తారా అంటూ యువకుడు పోలీసులు అధికారులపై మండిపడ్డాడు.
నిలదీతలు.. ఎదురీతలు
మాచర్ల మండలం తాళ్లపల్లిలో నిర్వహించిన జన్మభూమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక సమస్యలపై అ«ధికారులను నిలదీశారు. నాలుగున్నరేళ్ల పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమి లేదని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. మాచర్ల పట్టణం 25,26,27 వార్డుల్లోని జన్మభూమి సభల్లో జనం లేక వెలవెలబోయాయి. నరసరావుపేట ప్రకాష్‌నగర్ నిర్వహించిన జన్మభూమి సభలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ ఎం రమణారెడ్డి అధికారులను నిలదీశారు. దరఖాస్తులు బుట్టదాఖలవుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో జన్మభూమి సభలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ గని ప్రజా సమస్యలపై పాలకులు, అధికారులను నిలదీశారు. నకరికల్లు మండలం చేజర్లలో అధికారులపై రైలు మండిపడ్డారు. పంటలకు నీరివ్వడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని ఫిర్యాదు చేశారు.
వాడవాడలా ఆగ్రహం
సత్తెనపల్లి 26వ వార్డు, పాకాలపాడులో జన్మభూమి సభలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకాలపాడు చెరువు అక్రమాలపై విచారణ జరిపించాలని రైతులు స్పీకర్ కోడెలకు వినతి పత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. పట్టణంలోని 25వ వార్డులో నిర్వహించిన జన్మభూమి సభలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు ప్రజా సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టి తమ వార్డుల్లో చాలా సమస్యలు నెలకొన్నాయన్నారు.
అనంతవరంలో..
అనంతవరం(తుళ్లూరురూరల్): సమస్యలను పరిష్కరించలేని సభలు నిర్వహించడం ఎందుకు అని అనంతవరం ప్రజలు అధికారులను నిలదీశారు. గురువారం తుళ్లూరు మండలం అనంతవరం, వడ్డమాను గ్రామాలలో జన్మభూమి సభ నిర్వహించారు. వడ్డమాను రహదారిలోని కాలువ అస్తవ్యస్తంగా ఉందన్నారు. శ్మశాన వాటికకు నిధులు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామంలో క్వారీల నిర్వహణతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment